Saturday, November 23, 2024
HomeTrending Newsరూ. 700 కోట్లతో జంతు వ్యాక్సిన్ తయారీ కేంద్రం

రూ. 700 కోట్లతో జంతు వ్యాక్సిన్ తయారీ కేంద్రం

మరో భారీ పెట్టుబడికి హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ వేదికైంది. 700 కోట్ల రూపాయాలతో జంతు వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తున్నట్టు ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ (IIL) ప్రకటించింది. పశువులకు వచ్చే ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ (FMD)తో పాటు ఇతర పశువ్యాధులకు సంబంధించిన టీకాలను ఈ కేంద్రంలో ఉత్పత్తి చేయనున్నారు. కొత్తగా ఏర్పాటుచేయబోయే ఈ కేంద్రంతో 750 మందికి ఉపాధి దొరుకుతుంది. జాతీయ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ (NDDB) అనుబంధ సంస్థ అయిన ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ (IIL) ప్రపంచంలోని అతిపెద్ద FMD వ్యాక్సిన్ తయారీదారులలో ఒకటి. దీంతోపాటు భారత ప్రభుత్వ నేషనల్ యానిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ (NADCP)కి FMD వ్యాక్సిన్ను అందించే ప్రముఖ సరఫరాదారు.

ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ (FMD) వ్యాక్సిన్ , ఇతర జంతు వ్యాక్సిన్ల తయారీ కోసం వెటర్నరీ వ్యాక్సిన్ ఫెసిలిటీ ఏర్పాటకు జీనోమ్ వ్యాలీలో IIL పెట్టుబడి పెడుతోంది. అత్యాధునిక సౌకర్యాలతో బయో సేఫ్టీ లెవల్ 3 ప్రమాణాలతో ఈ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తోంది. గచ్చిబౌలిలో ప్రస్తుతం ఉన్న తయారీ కేంద్రం సంవత్సరానికి 300 మిలియన్ డోస్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది. కొత్తగా ఏర్పాటుచేయబోతున్న ఈ వ్యాక్సిన్ తయారీ కేంద్రంతో ఇప్పటికే సంస్థకు ఉన్న సామర్థ్యానికి అదనంగా సంవత్సరానికి 300 మిలియన్ డోసుల వ్యాక్సిన్ ఉత్పత్తి అవుతుంది. IIL,MD, డాక్టర్ కె.ఆనంద్ కుమార్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు ముకుల్ గౌర్, NSN భార్గవ్లతో పాటు సంస్థ కు చెందిన ఇతర అధికారులు ఇవాళ మంత్రి కేటీఆర్ తో సమావేశమయ్యారు. తమ సంస్థ విస్తరణ ప్రణాళికలను వివరించారు.

హైదరాబాద్లో IIL ఏర్పాటుచేయబోతున్న మూడవ టీకా తయారీ కేంద్రం వ్యాక్సిన్ ఉత్పత్తిలో భారతదేశ స్వయం సమృద్ధికి నిదర్శనం అని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ K. ఆనంద్ కుమార్ చెప్పారు. తమ వ్యాక్సిన్ తో పశువులకు వచ్చే తీవ్రమైన వ్యాధులు తగ్గడంతో పాటు రైతులకు, దేశానికి వేల కోట్ల రూపాయలను ఆదా అవుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ సంస్థ జీనోమ్ వ్యాలీలో మరో వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈ కొత్త టీకా ఉత్పత్తి కేంద్రంతో ప్రపంచ వ్యాక్సిన్ రాజధాని గా లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ జోరు కొనసాగుతుందన్నారు.
ఈ సమావేశంలో పరిశ్రమలు & వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ , తెలంగాణ ప్రభుత్వ డైరెక్టర్ (ఫార్మా & లైఫ్ సైన్సెస్) శక్తి ఎం నాగప్పన్ కూడా పాల్గొన్నారు.

Also Read : వ్యాక్సిన్లతో లక్షల కోట్ల లాభాలు 

RELATED ARTICLES

Most Popular

న్యూస్