IPL-2022: ఐపీఎల్ లో నేడు జరిగిన రెండో మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుపై హైదరాబాద్ సన్ రైజర్స్ ఘన విజయం సాధించింది. హైదరాబాద్ బౌలర్లు మార్కో జాన్సెన్, నటరాజన్ దెబ్బకు బెంగుళూరు 68 పరుగులకే కుప్పకూలింది. బెంగుళూరులో ప్రభు దేశాయ్(15); మాక్స్ వెల్ (12)ఇద్దరే రెండంకెల స్కోరు చేశారు. కీలక బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ, అర్జున్ రావత్, దినేష్ కార్తీక్ లు డకౌట్ అయ్యారు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ ఒక వికెట్ మాత్రమే కోల్పోయి మరో 72 బంతులు మిగిలి ఉండగానే 9 వికెట్లతో తిరుగులేని విజయం దక్కించుకుంది.
ముంబై లోని బ్రాబౌర్న్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో హైదరాబాద్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఐదు పరుగుల వద్ద బెంగుళూరు వికెట్ల పతనం మొదలయింది. రెండో ఓవర్లో మార్కో జాన్సెన్ రెండు, మూడో బంతుల్లో డూప్లెసిస్(5); విరాట్ కోహ్లీలను (డకౌట్), చివరి బంతికి మరో ఓపెనర్ అర్జున్ రావత్ (డకౌట్) లను అవుట్ చేసి ఒకే ఓవర్లో మూడు వికెట్లు పడగొట్టి బెంగుళూరును కోలుకోలేని దెబ్బ తీశాడు.
ఐదో ఓవర్లో మాక్స్ వెల్ (12)) ను నటరాజన్ అవుట్ చేయగా, తొమ్మిదో ఓవర్లో జగ్దీశ సుచిత్ ఇద్దరు ఆటగాళ్ళు ప్రభు దేశాయ్ (15); దినేష్ కార్తీక్(డకౌట్) లను పెవిలియన్ పంపాడు. బెంగుళూరు 16.1 ఓవర్లలో 68 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మార్కో జాన్సెన్, నటరాజన్ చెరో మూడు; జగదీశ సుచిత్ రెండు, భువీ, ఉమ్రాన్ మాలిక్ చెరో వికెట్ పడగొట్టారు.
హైదరాబాద్ స్వల్ప లక్ష్యాన్ని 8 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. అభిషేక్ శర్మ 47 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హాఫ్ సెంచరీ త్వరగా పూర్తి చేయాలనే తొందరలో హర్షల్ పటేల్ బౌలింగ్ లో అనవసర షాట్ కొట్టి బౌండరీ లైన్ వద్ద అర్జున్ రావత్ పట్టిన క్యాచ్ కు ఔటయ్యాడు. విలియమ్సన్ 16 పరుగులతో నాటౌట్ గా నిలవగా, రాహుల్ త్రిపాఠి విన్నింగ్ షాట్ సిక్సర్ తో మ్యాచ్ ను ముగించాడు.
మార్కో జాన్సెన్ కు ‘ప్లేయర్ అఫ్ ద’ మ్యాచ్ దక్కింది.
Also Read : గుజరాత్ జోరు- కోల్ కతాపై గెలుపు