కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వస్తోందని వైఎస్సార్సీపీ నేత, రాజ్య సభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ వెల్లడించారు. ఆ కారణాలేమిటో బహిరంగంగా అన్నీ మీడియాకు చెప్పలేనన్నారు. రాజీనామా ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదని… తనకు మొదటినుంచీ ఢిల్లీపై ఆసక్తి లేదని, రాజ్యసభకు వచ్చి పైరవీలు చేసుకునే తత్వం తనది కాదని …. స్థానిక రాజకీయాల్లోనే పని చేయాలనేది తన అభిమతమని చెప్పారు. చాలా రోజులుగా అసంతృప్తితోనే ఉన్నానని, తనకు ఎమ్మెల్యే సీటు నిరాకరించినప్పుడే రాజీనామా ఆలోచన చేశానన్నారు. సన్నిహితులతో చర్చించిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.
తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నానని… తన అభిమానులు, కార్యకర్తలు కూడా దీనిపై సానుకూలంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలంగా ఉండాలని అనుకున్నందునే రాజ్య సభకు రాజీనామా చేస్తున్నానని చెప్పారు.
గతంలో ఎమ్మెల్యేగా ఓడిపోయినా మంత్రి పదవి ఇచ్చారంటూ వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని… కానీ అంతకంటే ముందు జగన్ కోసం తాను ఎంత గ్యాగం చేశానో గుర్తు చేసుకోవాలని మోపిదేవి ప్రతిస్పందించారు.