వైఎస్సార్సీపీ సీనియర్ నేత, రాజ్య సభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్ర బోస్ సంచలన ప్రకటన చేశారు. కొంత కాలంగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ పై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తోన్న బోస్…. వచ్చే ఎన్నికల్లో రామచంద్రాపురం టికెట్ ను మంత్రికి కేటాయిస్తే తాను లేదా తన కుమారుడు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామని ప్రకటించారు.
మంత్రికి టికెట్ ఇస్తే తాను ఎంపి పదవికి రాజీనామా చేసి పోటీకి సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. పార్టీ నిర్మాణం దగ్గరినుంచి తాను కొనసాగుతున్నానని, వేణు 2014 ఎన్నికల తర్వాత వచ్చాడని విమర్శించారు. ఓదార్పు యాత్ర సమయంలో జగన్ పర్యటిస్తున్నప్పుడు ఏనాడూ కనబడలేదని, పార్టీకి అన్యాయం జరుగుతోంది కాబట్టే తాను స్పందిస్తున్నానని, కార్యకర్తల అభీష్టం మేరకే తాను నడుచుకుంటానని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మంత్రిని సమర్ధించే ప్రసక్తే లేదని, కలలో కూడా అతణ్ణి నమ్మబోనని తేల్చి చెప్పారు. ఇతర పార్టీల వారు తనను ఆహ్వానించలేదని, ఆ ప్రయత్నం ఎవరూ చేయబోరని… ఎన్నికల నాటికి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
కొంత కాలంగా మంత్రి చెల్లుబోయిన- పిల్లి వర్గాల మధ్య నియోజకవర్గంలో తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయని, తన వర్గం నేతలపై మంత్రి అక్రమ కేసులతో ఇబ్బంది పెడుతున్నారని బోస్ వర్గం ఆరోపిస్తోంది. మరోవైపు బోస్ తనకు గురువు లాంటి వారని, సిఎం జగన్ ఆదేశాల మేరకు నడచుకుంటానని చెబుతున్నారు. ఇటీవలే సిఎం జగన్.. పిల్లిని తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి పిలిపించుకుని నచ్చజెప్పినా అలక వీడలేదు.