Monday, January 20, 2025
HomeTrending Newsహైదరాబాద్ మజ్లీస్ ఇలాకా

హైదరాబాద్ మజ్లీస్ ఇలాకా

హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం. ఒకప్పుడు అక్కడ ఏం జరుగుతోందో రాష్ట్ర ప్రజలు పట్టించుకునే వారు కాదు. ఎవరు బరిలో ఉన్నా గెలుపు పతంగి గుర్తుదే అన్నట్టుగా ప్రజలు ఒక్క చిత్తం చేసుకున్నారు. అలాంటి చోట ఇప్పుడు హోరాహోరీ జరుగుతోంది. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 20 లక్షల పైచిలుకు ఉండగా అందులో 59 శాతానికి పైగా ముస్లిం ఓటర్లే ఉన్నారు.

హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో ఎంఐఎం నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు, సిట్టింగ్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ పోటీ చేస్తున్నారు. బిజెపి నుంచి కొంపెల్ల మాధవి లత బరిలో ఉండగా కాంగ్రెస్ నుంచి వలీ ఉల్లా సమీర్, బీఆర్ఎస్ నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఆల్ ఇండియా మహిళా ఎంపవర్ మెంట్ పార్టీ అధ్యక్షురాలు నౌహీరా షేక్ పోటీ చేస్తున్నారు.

లోక్ సభ నియోజకవర్గం పేరు మీద శాసనసభ నియోజకవర్గం ఉండటం సహజం. అందుకు భిన్నంగా హైదరాబాద్ శాససనసభ నియోజకవర్గం లేకపోవటం గమనార్హం. దీని పరిధిలో చార్మినార్, యాకుత్పురా, చాంద్రాయణగుట్ట, మలక్ పేట, గోషామహల్, బహదూర్ పుర, కార్వాన్ శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. గోషామహల్ నుంచి బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ ప్రాతినిధ్యం వహిస్తుండగా మిగాతా ఆన్నింటిలో మజ్లీస్ గెలిచింది.

40 ఏళ్ళ నుంచి మజ్లీస్ కబ్జాలో ఉన్న హైదరాబాద్ లో 20 ఏళ్ళుగా అసదుద్దీన్ ఒవైసీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతకు ముందు ఆయన తండ్రి సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ వరుసగా గెలిచారు. 2004 నుంచి సునాయాసంగా గెలుస్తున్న అసద్ ఈసారి నియోజకవర్గంలోని అన్ని ప్రనతాలను చుట్టివస్తున్నారు.

మొదటిసారిగా ఇతర మతాల వారి ఆశీర్వాదం తీసుకోవటం కూడా చేస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో యాకుత్పురా, చార్మినార్ లో మజ్లీస్ కు చుక్కలు కనిపించాయి. దీంతో మజ్లీస్ నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

బిజెపి నుంచి మొదటిసారిగా మహిళా అభ్యర్థిని బరిలో దింపారు. విరించి ఆస్పత్రి డైరెక్టర్ మాధవి లతా ప్రచారంలో దూసుకుపోతున్నారు. పాత బస్తీకి చెందిన మాధవి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేవారిగా నగరవాసులకు తెలుసు. అయితే దశాబ్దకాలంగా ఆర్ఎస్ఎస్ సహకారంతో ఓల్డ్ సిటీలో విస్తృతంగా సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ పట్టు సాధించారు. మాధవి లతా ప్రచార శైలి పాతబస్తీ వాసులను బిజెపికి దగ్గర చేస్తోంది.

స్వల్ప వ్యవధిలోనే ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న మాధవి లతా ప్రచారం తీరు అగ్రనేతలను కూడా ఆకట్టుకుంది. మజ్లీస్ తప్పిదాలను ప్రశ్నిస్తూ… నగర రూపు రేఖలు మార్చేందుకు అవకాశం ఇవ్వండని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. మొదట్లో ఎమ్మెల్యే రాజ సింగ్ ప్రచారానికి దూరంగా ఉన్నా… అమిత్ షా పర్యటన తర్వాత ప్రచారంలో పాల్గొంటున్నారు. ఒక దశలో రాజ సింగ్ రాకపోతే ఆయన అప్రతిష్ట పాలు అవుతారని టాక్ మొదలైంది.

బీఆర్ఎస్ నుంచి నామమాత్రంగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ ను పోటీలో నిలిపారు. మజ్లీస్ కు సాయం చేసేందుకు, హిందూ ఓట్లు చీల్చేందుకు పోటీ చేయిస్తున్నారని బిజెపి విమర్శిస్తోంది.

మరోవైపు కాంగ్రెస్ నుంచి వలీ ఉల్లా సమీర్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ చివరి వరకు అభ్యర్థిని ప్రకటించకపోవటం అనుమానాలకు తావిస్తోంది. లోపాయికారిగా మజ్లీస్ తో అవగాహన కుదుర్చుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. నాంపల్లిలో పోటీ చేసి ఓటమి చెందిన ఫిరోజ్ ఖాన్ లోక్ సభకు పోటీ చేసేందుకు ఆసక్తి చూపినా పార్టీ అవకాశం ఇవ్వలేదు. ఫిరోజ్ ఖాన్ పోటీ చేసి ఉంటే ఈ దఫా అసదుద్దీన్ కు కష్టాలు వచ్చేవని విశ్లేషణ జరుగుతోంది.

మరోవైపు మజ్లీస్ బచావో తెహ్రీక్ (ఎంబిటి) ఆశ్చర్యకరంగా పోటీ నుంచి విరమించుకుంది. ముస్లిం ఓట్లు చీలకుండా ఎంబిటి పోటీ నుంచి తప్పుకుందని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ పరిణామంతో బిజెపి గ్రాఫ్ పెరిగిందని వార్తలు రావటంతో అమిత్ షా సహా అగ్రనేతలు ప్రచారానికి దిగుతున్నారు. మజ్లీస్ కు దొంగ ఓట్లు ఉన్నాయని మాధవి లతా తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది.

హైదరాబాద్ లో పోటీ ప్రధానంగా బిజెపి, ఎంఐఎం మధ్య కేంద్రీకృతం అయింది. మాధవి లత దూకుడు… అసదుద్దీన్ స్పీడుకు మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది. మునుపటి కన్నా మెజారిటీ పెరుగుతుందని మజ్లీస్… చరిత్ర తిరగరాస్తామని బిజెపి ఎవరికీ వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.

-దేశవేని భాస్కర్

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్