Sunday, November 24, 2024
HomeTrending Newsబాబుపై పోటీకి సిద్ధం : పెద్దిరెడ్డి సవాల్

బాబుపై పోటీకి సిద్ధం : పెద్దిరెడ్డి సవాల్

మైనార్టీలకు సముచిత స్థానం కల్పించిన ఘనత వైఎస్ జగన్, వైఎస్సార్సీపీకి దక్కుతుందని రాష్ట్ర విద్యుత్, గనుల శాఖ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఓ మైనార్టీని ఎంపిపిగా చేసింది తానేనని, మరో మైనార్టీని జడ్పీటీసీగా చేశామని, పుంగనూరు మున్సిపాలిటి జనరల్ అయినా ఓ మైనార్టీ ఇచ్చామని, వారికి తానుగానీ, తమపార్టీ గానీ ఎన్నడూ అన్యాయం చేయలేదని వివరించారు.  బాబుకు ఉన్నట్లుండి మైనార్టీలపై ప్రేమ పుట్టుకు వచ్చిందని ఎద్దేవా చేశారు. టిడిపి కార్యకర్తలను రెచ్చగొట్టి, సంఘ విద్రోహ శక్తులుగా తయారుచేశారని.. అలాంటి వారు  పుంగనూరులో రెచ్చగొట్టే రాజకీయాలు చేసినందుకు కొంతమందిని పోలీసులు అరెస్టు చేస్తే వారికి న్యాయమూర్తి రిమాండ్ విధించారని, దానికి జడ్జిలపై కూడా బాబు అనుచిత వ్యాఖ్యలు చేశారని పెద్దిరెడ్డి గుర్తు చేశారు.

తమ నేత జగన్ అనుమతిస్తే  కుప్పంలో బాబుపై పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని పెద్దిరెడ్డి ప్రకటించారు. లేదా పదే పదే పుంగనూరు పై మాట్లాడుతున్న చంద్రబాబు దమ్ముంటే  తనపై ఇక్కడ పోటీ చేయాలని…. ఈ సవాల్ ను బాబు స్వీకరించాలని ఛాలెంజ్ చేశారు. సిఎం జగన్ తమకు పూర్తి స్వేఛ్చ ఇచ్చారని, అందుకే జిల్లా వ్యాప్తంగా ప్రజలతో మమేకపై పనిచేస్తున్నామని, ఇది బాబుకు మంటగా ఉందన్నారు.

తాము ప్రజల కోసమే పని చేస్తున్నామని, బాబులాగా కార్యకర్తల కోసం, కుటుంబం కోసం పనిచేయడంలేదని వ్యాఖ్యానించారు. తమను తిట్టడం బాబుకు సర్వ సాధారణమైపోయిందని, దానికి మేము బాధపడాల్సిన అవసరం లేదన్నారు. పెద్దిరెడ్డి పని, వైసీపీ పని అయిపోయిందన్న బాబు వ్యాఖ్యలకు స్పందిస్తూ … తాము ప్రజల పక్షాన ఉన్నామని, ప్రజలు తమ పక్షాన ఉన్నారని… చిత్తూరు జిల్లా ప్రజల అండ ఉన్నంత వరకూ మాపని, మా పార్టీ పని అయిపోయే ప్రసక్తే లేదన్నారు. పుంగనూరులో తన సంగతి చూస్తానంటూ మాట్లాడుతున్నారని, అయన చూసేదేమిటని, తానే బాబు పని కుప్పంలో తెలుస్తానని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా కుప్పంలో వైసీపీ జెండా ఎగురుతుందని, బాబును ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

చితూరు జిల్లా ప్రజలు ఇప్పటికే చంద్రబాబు రాజకీయ భవిష్యత్ చించేశారని, వచ్చే ఎన్నికల్లో పూర్తిగా చినిగిపోతుందని అన్నారు. కొద్దిమంది జనాన్ని చూడగానే కారుకూతలు కూస్తున్నారని మండిపడ్డారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్