Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Positive Thinking: మనం ఎంత ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటున్నా సరే దాన్ని  అధిగమించడానికి పాజిటివ్ గా ఆలోచించాలి అన్నాడు ప్రముఖ బాస్కెట్ బాల్ క్రీడాకారుడు మైఖెల్ జోర్డాన్.

చాలాసార్లు మన నీరసానికి, అలసటకు, మానసిక ఆందోళనకు, వాటివల్ల వచ్చే ఓటములకు కా‌రణమేమిటా అని ఆలోచిస్తే మనలోని నెగటివ్ ఆలోచనలే అని అర్థమవుతుంది. పాజిటివ్ ఆలోచనకే బలమెక్కువ.

మంచినే అనుకుందాం…. మంచే జరుగుతుంది అనే మాటలు వొట్టి మాటలు కావు. ప్రతి ఒక్కరు అనుసరించాల్సిన మాటలవి. మంత్రంలాటి శక్తిమంతమైన మాటలు.

ఆయన ఇంగ్లండుకి చెందిన ఓ రచయిత. అది అర్ధరాత్రి దాటింది. ఏప్రిల్ నెల ప్రారంభమైన సమయం. గత ఏడాదిలో ఏప్రిల్ మొదలుకుని మార్చి వరకు ఏడాది కాలంలో తన జీవితంలో  జరిగిన సంఘటనలపై ఆలోచించారు.  తలచు కొనే కొద్దీ కన్నీళ్ళు పొంగుకొస్తున్నాయి. టేబుల్ ముందర కూర్చున్నారు. పేపరూ పెన్నూ తీసుకున్నారు. అవన్నీ రాయడం మొదలుపెట్టారు.

 Think Positive

 • నాకొక ఆపరేషన్ జరిగింది.  ఓ అవయవాన్ని తొలగించారు.
 • ఆపరేషన్ కారణంగా మంచం దిగలేకపోయాను.
 • నాకు అరవై ఏళ్ళు పూర్తయ్యాయి.  సుమారు ముప్పై ఏళ్ళు పని చేసిన పబ్లిషింగ్ సంస్థ నుంచి బయటికొచ్చేశాను.
 • నాకిష్టమైన పని నా వృద్ధాప్యం కారణంగా నాకు దూరమైపోయింది.
 • అదే సమయంలోనే నా ప్రియమైన తండ్రి మరణించడంతో శోకం మిగిలింది.
 • నా కొడుక్కి ఓ ప్రమాదం జరిగింది గత ఏడాదిలోనే. దీనితో వాడు వైద్య విద్య పరీక్షలో తప్పాడు. కాళ్ళకు గాయమవడంతో కదల్చలేక పలు వారాలు మంచానికే పరిమితమయ్యాడు.
 • ప్రమాదంలో నా కారూ ధ్వంసమైంది.

ఇవన్నీ రాసి చివరగా ఆ రచయిత ఇలా రాశారు

దేవుడా! ఇది చాలా దారుణమైన ఏడాది  అని…

రచయిత భార్య ఆ గది తలుపు దగ్గర నిల్చుని లోపలికి తొంగి చూసింది. భర్త శోకంతో కన్పించాడు. ఏదో ఆలోచిస్తున్నాడని ఆమె గ్రహించింది. ఆయన ఏదో రాయడమూ కనిపించింది. ఆమె చప్పుడు రానివ్వక మెల్లగా అక్కడి నుంచి వెళ్ళి పోయింది.

కాస్సేపటికి ఆయన పడుకుండిపోయారు. అనంతరం ఆమె నెమ్మదిగా ఆ గదిలోకి ప్రవేశించింది. భర్త రాసిన విషయాలను చదివింది.

 Think Positive

ఒక్క క్షణం ఆలోచించింది. ఆమె మరొక పేపర్ తీసుకుని కొన్ని విషయాలు రాసింది. తన భర్త రాసుకున్న కాగితాలను తీసేసి తను రాసిన కాగితాన్ని అక్కడ ఉంచి బయటకు వచ్చేసింది.

మరుసటిరోజు ఆ రచయిత లేచి ఆ గదిలోకి వెళ్ళారు. బల్ల మీద తను రాసిన కాగితాలు కనిపించలేదు. తన భార్య రాసిన కాగితం కనిపించింది. అందులో ఇలా రాసి ఉంది….

 • పలు సంవత్సరాలుగా నాకు ఎంతో కష్టం కలిగించిన ఓ అవయవాన్ని తొలిగించడంతో ఆ బాధ నుంచి బయటపడ్డాను.
 • నా అరవయ్యో ఏట మంచి ఆరోగ్యంతో నా ఉద్యోగంలోంచి పదవీ విరమణ పొందాను.
 • ఇక నా సమయాన్ని ప్రశాంతంగా గడుపుతాను. ఇక ఏ అడ్డంకులు లేకుండా నేననుకున్నది రాసుకోవడానికి నాకిప్పుడు బోలెడంత టైమ్ దొరికింది.
 • మా నాన్న తొంబై అయిదేళ్ళ వరకూ ఎవరిమీదా ఆధారపడకుండా ఎవరితోనూ పనులు చేయించుకోకుండా అద్భుతమైన జీవితాన్ని గడిపారు. ఆయన మహామనీషి. ఏ సమస్యా లేకుండా కాలధర్మం చెందారు.
 • గత ఏడాదే దేవుడు నా కొడుకుకి కొత్తగా ఓ జీవితాన్నిచ్చాడు.
 • నా కారు ధ్వంసమైంది. పోతేపోయింది. నా కొడుక్కి ప్రాణాపాయం తప్పి కాలు గాయంతో బయటపడ్డాడు. అది చాలు.

ఈ మాటలన్నీ రాసి చివరగా ఆ దేవుడి కృపవల్లే ఈ ఏడాదంతా మంచిగా జరిగింది. నీకు కృతజ్ఞతలు దేవుడా!

మంచినే ఆశిద్దాం.
మంచే జరగనీ!

– యామిజాల జగదీశ్

Also Read :

నిద్రా ముద్ర

Also Read :

తలలు బోడులైన.. తలపులు బోడులౌనా?

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com