Immersion of Ashes via Speed Post :
కమ్యూనికేషన్స్ వ్యవస్థ అనేది ఎంత బలపడింది… అది ఏ విధమైన సాంకేతికమైన మార్పులతో అభివృద్ధి చెందుతూ వస్తుందో చెప్పడానికి నాటి కపోతాలతో పంపించిన లేఖల కాలం నుంచి నేటి మెయిల్, వాట్సప్, ఇతర సోషల్ మీడియా సాధనాల వరకూ మనం చూస్తున్నదే.
ఏ శిలలపైనో, లోహాలపైనో రాసుకునే రాతలు కాగితం మీదకు చేరి… నేడు పేపర్ లెస్ కంప్యూటర్ల వరకూ ఎలా రూపాంతరం చెందుతున్నాయో కూడా ఈ జనరేషన్సుకన్నీ ఎరుకే.
ప్రకృతి సిద్ధమైన మార్పులతో కాలాల్లోనూ తేడాలు వస్తున్న రోజుల్లో… జనరేషన్స్ మారుతున్నప్పుడు సంప్రదాయాల్లోనూ ఆ మార్పులు సర్వసాధారణమే. అవి పూర్తిగా పాశ్చాత్త్యమవుతున్నప్పుడు విమర్శలూ, విరుపులూ సహజమే. అయితే ఇలాంటి సమయాల్లోనూ ఇంకా కొన్ని అనాదిగా వస్తున్న ఆచార, సంప్రదాయాలు మాత్రం ఆయా మత విశ్వాసాలను బట్టి కొనసాగుతూనే ఉన్నాయి.
ఎందుకంటే ఆ విశ్వాసాల పునాదులపైనే ఆయా వర్గాల ఉనికి కొనసాగుతోంది కూడా. మరలాంటి విశ్వాసాలను తీర్చుకోలేని కడు దారుణమైన పరిస్థితులకు కరోనా అడుగడుగునా అడ్డుపడుతున్న కాలాన… నాటి సంప్రదాయాలను కాలరాస్తోందని ఓవైపు ప్రచారానికి నోచుకున్న నేటి ఆధునిక కాలపు సాంకేతిక వ్యవస్థే… అదే సంప్రదాయాలకు బ్రేక్ రాకుండా కాపాడగల్గితే…? అదీ ఓ అభిలషణీయమైన మార్పేగా..?
అదిగో అలాంటి మార్పుకు శ్రీకారం చుట్టిందే మనం చెప్పుకునే లేటెస్ట్ కొరియర్ వ్యవస్థ. అలాంటి వ్యవస్థపై మరీ మడి కట్టుకుని కూర్చున్న సనాతనవాదులు దాన్ని మరింత విడ్డూరంగా చూస్తూ తప్పుపడితే చేయగల్గేదేమీ ఉండకపోగా.. ప్రత్యామ్నాయ మార్గమే అదైనప్పుడు అదే అందుకో గత్యంతరం లేని సాధనం కూడానూ!
భారతీయ తపాలాశాఖ తీసుకొచ్చిన కొత్త సంస్కరణే ఇప్పుడు అలాంటి కొత్త చర్చకు తెర లేపింది. కోవిడ్ కాలాన రోజులకు రోజులు ఆసుపత్రుల్లో అయినవాళ్లను విడిచిపెట్టలేక… అంతో ఇంతో సంపాదించిందీ ఆ కార్పోరేట్ వైద్యానికి తగలబెట్టలేక.. ఖర్చుచేసినా ప్రాణాలు దక్కలేని పరిస్థితుల్లో…కోవిడ్ మరణాలంటేనే భయపడి అంత్యక్రియలకు కూడా దూరంగా ఉంటున్నఅపోహాలు, అనుమానాల కాలాన… అంతగా కావాలంటే, వీడియో కాలింగ్ తో అంతిమసంస్కారాలను మోబైల్ స్క్రీన్లపై చూస్తూ తీరని దుఖానికి గురవుతున్న వేళ… అయినవారు చనిపోతే వారి పవిత్ర ఆత్మలశాంతి కోసం అస్థికలనైనా పవిత్ర జలాలైన నదుల్లో నిమజ్జనం చేయలేకపోతున్నామే అని బాధపడుతున్న వారికోసమే.. మన భారతీయ తపాలాశాఖ ఈ కొత్త వెసులుబాటుకు అవకాశం కల్పించింది.
సాధారణంగా హైందవ ధర్మం ప్రకారం ఐనవాళ్లను కోల్పోయినప్పుడు గంగాజలాల్లో తమవారి అస్థికలను కలపాలనే కాంక్ష చాలామందికుండేదే. అలాంటి అవకాశం లేనివాళ్లు ఇతర నదుల్లోనూ కలుపుతుంటారనకోండి అది వేరే విషయం. ముఖ్యంగా కాశీ, గయ, ప్రయాగరాజ్, హరిద్వార్ వంటి క్షేత్రాల్లోని తీర్థాలతో పాటు… దేశంలోని మరికొన్ని చోట్ల ఇలా అస్థికలను కలపితే పోయినవారి ఆత్మలకు శాంతి చేకూరుతుందనేది హైందవధర్మంలోని ఓ మత విశ్వాసం. ఈ క్రమంలో లాక్డౌన్ పుణ్యమా అని ఇతర పక్క ఊళ్లకే వెళ్లని రోజుల్లో.. ఎక్కడో కాశీ, ఎక్కడో గయకు వెళ్లాలంటే మాటలా..?
అందుకే భారతీయ తపాలాశాఖ కాశీ, గయ, ప్రయాగరాజ్, హరిద్వార్ వంటి తీర్థాల్లో పోయినవారి అస్థికలను కలిపేలా నూతనంగా ఓ కొరియర్ సర్వీస్ కు శ్రీకారం చుట్టింది. అందుకు దివ్యదర్శన్ అనే ఓ స్వచ్ఛంద సంస్థతో తపాలాశాఖ ఓ ఒప్పందం కుదుర్చుకుంది. తమవారి అస్థికలను ఎక్కడ నిమజ్జనం చేయాలో ముందుగా దివ్యదర్శన్ కు సంబంధించిన ఓ యాప్ ద్వారా కుటుంబసభ్యులు రిజిస్టర్ చేసుకుంటే.. వారొక ఐడీ నంబర్ కేటాయిస్తారు. అలా కేటాయించిన నంబర్ తో పాటు… ఎక్కడ ఏ తీర్థంలో తమవారి అస్థికలను నిమజ్జనం చేయాలో పేర్కొంటూ ఆ అడ్రస్ తో పాటు… అస్థికలను ప్యాకింగ్ చేసి సమీప పోస్టాఫీస్ లో అప్పజెప్పి నామినల్ ఫీజ్ చెల్లిస్తే సరి!
Immersion of Ashes via Speed Post :
అంతేకాదు.. ఆ అస్థికలను ఆయా నదుల్లో నిమజ్జనం చేస్తున్నప్పుడు… ఏకంగా దివ్యదర్శన్ స్వచ్ఛంద స్ంస్థ సభ్యులు లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఆ కుటుంబ సభ్యులకు అస్థికలు నిమజ్జనమవుతున్న విషయాన్ని లైవ్ గా కూడా చూపించే ఓ సౌకర్యాన్నీ ఈ సర్వీస్ ద్వారా తపాలాశాఖ ప్రజల ముందుంచింది. ఆ లైవ్ స్ట్రీమింగ్ కు సంబంధించి కూడా ముందుగానే సమాచారమిస్తారు. జస్ట్ కనెక్టైతే చాలు… నేరుగా వెళ్లాల్సిన పని లేకుండానే తమవారి అస్థికలను ఈ కోవిడ్ కాలాన పవిత్ర జలాల్లో నిమజ్జనం చేసే ఏర్పాటు చేసింది పోస్టల్ డిపార్ట్ మెంట్.
పచ్చిచర్మపు తిత్తి పసలేదు దేహంబు లోపలనంత రోయరోత.. నరములు శల్యముల్ రక్తమాంసములు కండలున్ మైలతిత్తి… బలువైన ఎండవానలకోర్వదెంతైన తాళలేదాకలి దాహములకు.. సకల రోగములకు సంస్థానమైయుండు నిలువదస్థిరమైన నీటిబుగ్గ.. బొందిలోనుంచి ప్రాణముల్ పోయినంత కాటికేగాని కొరగాదు గవ్వకైనా అంటూ శేషప్ప చెప్పినట్టుగా… అసలే శ్మశాన వైరాగ్యానికి తెరలేపి.. ప్రపంచాన్నే అతలాకుతలం చేసిన కోవిడ్ కాలాన.. మానవ సమాజంలోని ఆశలు, ఆకాంక్షలు, విశ్వాసాలకు గండిపడకుండా అస్థికల నిమజ్జనం కోసం తపాలాశాఖ చేపట్టిన కొరియర్ సర్వీస్ ను తప్పు పట్టాల్సిన పని లేదు.
కరోనా వేళ చివరకు మిగిలేది, చివర చూసేది, చివర మోసేది, చివర అస్థికలు గంగలో కలిపేది పరాయి వారే కావడంలో తన మన భవబంధాలను మించిన వేదాంతమేదో దాగి ఉంది.
-రమణ కొంటికర్ల
Must Read : నిజంగానే ఓ అబద్ధం……. ఆ అబద్దమే ఓ నిజం……. అదే సోషల్ మీడియా…….