Nara Lokesh Warning: తన తల్లిని కించపరిచిన వాళ్ళను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హెచ్చరించారు. ‘వైసీపీ నేతలకు మానవత్వం ఉందా? నిబద్ధతతో తన పని తాను చేసుకునే వ్యక్తిని బైటకు లాగుతారా అని లోకేష్ ప్రశ్నించారు. మానవత్వం ఉందా మీకు, ఇంట్లో తల్లి, భార్య, కూతుళ్ళ తో కూడా ఇలాగే మాట్లాడతారా’ అని వైసీపీ నేతలను లోకేష్ ఘాటుగా నిలదీశారు.
రాయలసీమ జిల్లాల్లో ఇటీవల సంభవించిన వరదల్లో ప్రాణాలు కోల్పోయిన 48 మంది కుటుంబాలకు, ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున నారా భువనేశ్వరి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున 48 లక్షలు మొన్న తిరుపతిలోని ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ కార్యాలయ ఆవరణలో పంపిణీ చేశారు. ఈ సందర్బంగా భువనేశ్వరి అసెంబ్లీ సంఘటనపై స్పందించారు. ఆమె చేసిన వ్యాఖ్యలకు మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే ఆర్కే రోజాలు కౌంటర్ ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న లోకేష్, వైసీపీ నేతలు చేసిన విమర్శలకు నేడు గట్టిగా బదులిచ్చారు.
గతంలో హుదుద్ తుఫాను సంభవిస్తే 50 లక్షల పరిహారం ప్రకటించిన నాటి ప్రతిపక్షనేత జగన్ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని, హుదూద్ పరామర్శల కోసం ఆయన తిరిగిన వాహనాల పెట్రోల్ కూడా ప్రభుత్వమే కొట్టించిందని లోకేష్ విమర్శించారు.
ఇటీవలి వరదల్లో బాధితులకు సహాయ అందించేందుకు గాను కోటి రూపాయలు తన తల్లి భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఖర్చు చేశారని లోకేష్ వెల్లడించారు. వరదల సమయంలో వైసీపీ నేతలు పేకాటలు ఆడుకుంటూ కాలక్షేపం చేశారని, కొంతమంది బియ్యం అమ్ముకున్నారని ఆరోపించారు.
తన తల్లిపై విమర్శలు చేస్తున్న వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని, చంద్రబాబు మంచితనంతో వదిలి పెట్టినా, తాను అలాంటి వాడిని కాదని, వారు ఎక్కడున్నా వదిలిపెట్టబోనని తీవ్ర పరిణామాలుంటాయని లోకేష్ ఘాటుగా హెచ్చరించారు.
Also Read : విమర్శలు పట్టించుకోము: భువనేశ్వరి