గాబన్ లో అధ్యక్షుడిని దింపిన తర్వాత ప్రజలు సంబరాల్లో మునిగితేలుతున్నారు. సైనిక చర్యను సమర్థిస్తున్నారు. అయితే ఐక్యరాజ్యసమితి, ఆఫ్రికా యూనియన్, గాబన్ ను గతంలో పాలించిన ఫ్రాన్స్ తదితర దేశాలు మాత్రం సైనిక తిరుగుబాటును వ్యతిరేకిస్తున్నాయి.
నైజర్ తర్వాత ఆఫ్రికాలోని మరో దేశంలో సైనిక తిరుగుబాటు జరిగింది. గాబన్ దేశంలో అధ్యక్షుడిని పదవీచ్యుడిని చేసి సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకున్నది. అధ్యక్షుడు అలీ బొంగో ఒండింబాను గృహనిర్బంధంలో ఉంచినట్టు సైనిక అధికారులు ప్రకటించారు. అధ్యక్ష ఎన్నికల్లో అలీ బొంగో గెలుపొందినట్టు ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఈ తిరుగుబాటు చేసుకోవడం గమనార్హం. రాజధాని లిబ్రేవిల్లేలో కాల్పుల మోత వినిపించింది. ఆ తర్వాత సైనికులు.. అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకొన్నామని ప్రకటించారు.
మధ్య ఆఫ్రికాలోని చమురు సంపన్న దేశమైన గాబన్‌ను బొంగో కుటుంబం 55 ఏండ్లుగా పాలిస్తున్నది. తిరుగుబాటు నేపథ్యంలో అధ్యక్షుడు బొంగో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ తనకు మద్దతుగా నిలవాలని, ఆందోళనలు చేయాలని కోరారు. ఆయన పిలుపునకు ప్రజలు స్పందించలేదు. ఎవరూ వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేయలేదు. బొంగోను అధికారం నుంచి తొలగించడంపై సంబరాలు చేసుకొన్నారు. జాతీయ గీతం పాడుతూ, బొంగోను అధికారం నుంచి తొలగించడాన్ని ప్రజలు సైనికులతో కలిసి సెలబ్రేట్ చేసుకొన్నారు.