ఐపీఎల్ చరిత్రలో ఓ భారీ మ్యాచ్ కు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా నిలిచింది. సన్ రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మంచి జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ ఐపీఎల్ చరిత్రలో 277 పరుగుల అత్యధిక స్కోరు నమోదు చేసి రికార్డు సృష్టించగా… లక్ష్య ఛేదనలో ముంబై కూడా వీరోచితంగా పోరాడి 246 పరుగులు చేసి 31 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ముంబై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలి వికెట్ కు (మయాంక్ అగర్వాల్ 11) హైదరాబాద్ 45 పరుగులు చేసింది వన్ డౌన్ లో క్రీజులోకి వచ్చిన అభిషేక్ శర్మ మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ తో కలిసి చెలరేగిపోయాడు. ఫోర్లు, సిక్సర్లతో ముంబై బౌలర్లను ఉతికి ఆరేశారు. 24 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 64 పరుగులు చేసిన హెడ్ రెండో వికెట్ గా వెనుదిరిగాడు. అభిషేక్ శర్మ 23 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 63 రన్స్ చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత హెన్రిచ్ క్లాసేన్- ఏడెన్ మార్ క్రమ్ లు చెలరేగి ఆది నాలుగో వికెట్ కు 116 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తొలి మ్యాచ్ లో సత్తా చాటిన క్లాసేన్ నేడు కూడా ఫోర్లు, సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు. క్లాసేన్ 34 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 80; మార్ క్రమ్ 28 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్ తో 40 రన్స్ చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్య, పియూష్ చావ్లా, కోయేజ్ తలా ఒక వికెట్ పడగొట్టారు
అతి భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై దీటుగా ఆట మొదలుపెట్టింది. ఇషాన్ కిషన్ 13 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 34; రోహిత్ శర్మ 12 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 26 రన్స్ చేసి ఔటయ్యారు. మూడో వికెట్ కు నామాన్ ధీర్- తిలక్ వర్మ రెచ్చి పోయి ఆడి 84 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ధీర్ 14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 30 రన్స్, తిలక్ వర్మ 34 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లతో 64 పరుగులు చేసి ఔటయ్యాడు. కెప్టెన్ హార్దిక్ 24 రన్స్ చేయగా, టిమ్ డేవిడ్-42; రోమానియో షెఫర్డ్ 15 రన్స్ తో నాటౌట్ గా నిలిచారు. 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేయగలిగింది. హైదరాబాద్ బౌలర్లలో కెప్టెన్ కమ్మిన్స్, జయదేవ్ ఉనాద్కత్ చెరో 2; షాబాజ్ అహ్మద్ ఒక వికెట్ పడగొట్టారు.
అభిషేక్ శర్మకు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.