Sunday, September 8, 2024
HomeTrending NewsBJP vs BRS: నడ్డా...విషం చిమ్మే మాటలు - మంత్రి వేముల ఫైర్

BJP vs BRS: నడ్డా…విషం చిమ్మే మాటలు – మంత్రి వేముల ఫైర్

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా నాగర్ కర్నూల్ లో కేసిఆర్ ప్రభుత్వంపై చేసిన అసత్య ఆరోపణలపై రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చిన ప్రతిసారీ తెలంగాణ అభివృద్ది మీద విషం చిమ్మే మాటలే చెప్తున్నవ్,గుజరాత్ గులాంలైన ఇక్కడి బీజేపీ నాయకులు రాసిచ్చిన పాత స్క్రిప్ట్ నే ఎన్ని సార్లు చదువుతవ్ అని నిలదీశారు. ఇళ్ల నిర్మాణంలో అవినీతి జరిగిందని మాట్లాడుతున్న నడ్డా ఆ మాట అనడానికి సిగ్గుండాలన్నారు. కేసిఆర్ ప్రభుత్వం నిర్మిస్తున్న ఇండ్లకు నీ బీజేపీ కేంద్ర సర్కారు పైసలు ఇయ్యకున్న..అవార్డులు ఇస్తుంది నీకు తెలుసా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం కోసం 12వేల కోట్లు ఖర్చు పెడితే…మీరు కొసిరి కొసిరి ఇచ్చింది బోడి 1200 కోట్లు మాత్రమే అని తేల్చి చెప్పారు. ఈ సందర్బంగా రాష్ట్ర, కేంద్ర వాటాలను మంత్రి వివరించారు. కేసిఆర్ ప్రభుత్వం 2,92,538 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం 19, 402కోట్ల అంచనా వ్యయంతో చేపట్టి ఇప్పటి వరకు 11వేల 853కో ట్లు ఖర్చు చేసి 1,92,725 ఇండ్ల నిర్మాణం పూర్తి చేశామని తెలిపారు.

తెలంగాణలో నేషనల్ హైవేస్ కోసం కేంద్ర బీజేపీ మోడీ ప్రభుత్వం కాగితాల మీద 1లక్ష 21వేల కోట్లు మంజూరు చేసి 9ఏళ్లలో ఖర్చు చేసింది కేవలం 19 వేల కోట్లు మాత్రమే అని మంత్రి పేర్కన్నారు. అవి కూడా రాష్ట్ర ప్రజల నుండి టోల్ టాక్స్, సెస్ ల ద్వారా ముక్కు పిండి వసూలు చేసిన పైసలేనని,కేంద్రం తన జేబులోంచి ఇచ్చింది ఏమీ లేదని స్పష్టం చేశారు. కాగితాల మీద మంజూరి లెక్కలు చెప్పి తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న బీజేపీ నేతలు ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.

కేసిఆర్ ప్రవేశ పెట్టిన రైతు బంధును కాపీ కొట్టి పెట్టిన కేంద్ర కిసాన్ సమ్మాన్ నిధిలో రైతులకు కండీషన్లు పెట్టి రైతుల సంఖ్యను తగ్గించడం సిగ్గు చేటన్నారు. కేసిఆర్ ప్రభుత్వం తెలంగాణలో రైతు బంధు కింద 49లక్షల మంది రైతులతో మొదలు పెట్టి…నేడు లబ్దిదారుల రైతుల సంఖ్య 70 లక్షల మందికి చేరుకుందని వివరించారు. ఎకరానికి 10వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వమన్నారు. అదే కేంద్ర కిసాన్ సమ్మాన్ నిధి రాష్ట్రంలో మొదట 35లక్షల మంది రైతులకు ఇచ్చి సవాలక్ష ఆంక్షలు పెట్టి ప్రస్తుతం 29 లక్షల మంది రైతులకే కేంద్రం 2వేల చొప్పున ఇస్తుందన్నారు. కేంద్రం ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 29 లక్షల మంది రైతులకు ఇప్పటివరకు 9వేల కోట్లు ఖర్చు చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం 70లక్షల మంది రైతులకు ఈ సీజన్ వరకు 72వేల కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. రైతుల పట్ల ఎవరి చిత్త శుద్ది ఏంటో రాష్ట్ర,కేంద్ర గణాంకాలు చూస్తే అర్థమవుతుందన్నారు.

రైతుల పాలిట వరంగా మారిన ధరణి ని రద్దు చేసి..మళ్ళీ వీఆర్వో వ్యవస్థ తెచ్చి రైతులను గోస పెడదామనేది బీజేపీ ఆలోచనా అని మంత్రి మండిపడ్డారు. ధరణి పోర్టల్ లో రైతు భూమి వివరాలు ఆన్లైన్ రికార్డు కాబట్టే రైతు బంధు కింద రాష్ట్ర ప్రభుత్వం వేసే డబ్బులు నేరుగా రైతు ఖాతాలో జమ అవుతున్నాయన్నారు. కిసాన్ సమ్మాన్ నిధి రైతు లబ్ది దారులను గుర్తించడానికి తెలంగాణ రాష్ట్రంలో మాకు తక్కువ టైం పట్టిందని మీ కేంద్ర అధికారులే చెప్పారని గుర్తు చేశారు. కేసిఆర్ “అబ్ కి బార్ కిసాన్ సర్కార్” అని రైతులకు ఆసరగా నిలబడితే..బీజేపీ హరిగోస పెడుతున్నదని మండిపడ్డారు. పేదలు,రైతులు రెండు కండ్లుగా పని చేస్తున్న కేసిఆర్ ని జైల్లో పెడతారా..ఆ దమ్ముందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచభూతాలను అమ్మకానికి పెట్టి,దేశ సంపద తన కార్పోరేట్ మిత్రులకు దోచి పెడుతున్న ప్రధాని నరేంద్ర మోడీని ఎన్ని సార్లు జైల్లో పెట్టాలని మంత్రి వేముల ప్రశ్నించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్