Babu hehind this: కంచర్ల జల్లయ్య హత్య కేసులో తనకు ఎలాంటి ప్రమేయం లేదని, అయినా సరే తెలుగుదేశం పార్టీ తన పేరు లాగడం దుర్మార్గమని ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి మండిపడ్డారు. దుర్గి మండలం జంగమహేశ్వరపాడుకు చెందిన జల్లయ్య మొత్తం 10 కేసుల్లో ఏ-1 ముద్దాయిగా ఉన్నాడని, ఆ గ్రామంలో ఓ కేసుకు సంబంధించి తానే స్వయంగా రాజీ కుదిర్చానని పిన్నెల్లి వివరించారు. తాను హత్యా రాజకీయాలు చేయాలనుకుంటే ఇరు వర్గాలనూ కూర్చోబెట్టి ఎందుకు రాజీ చేస్తానని ప్రశ్నించారు.
ప్రశాంతంగా ఉన్న మాచర్ల నియోజకవర్గానికి ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న జూలకంటి బ్రహ్మారెడ్డి ని ఇన్ ఛార్జ్ గా నియమించారని, అప్పటినుంచే ఇక్కడ అల్లర్లు మళ్ళీ మొదలయ్యాయని పిన్నెల్లి విమర్శించారు. 2009లో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని అప్పటి నుంచి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, ఈ 13 ఏళ్ళల్లో ఎప్పుడూ ఇలాంటి రాజకీయాలు తాను చేయలేదని స్పష్టం చేశారు.
ఎల్లో మీడియా, తెలుగుదేశం పార్టీలు కలిసి పచ్చగా ఉన్న పల్నాడు ప్రాంతంలో చిచ్చు రేపి గొడవలు సృష్టించాలని చూస్తున్నారని, ఈ ట్రాప్ లో పడొద్దని పిన్నెల్లి విజ్ఞప్తి చేశారు. కోనసీమలో కూడా చంద్రబాబు ఇలాంటి రాజకీయాలే చేశారని, కులాలు, వర్గాలను అడ్డు పెట్టుకొని, రక్తపాతాన్ని సృష్టించి ఓట్లు సంపాదించాలని చూస్తున్నారని పిన్నెల్లి ధ్వజమెత్తారు. ఎవరూ ఉద్రిక్తతలకు లోను కావోద్దని టిడిపి, వైసీపీ నేతలకు పిన్నెల్లి సూచించారు. ఈ గొడవల్లో ఎవరు చనిపోయినా ఓట్లు వస్తాయనే ఆలోచనలో బాబు ఉన్నారని, కానీ క్షణికావేశంలో కొన్ని కుటుంబాలు అనాథలవుతున్నాయన్న విషయం గుర్తుంచుకోవాలని హితవు పలికారు.