Saturday, July 27, 2024
Homeతెలంగాణకోవిడ్ పై ప్రభుత్వ నిర్లక్ష్యం : ఉత్తమ్

కోవిడ్ పై ప్రభుత్వ నిర్లక్ష్యం : ఉత్తమ్

కరోనా విషయంలో ప్రభుత్వం అమానవీయంగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా ఆరోగ్యశ్రీ కింద కరోనాకు వైద్యం ఉచితంగా అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ప్రజలందరికీ ఉచితంగా కరోనా, బ్లాక్ ఫంగస్ చికిత్స అందించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ అధ్వర్యంలో నేతలు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. గాంధీ భవన్ లోఉదయం 10 గంటలకు ప్రారంభమైన దీక్ష ఒంటిగంట వరకూ చేపడతారు.

తెలంగాణాలో కోవిడ్ తొలి కేసు గత ఏడాది మార్చిలో నమోదైందని, ఈ 15 నెలల కాలంలో వైద్య సౌకర్యాలు మెరుగుపరిచేందుకు, ఆరోగ్య రంగంలో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఉత్తమ్ విమర్శించారు. గచ్చిబౌలి టిమ్స్ ఆస్పత్రిలో ఇప్పటివరకూ నీటి సౌకర్యం కల్పించలేకపోయారని, టాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నారని చెప్పారు. ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి తట్టుకోలేకే సిఎం కెసియార్ రెండు ఆస్పత్రులు సందర్శించారని ఉత్తమ్ వ్యాఖ్యానించారు.

ఆయుష్మాన్ భారత్ పథకం మార్గాదర్శకాలే ఇంతవరకూ విడుదల కాలేదన్నారు. వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని ఉచితంగా కోవిడ్, బ్లాక్ ఫంగస్ వైద్య సేవలు అందించాలని సూచించారు. కోవిడ్ రోగుల నుంచి అధిక మొత్తంలో వసూలు చేసిన ప్రైవేటు ఆస్పత్రుల నుంచి సొమ్ములను వెనక్కి వసూలు చేసి రోగులకు ఇప్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిదని, దీనిపై కూడా ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదని ఉత్తమ ఆరోపించారు.

హైదరాబాద్ లోనే కోవాక్సిన్, స్పుత్నిక్-వి, రెమ్డేసివర్ మందులు తయారవుతున్నా మన రాష్ట్ర ప్రజలకు వాటిని అందించేలా ఎందుకు సమన్వయం చేసుకోలేదని ఉత్తమ నిలదీశారు. పార్టీ సీనియర్ నేతలు ఈ దీక్షలో పాల్గొన్నారు. కాగా, మాజీ ఎంపి విహెచ్ గాంధీ భవన్ లో కాకుండా ఇంట్లోనే దీక్ష చేపట్టారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్