ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు చేరుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ తన చివరి లీగ్ మ్యాచ్ లోనూ అద్భుత విజయం సాధించింది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ తో జరిగిన నేటి మ్యాచ్ లో 215 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 5 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి సత్తా చాటింది. నగరంలో వర్షం కురిసే అవకాశాలున్నందున డక్ వర్త్ లూయీస్ పధ్ధతి ప్రకారం విజయం కోసం మొదటి నుంచే హైదరాబాద్ ఎదురుదాడి మొదలు పెట్టింది.
ఇన్నింగ్స్ తొలి బంతికే హిట్టర్ ట్రావిస్ హెడ్ డకౌట్ గా వెనుదిరిగినా అభిషేక్ శర్మ- రాహుల్ త్రిపాఠి రెండో వికెట్ కు 72 పరుగులు జోడింఛి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. అభిషేక్ శర్మ మరోసారి వీర విహారం చేసి 28 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 66 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా… క్లాసేన్ 26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 42; త్రిపాఠి 33; నితీష్ కుమార్ రెడ్డి 37 పరుగులతో విజయంలో తమవంతు పాత్ర పోషించారు. 19.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ దూకుడుగా ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. అథర్వ తైడే-ప్రభ్ సిమ్రాన్ లు హైదరాబాద్ బౌలింగ్ ను ఆటాడుకుని తొలి వికెట్ (అథర్వ్-46) కు 97 పరుగులు చేశారు. నటరాజన్ వీరి భాగస్వామ్యాన్ని విడదీశాడు. 45 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 71 పరుగులు చేసిన ప్రభ్ సిమ్రాన్ రెండో వికెట్ గా వెనుదిరిగాడు. రీలీ రూసో 24 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 49; కెప్టెన్ జితేష్ శర్మ 15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 రన్స్ తో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 214 స్కోరు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్ 2; కమ్మిన్స్, వ్యాస్కాంత్ చెరో వికెట్ పడగొట్టారు.
అభిషేక్ శర్మకు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.
ఈ విజయంతో పాయింట్ల పట్టికలో హైదరాబాద్ రెండో స్థానానికి చేరుకుంది. కోల్ కతా – రాజస్థాన్ మధ్య నేడు జరిగే మరో మ్యాచ్ లో రాజస్థాన్ విజయం సాధిస్తే సన్ రైజర్స్ మూడో స్థానానికి పడిపోతుంది. అప్పుడు బెంగులూరుతో ఎలిమినేటర్ ఆడాల్సి ఉంటుంది.
నేడు కోల్ కతా గెలిస్తే హైదరాబాద్ రెండో స్థానంలోనే కొనసాగి అదే జట్టుతో క్వాలిఫైర్ మ్యాచ్ ఆడుతుంది.