Friday, October 18, 2024
Homeజాతీయంఅమీన్ సయానీకి వీడ్కోలు 'బిగుల్'

అమీన్ సయానీకి వీడ్కోలు ‘బిగుల్’

నా చిన్నప్పుడు నాకు హిందీ పాటల్ని ముందుగా పరిచయం చేసి, నా పెద్దప్పుడు నా బుర్ర పిచ్చెక్కించిన ‘బినాకా గీత్ మాలా’ సృష్టికర్త అమీన్ సయానీ తన 91వ ఏట ఫిబ్రవరి20న ముంబైలో నిశ్శబ్దంగా ఈ లోకం నుంచి నిష్క్రమించారు.

బినాకా గీత్ మాలా పేరు వినగానే నాకు నా కాలేజీ రోజులు గుర్తుకొస్తాయి. ప్రతి బుధవారం రాత్రి 8 గంటలు కాగానే ఎన్ని పనులున్నా వాటిని పక్కన పడేసి రేడియో ముందు కూర్చుని రెండు చెవులూ అమీన్ సయానీకి అప్పగించేసిన మధుర జ్ఞాపకాలు కళ్ల ముందు మెదుల్తాయి.

అమీన్ సయానీ..అసలా పేరులోనే ఏదో మత్తు..ఆ స్వరంలోనే ఒక గమ్మత్తు.. హిందీ ఒక్క ముక్క రాకపోయినా, హిందీ పరీక్షలో అత్తెసరు మార్కులతో గట్టెక్కినా, వచ్చిన ప్రతి హిందీ సినిమా చూస్తూ, హిందీ పాటలు వింటుండే ఆ స్టూడెంట్ రోజుల్లో ఆ గంట ప్రోగ్రాంలో అమీన్ సయానీ ఒక్కో పాట గురించి చెబుతుంటే అదేంటో ఇట్టే అర్ధమై పోయేది. బహుశా ఆయన అంత సరళమైన హిందీలో మాట్లాడేవారు కాబోలు.

ప్రతి గురువారం పొద్దున్న మా ఏవీఎన్ కాలేజీ ఆవరణలో చెట్టు నీడ కింద క్లాసులెగ్గొట్టే మా బీకాం గ్యాంగు మొట్టమొదటిగా మాట్లాడుకునే టాపిక్కు ముందు రోజు బినాకా గీత్ మాలాలో వచ్చిన పాటలూ, అమీన్ సయానీ మాటలూను. ఉక్కు ఉద్యమం, ముల్కీ ఉద్యమాల గురించి చర్చించుకున్నంత సీరియస్ గా బినాకా గీత్ మాలా గురించి మాట్లాడుకునేవాళ్లం.

ఆ రోజుల్లో నాకు గుర్తున్నంతవరకు బినాకా గీత్ మాలాలో ఆ వారం ‘ట్రెండింగ్’లో ఉన్న పాటలు పదిహేనో, పదహారో వచ్చేవి. వాటిలో సగానికి సగం పాటలు ఆర్డీ బర్మన్, కిషోర్ కుమార్ లాగేసుకుంటే మిగతా వాటిని మహమ్మద్ రఫీ, ముఖేష్, శంకర్ జైకిషన్, లక్ష్మీకాంత్ ప్యారేలాల్, కల్యాణ్ జీ ఆనంద్ జీ పంచుకునేవారు. హఠాత్తుగా ఓపీ నయ్యర్, రవీంద్ర జైన్ కూడా తమ వాటా కోసం చొరబడిపోయేవారు. అత్యంత ప్రజాదరణ పొందిన పాటని చిట్ట చివరి పాటగా వేసేవారు అమీన్ సయానీ. ఉదాహరణకి రూప్ తెరా మస్తానా, దమ్ మారో దమ్, జిందగీ ఏక్ సఫర్ హై సుహానా, దోస్త్ దోస్త్ నా రహా..ఇలాంటి పాటలన్నమాట.

అలా బినాకా గీత్ మాలా ప్రోగ్రాంలో చిట్టచివరి పాటగా ఎన్నో సార్లు (బహుశా 18 సార్లు) ప్లే చేసిన పాటకి ‘ఇక చాల్లే’ అన్నట్టు ముగింపు సూచకంగా ఒక బిగుల్ (ట్రంపెట్) వాయించి ఎంతో ఘనంగా వీడ్కోలు చెప్పేవారు అమీన్ సయానీ. నేనిప్పుడు నా మనసులో అమీన్ సయానీని తలుచుకుంటూ, ఆ బిగుల్ ని అదే వీడ్కోలు బాణీలో వాయిస్తున్నాను.

— మంగు రాజగోపాల్

RELATED ARTICLES

Most Popular

న్యూస్