దేశ రాజకీయాల్లో కీలక మలుపు దగ్గరలోనే ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం తీసుకుంది. చట్ట సభల్లో మహిళలకు ప్రత్యేక ప్రాతినిధ్యం కల్పించాలని కేంద్రమంత్రివర్గం తీసుకున్న నిర్ణయానికి సర్వత్ర హర్షం వ్యక్తం అవుతోంది. ఇన్నాళ్ళు ఆకాశంలో సగం… అవకాశాల్లో సగం మహిళలు అని ప్రకటనలుగా ఉన్న నినాదాలని నిజం చేసే దిశగా ప్రధానమంత్రి అడుగులు వేశారు. ఈ రోజు కొత్త పార్లమెంట్‌లో ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ బిల్లును న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సభ్యుల ముందు ఉంచారు. ఈ బిల్లుకు ‘నారీ శక్తి వందన్’గా నామకరణం చేశారు. 2027 సంవత్సరంలో నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే మహిళా రిజర్వేన్లు అమలులోకి వస్తాయని మంత్రి వెల్లడించారు. రొటేషన్ పద్దతిలో సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఈ బిల్లుపై రేపు లోక్‌సభలో చర్చ జరగనుండగా ఎగువ సభలో గురువారం చర్చ జరగనుంది.
పార్లమెంటులో ప్రస్తుత సమీకరణాల ప్రకారం మహిళా బిల్లు ఆమోదానికి ఎలాంటి అవరోధాలు లేవు. సమాజ్ వాది పార్టీ, ఆర్ జే డి, బిఎస్పి తదితర పార్టీలు OBC రిజర్వేషన్ కోసం పట్టుపట్టే అవకాశం ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి వివరణ వస్తే దేశంలో రాజకీయాలో కొత్త దిశలో వెళ్తాయనటంలో అతిశయోక్తి లేదు.
1970 ల నాటినుంచే మహిళా బిల్లు ఆలోచన ఉంది. దానికి మొదట రాజీవ్ గాంధీ1987లో మార్గరెట్ అల్వా అధ్యక్షతన అధ్యయన కమిటీ వేశారు. అన్ని దశలలో మహిళలకు ప్రత్యేక కోటా ఉండాలని ఈ కమిటీ చేసిన సిఫారసు మేరకు పీవీ నరసింహా రావు మొదట స్థానిక సంస్థల్లో కోటా కోసం రాజ్యాంగ సవరణ చేశారు. పార్లమెంటు, శాసన సభలలో కూడా మహిళలకు కనీసం 33 శాతం స్థానాలు కేటాయిస్తూ 1996 లో దేవగౌడ జనతాదళ్, వాజ్ పేయి బీజేపీ, మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రయత్నం చేసినా అది వీలుకాలేదు. ఈ సందర్భంగా ప్రధానమైన సామాజిక అంశాలు చర్చకు వచ్చాయి. దానికి ప్రధాన కారణం ఆ దశలో ఎదిగి వచ్చిన బీసీ నాయకత్వం. మండల్ కమీషన్ అనంతర పరిణామాల్లో శరద్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, ములయాం సింగ్ యాదవ్, నితీష్ కుమార్ వంటి బీసీ నాయకులు కీలక భూమిక పోషించారు.
మహిళలకు రిజర్వేషన్ అంటే అగ్రవర్ణాలకు స్థానాలు దారాదత్తం చేయడమే, బి సీ మహిళలకు రిజర్వేషన్ లేకుండా బిల్లు ప్రవేశపెడితే అగ్రవర్ణాల ఆధిపత్యం పెరుగుతుంది. చదువుకున్న, అర్బన్ మహిళల ఆధిపత్యం పెరుగుతుంది. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం అని వాదించారు. బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకు సబ్ కోటా ఉండాలని డిమాండ్ చేశారు. ఇది న్యాయమైన కోరికే కానీ బీసీలకు కోటా లేకుండా సబ్ కోటా సాధ్యం కాదని చేతులెత్తేశారు. బీజేపీ వచ్చాక…పార్లమెంటులో బీసీ ప్రాతినిధ్యం, రాజకీయ ప్రాబల్యం తగ్గి పోయింది. బీసీ కోటా వెనక్కి వెళ్ళింది. ఇప్పుడు బీసీ ప్రధాని అధ్వర్యంలో ఆ వర్గ మహిళల ప్రస్తావన లేకుండానే (?) నిర్ణయం జరుగుతోందా అనే అనుమానాలు ఓ బీ సి లలో నెలకొన్నాయి.
ఈసారి బిల్లు ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నామని బీఎస్పి అధినేత్ర మాయావతి ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే మహిళా రిజర్వేషన్ బిల్లులో SC/ST, OBC కోటాను నిర్ధారించాలని డిమాండ్ చేశారు.
నిజానికి చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ తో పాటు బీసీ రిజర్వేషన్ కోసం తెలంగాణ తొలి శాసన సభ జూన్ 14, 2014 న తీర్మానం చేసింది. శాసన సభ ఏర్పడిన మొదటి వారంలోనే తీర్మానం చేసి కేంద్రానికి పంపిన రాష్ట్రం తెలంగాణ. ఈ రెండు కలిపి వస్తే తప్ప చట్టసభల్లో సామాజిక న్యాయం డిమాండుకు న్యాయం జరిగే ఆస్కారం లేదని మేధావులు విశ్లేషిస్తున్నారు.
చట్ట సభలలో మహిళలకు 33.3 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లు ఓబీసీ సవరణ లేకుండానే యధాతధంగా తీసుకు రావడం తీవ్ర అభ్యంతరకరం అంటున్నారు. ఇన్నేళ్ళు ప్రధానంగా బిల్లుకి అడ్డుపెట్టిన అంశాలను దానికి కావాల్సిన కుల జన గణన జరగకుండా బిల్లు అమలు ఎలా సాధ్యం అవుతుంది. 27 ఏళ్లుగా తొక్కిపెట్టిన మహిళా బిల్లుకి మోక్షం కలిగించినట్లుగా చెప్పుకోవడం వెనుక ఉన్న కపట, అవకాశవాద రాజకీయాలను అర్థం చేసుకోవాలని బలహీన వర్గాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బిల్లులో (ఇప్పటికే అమలవుతున్న SC ,ST రిజర్వేషన్లు తప్ప) బహుజన, మైనారిటీ కులాల్లోని మహిళల ప్రాతినిధ్యం లేదు.
సబ్బండ వర్ణాల మహిళల ప్రాతినిధ్యం లేకుండా ఉన్నట్లయితే, ఆధిపత్య కులాల, సంపన్న వర్గాల మహిళలు తప్ప శ్రామిక వర్గాల మహిళలు, సామాజిక అణచివేతకు గురవుతున్న మహిళలు చట్ట సభలకు ఎన్నిక కాలేరు. ఇప్పటికే, వారసత్వ, కులతత్వ, ఆధిపత్య రాజకీయాలకు మాత్రమే మహిళలను పరిమితం చేస్తున్న రాజకీయ, ఆర్థిక పరిస్థితుల్లో … స్వతంత్రంగా మహిళలు ఆయా వర్గాలకు, మహిళా లోకానికి ప్రతినిధులుగా చట్టసభల్లో అడుగుపెట్టలేరు. ఆయా రంగాలలోని మహిళా సమస్యలు, వివక్ష, సామాజిక అణచివేత తదితర అంశాలు చర్చించడానికి, తగిన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి అమలు చేయడానికి అన్ని వర్గాల మహిళలకు చట్టసభల్లో సమ భాగస్వామ్యం కల్పించాలి.