Tuesday, September 17, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంమొబైల్ జీవితాలు

మొబైల్ జీవితాలు

ఇప్పుడంటే సెల్ ఫోన్లొచ్చేశాయిగానీ ఇరవయ్యేళ్ళ క్రితం ఇవిలేకుండా ఎలాబతికామో తలుచుకుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది

మనం పీజీ చేసిన తరవాత తిరుపతిలో ఒకేడాది ఉద్ధరించాం. అప్పుడు సీనియర్ రెసిడెంటని పేరు మనకి. అప్పుడే కొత్తగా దిగాయి పేజర్లు. బెల్టుబాంబుల్లా తగిలించుకునేవాళ్ళం అందరం.

ఒకరోజు మా కొలీగ్, నేనూ కలిసి కేంటీన్లో ఉండగా నడుందగ్గర జర్రుమని అదరడం మొదలెట్టింది. వాడు కంగారుపడిపోయి లేచి డాన్స్ మొదలెట్టాడు. టీ కాస్తా తెల్లపేంట్ మీద వొలికిపోయింది.

‘ఏఁవైందేఁవైంది?’ అంటూ అందరం హడావిడి చేశాం. తరవాత తెలిసింది వాడు మొలకి పేజర్ పెట్టుకున్నాడని! అదే ఫస్ట్ మెసేజ్ వాడికి. అంచేత తెలీలేదు.

గబగబా తీసి చూశాం…. ఐసియూనించేమో అని!

‘అరటిపళ్ళు తెండి’…ఇదీ మెసేజ్. అతని భార్య పంపింది. అదిచూసి అందరం ఒకటే నవ్వులు.

ఇక ఉద్యోగంలో చేరిన కొత్తలో వందపడకల తల్లీపిల్లల హాస్పిటల్లో ఏకైక అనెస్తటిస్టుని నేను. పండగా, ఆదివారం, పగలూరాత్రీ…. ఇవేవీ పాటించకుండా రెండేళ్ళు పీల్చిపిప్పి చేసేశారు.

పొద్దున్నప్పుడు పాలపేకెట్ గిన్నెలో ఒంపిన తరవాత ఇంకా దులుపుతాం చూడండీ… అలా వాడేసుకున్నారు నా సేవల్ని!

ఎంతంటే, ఒకవేళ కాలుకి దెబ్బతగిలి రానంటే ‘వీలైతే వీల్ చెయిర్లో వచ్చైనా’ ఎనస్తీషియా ఇమ్మనేవారు!

అప్పుడంతా ల్యాండ్‌లైన్ మీదే ఆధారపడేవాళ్ళం. మా హాస్పిటల్‌ మొత్తానికి ఒకటే ఫోను. అదికూడా రిసెప్షన్ దగ్గరుండేది.

కంగారుపడకండి. గవర్నమెంట్ హాస్పిటల్‌కు ఎటువంటి అందమైన రిసెప్షనిస్టూ వుండదు.

అటుగా ఎవరైనా వెళుతున్నప్పుడు ఫోన్ మోగితే తియ్యడమే! కానీ అది మన ప్రాణం తియ్యడమే!

నేను సెలవు అర్జెంటుగా పెడదామని ఫోన్ చేశానొకసారి!

ఒక స్వీపర్ ఫోన్ తీసింది. ‘‘అమ్మా! నేను డాక్టర్ జగదీష్ మాటాడుతున్నాను. ఓటీ వాళ్ళని ఎవర్నైనా పిలమ్మా!”

ఇంతకంటే విపులంగా ఎవడు మాటాడతాడు చెప్పండి?

దీనికి రెస్పాన్స్: పదినిమిషాల తరవాత స్వీపరొచ్చి ‘‘జగదీస్ బాబు ఓటీలో లేరంట బాబూ!” అని పెట్టేసింది.😢 😢

తల ఫోనుకేసి బాదుకోడంవల్ల చాలాసార్లు బొప్పికట్టింది కూడా!

కొన్నాళ్ళకి మొబైల్ ఫోన్లు కుడికాలు ముందుపెట్టి మన జీవితంలోకి ప్రవేశించాయి.

నా మొట్టమొదటి ఫోన్ ఫిలిప్స్ కంపెనీవారు బోల్డంత ప్లాస్టిక్‌నుపయోగించి తయారుచేసింది.

చిన్నప్పుడు మాయింట్లో కుంకుడుకాయలు కొట్టుకోడానికి ఓ పెద్ద రాయుండేది, తాడేపల్లిగూడెంనించి అమ్మ తెచ్చుకుంది. అచ్చం ఫిలిప్స్ ఫోను అలానేవుండేది.

ఫోన్ ఎత్తితే అర్ధరూపాయి, ఎవరికైనా కాల్ చేస్తే నాల్రూపాయలు చొప్పున కొన్నాళ్ళపాటు టాటావాడు నాదగ్గర్నుంచి సింహాచలం దేవుడికి గంధం వొలిచినట్టు వొలిచేశాడు. ఆ దేవుడికి ఏడాదికోసారే! మాకు నెలనెలా వొలిచేసేవాడు. మాక్కూడా ఆయనకిమల్లే మండిపోతూ వుండేది!

బిల్లు చూస్తే గుండె గుభిల్లుమనేది.

కొన్నిరోజులిలా కొలీగ్సందరం సెల్ బిల్లులు చూపించుకుంటూ ఒకళ్ళనొకళ్ళు కౌగిలించుకుని ఏడుస్తోంటే బియ్యెస్సెన్నెల్ వాళ్ళు ‘ఆదుకుంటాం’ అనొచ్చారు. కానీ వాళ్ళు మన జీవితాల్తో ‘ఆడుకోడానికి’ వచ్చారని తరవాత తెలిసింది.

అప్పుడు మా హాస్పిల్‌నుంచి వచ్చే ఎమర్జెన్సీల కారణంగాను, ప్రాక్టీస్ పరంగాను రాత్రి తెల్లవార్లూ కస్పారోడ్లో వెస్పా మీద తిరుగుతూనే వుండేవాణ్ణి. ఆ పక్కనే మాయిల్లు!

బియ్యెస్సెన్నెల్ రాగానే మావాళ్ళందరూ పొలోమని అందులోకెళిపోయారు. దేశం మొత్తంమీద నేనూ ఇంకో ఇద్దరూ మిగిలాం ఐడియాలో!

బియ్యెస్సెన్నెల్లో…
ఏ కేసు,
ఎన్నిగంటలకి,
ఏ నర్సింగ్ హోమ్…

ఇవితప్ప మిగతావన్నీ బాగా వినబడేవి. నా బొంద, అవేగా ముఖ్యమైనవీ?

ఎక్కువగా మావాళ్ళందరూ…. ‘నీకినిపిస్తందా? నాకు బానే ఇనిపిస్తంది!’ అన్నమాటే ఎక్కువ అంటుండేవారు తప్ప ఏంమాటాడుకునేవారు కాదు.

‘సర్లే! నేనొస్తన్నా!’ అనికూడా అనేసేవారు చివరికి ఏం వినబడక!

వాళ్ళందరిమధ్య నేను ఒక సుస్వరంతో నిలబడి వుండడం చూసి నాకొచ్చిన ‘ఐడియా’ వాళ్ళకెందుకు రాలేదా అని వాపోతుండేవారు.

ఇక ఫిలిప్స్ ఫోనువల్ల నాలుగు చొక్కాలకి జేబులు చిరిగాక ఒక చిన్న నోకియా ఫోన్ కొన్నాను. బుజ్జిగా భలేవుండేది. అందులో ఒకేఒక గేమ్…. స్నేక్!

పాపం! పాములాడించుకునేవాళ్ళలా అందరూ అదే ఆడేవారు. ట..డాగ్! అని సౌండొస్తే తెలిసేది..‘ఎవడో ఆడుతున్నాడూ..ఆడి పావుఁ సచ్చింద’ని!

ఎంతో అనురాగంతో కాపరం చేస్తున్న నన్నూ నా నోకియా ఫోన్నీ చూసి ఎవరి దిష్టో తగిలింది.

ఓసారి గుంటూరెళితే మా చిన్నాణ్ణి ఎత్తుకున్నాను. అప్పుడు వాడికి ఏడాదెళ్ళింది కానీ ఇంకా రెండు రాలా! వాడి గంగాప్రవాహానికి ఆ ఫోన్ లోపలున్న సమస్త వ్యవస్థలూ అవస్తకు లోనయ్యాయి.

షోరూంలో చూపిస్తే రెండు పెదవులూ, ఇంకా వేళ్ళూ కూడా విరిచి ‘జపాన్ పట్టుకెళ్ళినా రిపేరవ్వద’ని చెప్పేశారు.

అదే మొదలు.. అదే చివరా!

ఆ తరవాత సింపుల్‌గా ఓ వందఫోన్లు మార్చివుంటాను. ఎప్పుడూ రిపేరంటూ షాపుకి పట్టుకెళ్ళిన పాపానపోలేదు… వాటి పాపానికవి పోవడఁవే తప్ప!

ఇక నేనెక్కడికెళ్ళినా నాతోపాటు ఒక బ్రీఫ్ కేసుంటుంది. మీలాగే అందరూ అందులో ఓ స్టెతస్కోపూ, థర్మామీటరూ, నీ హేమరూ.. ఇలాంటివి వుంటాయనే అనుకుంటారు.

తీరా తెరిస్తే రకరకాల మొబైళ్ళు, ఛార్జర్లు… సి టైపు, మైక్రో యుఎస్బీ, మినీ యుఎస్బీ, నోకియా సన్నపిన్ను, దిబ్బపిన్ను ఛార్జర్లు, బ్లూటూత్ డివైజులు, వైఫై డాంగిల్సు, హెడ్ ఫోన్స్… ఒకటేమిటి చిన్నసైజు రిలయన్స్ డిజిటల్ షోరూములా వుంటుంది ఆ పెట్టంతా!

ఈపిచ్చి మొదట్నుంచీ నా జీవకణాల్లో వుందో, లేక మధ్యలో మ్యుటేషనో తెలీదుకానీ ఎలక్ట్రానిక్ వస్తువులంటే విపరీతమైన మోజు నాకు.

అమెజాన్, ఫ్లిప్ కార్ట్ …ఈ ఇద్దర్నీ పలకరించకపోతే రోజు గడవదు. ఎన్ని ఫోన్లు మార్చాను?! లెక్క తేలట్లేదు.

సిక్స్‌టీన్ జీబీ రామ్, టూఫిఫ్టీ సిక్స్ జీబీ ఇంటర్నల్, హండ్రడ్ మెగాపిక్సెల్స్ కెమెరా…. వింటూంటేనే అ…..బ్బ! అనిపించట్లేదూ?

ఇప్పుడంతా అరచేతిలోనేగా యాపారం! వేలకి వేలు ఒక్కవేలితో ఖర్చుపెట్టి బుక్ చేసెయ్యడమే! ఆన్‌లైన్ పేమెంట్ చేసేశాకా కొరియర్ వాడి ప్రాణాలు తోడెయ్యడం, “వచ్చిందా? వచ్చిందా?” అంటూ!

ఇక కొన్నకొత్తల్లో కొన్ని ఫోన్లు విచిత్రంగా ప్రవర్తిస్తూ వుంటాయి. మాటిమాటికీ ఆగిపోడం, ఉరేసుకోడం(హేంగవ్వడం 😜) …ఇలాంటివి.

కాల్ సెంటర్ వాడికి ఫోన్ చేస్తే అరగంటసేపు వాడు వినిపించిన మ్యూజిక్కంతా కంఠస్థం వచ్చాకా అప్పుడడుగుతాడు… ఏఁవిటి ప్రోబ్లమని!

చెప్పీ చెప్పగానే ‘‘కొత్తగా రిలీజైంది కదండీ! ఓ రెండు ఫర్మ్‌వేర్ అప్‌డేట్స్ రాగానే ప్రోబ్లమ్సన్నీ అవే సర్దుకుంటాయి!” అన్నాడు.

ఎవరైనా కొత్తగా పెళ్ళైన జంట మాటిమాటికీ కీచులాడుకుంటూంటే మానాన్నగారు ఇలానే అనేవారు…. ‘ఒకరిద్దరు పిల్లలు పుడితే వాళ్ళే కుదురుగా వుంటారు. అప్పటిదాకా ఇలాంటి చిన్నచిన్న తగాదాలు మామూలే!’ నాకెప్పుడూ ఆమాటే గుర్తొస్తుంది.😜

నాతో పనిచేసే వైద్యుల్లోనే కొంతమందికి ఇవన్నీ పరలోక విశేషాల్లా కనబడతాయి.

ఒకసారైతే ఒకావిడ “సర్! మీదే ఫోన్? నోకియానా?” అంది. నేను సమాధానమిచ్చేలోపు “ఎయిర్‌టెల్లా?” అనేసింది! అది వినేటప్పటికి నేను చిగురుటాకులా వణికిపోయాను. ఆవిణ్ణి కూర్చోబెట్టి ఎయిర్‌టెల్‌కీ, నోకియాకీ గల వ్యత్యాసాలు, సంబంధ బాంధవ్యాలు వివరించాల్సి వచ్చింది!

అప్పట్లోనే ఓసారి నాకారు సర్వీసింగుకి వెళ్ళింది. అర్జెంటుగా వైజాగ్ వెళ్ళాల్సివచ్చి బస్సెక్కాను. ప్రయాణం మధ్యలో హెడ్ ఫోన్స్ కోసం పెట్టె తెరిచాను. నాపక్కనున్నవాడు పెట్టెలోకి చూడనేచూశాడు.

వెంటనే జేబులోంచి మొబైల్ తీసి “బెదరూ! మనం సెల్ మెకానిక్కే కదా! ఇది మాటిమాటికీ ఆగిపోతందివై! ఓపాలి సూస్తావా?” అనడం, నాకు నవ్వూ, ఏడుపూ కలిసిరావడం… ఒకేసారి జరిగాయి.

నన్ను నేను పరిచయం చేసుకుని, మెకానిక్ కానంత మాత్రాన మునిగిందేమీలేదని, అతడి ఫోను సరిచేసి ఇచ్చాను. అతనన్నదాంట్లో అపార్ధం, అనర్ధం వున్నా అర్ధంలేకపోలేదు. కదూ?😜

ఈఫోన్లదొక గోల.

ఫీచర్లు చూస్తే అవుతాం ఎక్సైట్!
బేటరీ మాత్రం కావాలి ఎక్సైడ్!

నా ఈ అన్వేషణంతా అన్నీ మంచి ఫీచర్లున్న మంచి బేటరీ వున్న ఫోన్ కోసం!

గట్టిగా నాలుగ్గంటలు వాడితే సగం, రెండుగంటలు ఆడితే మిగతా సగం అయిపోయి ఎర్రరంగు గీతలొస్తాయి. ‘ఆఁ! పెడదాంలే!’ అని కూర్చుంటే నారింజ, నీలం, ఊదారంగుల్లోకి మారి …‘ఛార్జింగ్ పెడతావా పెట్టవా?’ అంటూ నిలదీస్తాయి!

ఛార్జింగ్ పెట్టగానే ‘ట్రింగ్!’ అంటూ ఏదో మెయిలొచ్చిన శబ్దం. తీరాచూస్తే స్టేట్‌బేంకు వాళ్ళు!

‘మేం మిమ్మల్నెప్పుడూ పాస్‌వర్డు అడగం, మీరుకూడా ఎవరైనా అడిగితే వెర్రిపీనుగుల్లా చెప్పెయ్యకండి!’ అని రోజూ రెండుపూటలా జాగృతం చేస్తుంటారు.

ఇక గూగుల్ వాడైతే మరీ విడ్డూరం!

“హాయ్! జగదీష్ కొచ్చెర్లకోట! డుయు నో భవానీ తురగా?” అనొకసారి

“ఇట్ సీమ్స్ యు మస్ట్ బి నోయింగ్ మిస్టర్‌ అఖిల్ కృష్ణ కొచ్చెర్లకోట! ” అనొకసారి మెయిళ్ళు పంపిస్తుంటాడు!

వాళ్ళు నా భార్యాపిల్లల్రా! అని ఎవరికి మొరపెట్టుకోవాలో నాకర్ధంకాదు!

ఎప్పుడో బుద్ధి గడ్డితిని ఏదో మాల్లో ఏవో కొన్ని వస్తువులు కొంటే ఓ తెల్లకాగితం ఇచ్చి పేరూ, గోత్రం, ఫోన్నెంబరూ రాయమన్నారు. అన్నీరాశాకా మడతెట్టి వరదబాధితుల సహాయనిధి పెట్టెలాంటిదాన్లో పడెయ్యమన్నారు. అది నా జీవితాన్ని తారుమారు చేసే పెట్టని నేనూహించలేదు.

హాస్పిటల్లో అర్ధరాత్రి, అపరాత్రని చూడకుండా రామ్ గోపాల్ వర్మ దెయ్యాల్లా తిరిగే వారెవరయ్యా అంటే.. మేమే… మత్తు డాక్టర్లం.

అప్పుడంతా రెండింటివరకే మా డ్యూటీ టైము. అయినా ప్రతిరోజూ అరగంటా, గంట ఆలస్యం అవుతూనే ఉండేది.

ఇంత కష్టపడి మధ్యానం మూడింటికి ఇంటికొచ్చి, నాలుగు మెతుకులు తిని అయిదింటిదాకా విశ్రాంతి తీసుకుందామని పడుకుంటే ఆరునిమిషాల్లో ఫోను గోలెట్టేసేది. తీరాతీస్తే…

“హలొసార్! మేం అనంత వెంకట సూర్య జగదీశ్వర…” నాపూర్తిపేరు వినేంత ఓపికలేదు నాకు.

“ఆ! నేనే! చెప్పు!”

“…కుమార్ గారితో మాటాడొచ్చాండీ?”

“చెప్పండి! నానెంబరెవరిచ్చారు మీకు?” కొత్తలో ఇలానే అమాయకంగా అడిగేవాణ్ణి.

“మీరీమజ్జ ఎక్కడేనా సాపింగ్ చేసారేటి సార్?”

మీరీమధ్య అన్నం తిన్నారా అన్నట్టుంది వెధవప్రశ్న!

“సరే! చెప్పమ్మా! “

“సర్, మేం డాక్టర్లకి ఏమీ అడక్కుండానే పది లక్సలు లోనిస్తన్నాం సర్! మీకేవైఁనా కావాలేట్సార్?”

“నాకేం వద్దమ్మా! సారీ!…”

“ఒక్సారి వినండ్సార్! ఫోన్ పెట్టీకండి. ఏవీఁ అడక్కుండా లోనిస్తాం సార్! తీస్కోవచ్చుకదా?”

“అడక్కుండా లోనివ్వడం కాదు. లోనిచ్చి ఏవీఁ అడగనంటే తీసుకుంటాను. పెట్టెయ్ ఫోను!”

సంపూర్ణ రామాయణం సినిమాలో విశ్వామిత్రుడు, ఆయన ఫ్రెండ్సు యాగం చేస్తోంటే పైనించి రాక్షసులు రక్తం పోస్తారు. అప్పుడు రామలక్ష్మణులు బాణాలేసి వాళ్ళని కొట్టిపడేస్తారు. అలా నాక్కూడా మధ్యానాలు ఈ ఫోన్లనించి కాపాడేవాళ్ళు దొరికితే బావుణ్ణు!

ఇదీ టూకీగా జగదీశ విరచిత మొబైలోపాఖ్యానం!!

……జగదీశ్ కొచ్చెర్లకోట

RELATED ARTICLES

Most Popular

న్యూస్