Curd-Controversy: భారతదేశంలో గుర్తింపు పొందిన అధికార భాషలున్నాయి కానీ…జాతీయ భాష లేదు. హిందీని జాతీయ భాషగా చేయాలని మోడీ-అమిత్ షా ద్వయానికి ఎప్పటి నుండో ఒక ఆలోచన ఉంది. వారి బుర్రలో ఒక ఆలోచన వస్తే…ఎక్కడో స్విచ్ వేస్తే…ఎక్కడో బల్బ్ వెలిగినట్లు…ఆ ఆలోచనకు ఇతరేతర లెక్కలు…వ్యూహాలేవో ఉంటాయి.
ఉత్తర భారత హిందీ బెల్ట్ లో హిందీ జాతీయ భాష అన్న చర్చను ఒక భావోద్వేగ అంశంగా మలచాలని పావులు కదుపుతున్నట్లున్నారు. నిజాం పాలనవల్ల తెలంగాణాలో తప్ప దక్షిణాది కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లలో సహజంగా హిందీ మీద అంత పట్టింపు ఉండదు. తమిళనాడు, కేరళలో హిందీని లెక్కపెట్టరు. తమిళనాడులో దశాబ్దాలపాటు హిందీ వ్యతిరేక ఉద్యమాలు కూడా జరిగాయి. అత్యంత జాగ్రత్తగా ఎత్తుగడలు వేసే మోడీ- అమిత్ షాలకు ఇవన్నీ తెలియక కాదు. ప్రజాస్వామ్యంలో అధికారం ఒక అంకెల ఆట. ఆ ఆటలో ఓట్లు ఒక వేట. ఆ వేటలో భావోద్వేగ అంశాలు ఒక ఎర. ఆ ఎరలో హిందీ జాతీయ భాష అంశం ఒక అర. మోడీ- అమిత్ షాల ఒరల్లో ఇంకా ఎన్నెన్ని అరలు దాగి ఉన్నాయో హిందీ భాష ఏమి చెప్పగలదు?
ఇప్పుడు అసలు విషయంలోకి వెళదాం. దేశమంతా పెరుగు డబ్బాలు, ప్యాకెట్లపై “దహీ”అన్న హిందీ మాటను తప్పనిసరిగా ముద్రించాలని భారత ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ- ఎఫ్ ఎస్ ఎస్ ఏ ఐ ఆదేశాలు జారీ చేసింది. హిందీ మాటంటేనే ఒంటి కాలి మీద లేచే తమిళనాడు మేము “తైర్” అని తమిళంలోనే అంటాం…కింద ఎలాగూ ఇంగ్లీషులో “కర్డ్” అని ఉంటుంది…మధ్యలో హిందీ “దహీ” మాకెందుకు? అని తెగేసి చెప్పింది.
కర్ణాటకలో అసలే ఎన్నికల వేళ. కన్నడ మొసరు(పెరుగు)ను పెరగనివ్వకుండా…కన్నడ నేల మీద హిందీ దహీ యాకే? నహీ నహీ! అన్నారు.
దాంతో ఢిల్లీలో బి జె పి పెద్దలకు ఏవో ప్రమాద ఘంటికలు వినిపించాయి. ఎందుకొచ్చిన గొడవ? అనుకుని కొంచెం వెనక్కు తగ్గారు. డ్యామేజ్ కంట్రోల్ లో భాగంగా ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ చేత ఒక ప్రకటన ఇప్పించారు. ఇంగ్లీషులో కర్డ్ అంటే పాలతో పాటు చెట్లనుండి వచ్చే పాలతో అన్నీ కర్డ్ అయి గందరగోళం అవుతోంది. ఆవు, గేదె పాలతో తయారయినది మాత్రమే అని సూచించడానికే “దహీ” అని ముద్రించాలనుకున్నాం…అందుకే అలా ఆదేశాలు ఇచ్చాము…అని వివరణ ఇచ్చుకుంది. పెరుగు, తైర్, మొసరు అని మీమీ ప్రాంతీయ భాషా పదాన్ని ముద్రించుకోవచ్చు అని ఆదేశాలను కొంచెం పలుచన చేసింది.
తమిళనాడులో, కర్ణాటకలో పెరుగు గిన్నెల్లో హిందీ దహీ తోడు బెట్టబోతే కుదరదు పొమ్మన్నారు. తెలుగు పెరుగులో దహీ మీద అభ్యంతరాలున్నట్లు ఇప్పటికయితే ఎక్కడా వార్తలు రాలేదు. తెలుగు పెరుగు ఏనాడో తోడు మరిచి…పెరగడం మానేసి…పలుచని మజ్జిగగా మిగిలి ఉంది. ఎంత చిలికినా తెలుగు పెరుగు కుండలో హిందీ మీగడ, హిందీ వెన్న, హిందీ నెయ్యి రావు. తెలుగు పాల కుండలో తెలుగే ఇంగువ కట్టిన గుడ్డ. కాబట్టి దహీ పెరుగులో పడ్డా, పెరుగే దహీ మీద పడ్డా పెద్ద తేడా ఏమీ ఉండదు.
పాలు విరిగిపోతూ ఉంటాయి. పొంగిపోతూ ఉంటాయి. పెరుగు పులిసి పుల్లగా తయారవుతూ ఉంటుంది. పెరుగు విరిగిపోదు. అలాంటి పెరుగు మనసును కూడా పెరగనివ్వకుండా విరిచే దహీ పిల్లి కళ్లు మూసుకుని తాగడానికి సిద్ధంగా ఉంది!
తెలుగులో పాలు నిత్య బహువచనం. పాలకు ఏకవచనం లేదు. కాచిన పాలకు తోడు పెడితే పెరుగు. మీదు ప్లస్ కడ- మీగడ. పెరుగు చిలికితే వెన్న. వెన్న కాస్తే నెయ్యి. పాలు, పెరుగు, మీగడ, వెన్న, నెయ్యి- అన్నీ అచ్చ తెలుగు పదాలు.
మాట తెలుగు పెరుగయితే ఏమి?
హిందీ దహీ అయితే ఏమి?
తినేది పెరుగే కదా?
అని అనుకుంటే…తెలుగును మనమే తినేయగా…తినేయగా…భవిష్యత్తులో మన కంచాల్లో తినడానికి తెలుగు మిగిలి ఉండదు!
-పమిడికాల్వ మధుసూదన్
[email protected]
Also Read :