Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్దాయాదుల పోరులో పాకిస్తాన్ పైచేయి

దాయాదుల పోరులో పాకిస్తాన్ పైచేయి

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూసిన దాయాదుల పోరులో ఇండియాపై పాకిస్తాన్ ఘనవిజయం సాధించింది. గతంలో టి20 టోర్నీల్లో ఐదుసార్లు పరాజయం చవిచూసిన పాకిస్తాన్ ఈసారి ఘనవిజయంతో ఆ ఓటములన్నింటికీ ఒకేసారి ప్రతీకారం తీర్చుకుంది. షహీన్ అఫ్రిది ఇండియా బ్యాటింగ్ లైనప్ ను దెబ్బతీయగా, పాక్ ఓపెనర్లు కెప్టెన్ బాబర్ ఆజమ్, మొహమ్మద్ రిజ్వాన్ లు చెలరేగి ఆడడంతో పాకిస్తాన్ 17.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని సాధించింది.

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఐసిసి టి-20 వరల్డ్ కప్ సూపర్-12 రౌండ్ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే రోహిత్ శర్మ (1)ను ఎల్బీగా అవుట్ చేసిన ఆఫ్రిది మూడో ఓవర్లో మరో ఓపెనర్ కెఎల్ రాహుల్ (3)ను బౌల్డ్ చేశాడు.  ఆ తర్వాత హసన్ అలీ ఆరో ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ ను పెవిలియన్ పంపాడు. ఈ దశలో కెప్టెన్ కోహ్లీ, రిషభ్ పంత్ లు నాలుగో వికెట్ కు 53 భాగస్వామ్యం నెలకొల్పారు. పంత్ 30 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లతో 39 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత జడేజా, హార్దిక్ పాండ్యాలు కూడా సరిగా రాణించలేకపోయారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ 49 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్ తో  57 పరుగులు చేసి 19వ ఓవర్లో ఔటయ్యాడు. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో అఫ్రిది మూడు, హసన్ అలీ రెండు, షాదాబ్ ఖాన్, రాఫ్ చెరో వికెట్ పడగొట్టారు.

ఇండియా విసిరిన 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ మొదటి ఓవర్ నుంచే ఎదురుదాడి చేసింది భువి వేసిన మొదటి ఓవర్లోనే పాక్ ఓపెనర్ రిజ్వాన్ ఒక సిక్సర్, ఒక ఫోర్ తో పది పరుగులు చేశాడు. ఏ దశలోనూ భారత బౌలర్లు పాకిస్తాన్ ఓపెనర్లను కట్టడి చేయలేకపోయారు. కెప్టెన్ బాబర్ ఆజమ్ 52 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 68; రిజ్వాన్ 55 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 79 పరుగులు చేసి అజేయంగా నిలిచి తమ జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించారు.

నాలుగు ఓవర్లలో 31 పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు తీసిన షహీన్ అఫ్రిది కే ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్