ఐసీసీ టి-20 పురుషుల వరల్డ్ కప్ లో నిన్న జరిగిన రెండు గ్రూప్ మ్యాచ్ ల్లో నెదర్లాండ్స్ పై ఐర్లాండ్; నమీబియాపై శ్రీలంక ఘనవిజయం సాధించాయి,
అబుదాబి లోని షేక్ జయేద్ స్టేడియంలో నెదర్లండ్స్- ఐర్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన నెదర్లండ్స్ కెప్టెన్ పీటర్ సీలర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్ మ్యాక్స్-51 (47 బంతుల్లో 7 ఫోర్లు) ; కెప్టెన్ పీటర్-21 మినహా మిగిలిన బ్యాట్స్ మెన్ విఫలం కావడంతో నిర్ణీత 20 ఓవర్లలో 106 పరుగులకే నెదర్లాండ్స్ ఆలౌట్ అయ్యింది. ఐర్లాండ్ బౌలర్లలో కర్టిస్ క్యాంపర్ నాలుగు, మార్క్ అడైర్ మూడు, సుహువా ఒక వికెట్ పడగొట్టారు.
ఐర్లాండ్ జట్టులో ఓపెనర్ పాల్-30; డెలానీ-44 (29 బంతుల్లో 5ఫోర్లు, 2సిక్సర్లు) రాణించడంతో 15.1 ఓవర్లలోనే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 107 పరుగులు చేసి ఏడు వికెట్లతో ఘనవిజయం సాధించింది. నెదర్లాండ్స్ బౌలర్లలో ఫ్రెడ్, బ్రాండన్ గ్లోవర్, పీటర్ తలా ఒక వికెట్ సాధించారు.
నాలుగు వికెట్లు పడగొట్టిన ఐర్లాండ్ బౌలర్ కర్టిస్ క్యాంపర్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.
అదే స్టేడియంలో జరిగిన మరో మ్యాచ్ లో శ్రీలంక కెప్టెన్ టాస్ గెలిచి నమీబియాను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. లంక బౌలర్లు చక్కని బంతులతో నమీబియా బ్యాట్స్ మెన్ కు చుక్కలు చూపించారు. క్రెగ్ విలియమ్స్-29; కెప్టెన్ గెర్తాడ్-20; జే జే స్మిత్-11 మినహా మిగిలిన వారు విఫలమయ్యారు. దీనితో నమీబియా 19.3 ఓవర్లలో 96 పరులుగు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. శ్రీలంక బౌలర్లలో మహీష తీక్షణ మూడు, కుమార, హసరంగ చెరో రెండు, కరునరేత్నే, చమీర చెరో వికెట్ పడగొట్టారు.
స్వల్ప లక్ష్యాన్ని వేగంగా ఛేదించే క్రమంలో లంక ఓపెనర్లు త్వరగా ఔటయ్యారు. ఆ తర్వాత అవిష్క ఫెర్నాండో-30 (28 బంతుల్లో 2 ఫోర్లు); భానుక రాజపక్ష -42 (27 బంతులు, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించి అజేయంగా నిలిచారు. దీనితో శ్రీలంక 13.3 ఓవర్లలో 3 మూడు వికెట్లు కోల్పోయి ఏడు వికెట్లతో ఘన విజయం సాధించింది.
మూడు వికెట్లతో రాణించిన మహీష తీక్షణ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.