సినీ నటి, దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’. బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్, జయలలిత పాత్ర పోషిస్తుండగా.. విలక్షణ నటుడు అరవింద్ స్వామి ఎంజీఆర్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. ఏఎల్ విజయ్ డైరెక్ట్ చేస్తున్నారు. ‘తలైవి’ సినిమాను తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. విబ్రి మీడియా, కర్మ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. సెప్టెంబర్ 10న సినిమా విడుదల అవుతున్న సందర్భంగా అరవింద్ స్వామి చెప్పిన చిత్ర విశేషాలు ఆయన మాటల్లోనే..
ఎంజీఆర్ అంటే అందరికీ ఓ లెజెండ్. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. సినీ, రాజకీయాల్లో ఆయన ఎన్నో విజయాలు సాధించారు. ప్రజల అభిమానాన్ని పొందారు. ఆయన పాత్రను పోషించడం బాధ్యతగా ఫీలయ్యాను. విజయ్ సర్ నాకు ఆ పాత్రను ఆఫర్ చేశారు. ఆ పాత్రను పోషించడం ఛాలెజింగ్ అనిపించింది. అందుకే తలైవి సినిమాను చేశాను. ఎంజీఆర్ పాత్రను పోషించడం బాధ్యత అనుకున్నప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఆయన్ను ఎంతో మంది ప్రజలు అభిమానిస్తున్నారు. ఏ తప్పు కూడా చేయకూడదు. ఇమిటేట్ చేస్తూ నటించడం మామూలు విషయం కాదు. ఆయన జీవితాన్ని కూడా అర్థం చేసుకోవాలి. స్క్రిప్టులోని ఎమోషన్స్ కు కనెక్ట్ అవ్వాలి. బాడీ లాంగ్వేజ్‌ను పట్టుకునేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది.
సినిమాల్లోని ఆయన మ్యానరిజం వేరు.. పర్సనల్ లైఫ్‌లోని మ్యానరిజం వేరు. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేయాల్సి వచ్చింది. ‘తలైవి’ సినిమాలో ఎవ్వరి గురించి నెగెటివ్ చెప్పలేదు. కొన్ని రాజకీయ ఘటనలు జరిగాయి. కానీ దాని వెనుకున్న నేపథ్యాన్ని ఇందులో చూపించారు. ఒకరు మంచి ఇంకొరు చెడు అని చూపించడం లేదు. రాజకీయాల్లో కొందరు స్నేహితులు, శత్రువులుంటారు. వారి జీవితాలు అంతర్లీనంగా కనెక్ట్ అయి ఉంటాయి. ఇందులో వారి మానవీయ కోణాలను టచ్ చేశారు. ఎంజీఆర్ మనకు ఎన్నో రూపాల్లో కనిపించారు. సినిమాల్లో ఒకలా.. ఆరోగ్యం బాగా లేని సమయంలో మరోలా.. రాజకీయాల్లోకి వచ్చాక ఇంకోలా కనిపించారు. నటనల్లోనూ ఎన్నో రకాల పాత్రలను చేశారు. అందుకే ఈ సినిమాలో ఎంజీఆర్ కెరీర్‌ను నాలుగు దశలుగా విభజించారు. ఈ చిత్రంలో ఎంజీఆర్‌గా నాలుగు షేడ్స్ లో కనిపించాను.
ప్రిపేర్ అవ్వడం వేరు.. సెట్ మీద వెళ్లి నటించడం వేరు.. నేను ఎంత బాగా ప్రిపేర్ అయినా కూడా సినిమాను జనాలు చూడరు.. సినిమాలో బాగా చేస్తేనే చూస్తారు. అందుకే నేను అలా కష్టపడ్డాను, ఇలా కష్టపడ్డాను అని అంటే కుదరదు. ఆ పాత్రను నేను ఎంతా బాగా చేశాను అని చూస్తాను తప్పా.. ఆ పాత్ర కోసం ఎంత కష్టపడ్డాను అనేది చూడను. నేను ఎప్పుడూ కూడా ఎంజీఆర్‌తో పోల్చుకోను. పైగా నేను ఆయనకు అభిమానిని. నేను ఓ ప్రయత్నం చేశాను అంతే. నేను ఎంజీఆర్‌ను కాను. నేను ఓ నటుడ్ని. నా పేరు అరవింద్ స్వామి. ఆయనలా నటించేందు ప్రయత్నించాను. నా వరకు నేను వంద శాతం ఎఫర్ట్ పెట్టి ప్రయత్నించాను.
‘తలైవి’ సినిమాలో కంగనా, నాజర్, సముద్రఖని ఇలా చాలా మంది గొప్ప నటులున్నారు. అలాంటి వారి మధ్య సీన్లు పడితే అవి ఖచ్చితంగా ఇంకా ఎలివేట్ అవుతాయి. అందరి పర్ఫామెన్స్ బాగుంటుంది. ఇదొక మంచి అనుభవం. హైదరాబాద్ లో నాకు చాలా మంది స్నేహితులున్నారు. ఇక్కడ షూటింగ్‌లు చేయక ముందు నుంచే నాకు ఈ సిటీ తెలుసు. నాకు ఇక్కడి ఫుడ్ అంటే ఇష్టం. ఇక్కడి ప్రేక్షకులు నన్ను ఎంతో ప్రేమిస్తున్నారు. ఇక్కడ నాకు ఎన్నో అద్భుతమైన మెమోరీస్ ఉన్నాయి.
‘నవరస’ వెబ్ సిరీస్‌లో అగ్ని ప్రాజెక్ట్ లో నటించాను. ‘రౌద్రం’ కథకు దర్శకత్వం వహించాను. ఇరవై ఏళ్ల క్రితమే దర్శకత్వం వహించాలని అనుకున్నాను. కానీ అప్పుడు సమయం కుదరలేదు. నటించడం కంటే దర్శకత్వం చేయడమే ఈజీ. ఇప్పుడు నా దగ్గర నాలుగు స్క్రిప్టులున్నాయి. అన్నీ కూడా డిఫరెంట్ జానర్స్. తెలుగు సినిమాల్లో అనుకున్నాను. కానీ ముందు అనుకున్న కమిట్మెంట్స్ వల్ల కుదరడం లేదు. మంచి క్యారెక్టర్ వస్తే అది చిన్నదా పెద్దదా? అని కూడా ఆలోచించడం లేదు. తెలుగులో సినిమా చేయాలని చూస్తున్నాను. అంటూ పలు విశేషాలు వెల్లడించారు అరవింద్ స్వామి.