ఐపీఎల్ లో విధ్వంసం అనే పదానికి సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు అర్ధం చెప్పారు. ఢిల్లీ క్యాపిటల్స్ తో నేడు జరిగిన మ్యాచ్ లో పవర్ ప్లే లో టి 20 చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసిన రికార్డును తన పేరిట లిఖించుకుంది. 6 ఓవర్లలో 125 పరుగులు రాబట్టింది.
టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకుంది. ఖలీల్ అహ్మద్ వేసిన తొలి ఓవర్లోనే ఓ సిక్స్, మూడు ఫోర్లతో 19 రన్స్ సాధించి తాము ఏ రకంగా ఢిల్లీ బౌలింగ్ ను కకావికలం చేయబోతున్నమో తెలియజెప్పారు.
- 2వ ఓవర్ – లలిత్ యాదవ్ బౌలింగ్ లో 21 (2 ఫోర్లు, 2 సిక్సర్లు)
- 3వ ఓవర్ – నార్త్జ్ బౌలింగ్ లో 22 (4 ఫోర్లు, 1 సిక్సర్)
- 4వ ఓవర్ – లలిత్ బౌలింగ్ లో 21 (3 సిక్సర్లు)
- 5వ ఓవర్ – కులదీప్ బౌలింగ్ లో 20 ( 3 సిక్సర్లు)
- 6వ ఓవర్ – ముఖేష్ బౌలింగ్ లో 22 (4 ఫోర్లు, 1 సిక్సర్) తో పరుగుల పెనుతుఫాను సృష్టించి సమీప భవిష్యత్తులో మరే జట్టూ ఈ రికార్డు తిరగరాసే పరిస్థితి కూడా లేకుండా ఆడారు.
అభిషేక్ శర్మ 10 బతుల్లో 40; ట్రావిస్ హెడ్ 26 బంతుల్లో 82 రన్స్ సాధించారు. ఒకానొక దశలో ఈ మ్యాచ్ లో హైదరాబాద్ 300 పరుగుల మైలురాయిని అధిగమిస్తుందని అందరూ భావించారు.
కానీ కులదీప్ వేసిన ఏడో ఓవర్లో తొలి బంతిని స్టాండ్స్ లోకి పంపిన అభిషేక్ రెండో బంతికి ఔటయ్యాడు. 12 బంతులు ఆడిన అభిషేక్ 2 ఫోర్లు 6 సిక్సర్లతో మొత్తం 46 పరుగులు చేశాడు. అదే ఓవర్లో వన్ డౌన్ లో వచ్చిన ఏడెన్ మార్ క్రమ్ (1) కూడా వెనుదిరిగాడు. ఆ తర్వాత స్కోరు నెమ్మదించింది.
కులదీప్ వేసిన తొమ్మిదో ఓవర్ చివరి బంతికి ట్రావిస్ హెడ్ కూడా వెనుదిరిగాడు. 32 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్లతో 89 రన్స్ చేశాడు. హెన్రిచ్ క్లాసేన్ 8 బంతుల్లో 2 సిక్సర్లతో 15 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు.
నితీష్ కుమార్ రెడ్డి 27 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 37; అబ్దుల్ సమద్ 13; కమ్మిన్స్ 1 పరుగు చేసి ఔటయ్యాడు. షాబాజ్ అహ్మద్ 29 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 59 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 266 పరుగులు చేసింది.
కులదీప్ యాదవ్ కు 4; ముఖేష్, అక్షర్ పటేల్ చెరో వికెట్ సాధించారు.
ఈ మ్యాచ్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి రికార్డుల మోత మోగించింది.
- టి 20 చరిత్రలో పవర్ ప్లే లో అత్యధిక పరుగులు (125)
- ఐపీఎల్ లో తొలి ఐదు అత్యధిక పరుగుల్లో మూడు హైదరాబాద్ వే.. అవి కూడా ఈ సీజన్ లోనే (287. 277, 266)
- ఫ్రాంచైజీ క్రికెట్ లో మూడు సార్లు 250 స్కోరు అధిగమించిన టీమ్ రికార్డును సమం చేసింది.
- ఓ ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్స్ లు చేసి తాను నెలకొల్పిన రికార్డును మరోసారి సమం చేసింది.