Saturday, November 23, 2024
HomeTrending Newsసింగరేణి లాభం రూ.1,070 కోట్లు

సింగరేణి లాభం రూ.1,070 కోట్లు

సింగరేణి సంస్థ 2021-22 ఆర్థిక సంవత్సరంలోని తొలి తొమ్మిది నెలల్లో రూ.1,070 కోట్ల లాభాలను ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో రూ.842 కోట్ల నష్టాలను చవిచూసింది. బొగ్గు అమ్మకాల్లోనూ 58 శాతం వృద్ధి నమోదైంది. బొగ్గు రవాణా కూడా 318 లక్షల టన్నుల నుంచి 484 లక్షల టన్నులకు పెరిగింది. మంచిర్యాల సమీపంలోని సింగరేణి థర్మల్‌ విద్యుత్తు కేంద్రంలో ఉత్పత్తి గతేడాదిలోని తొలి మూడు త్రైమాసికాలతో పోల్చితే ఈ ఏడాది 30 శాతం వృద్ధి సాధించింది. సింగరేణి నమోదుచేస్తున్న వృద్ధిరేటు, లాభాలు, అమ్మకాలు, విద్యుత్తు ఉత్పత్తిపై సీఎండీ ఎన్‌ శ్రీధర్‌ హర్షం వ్యక్తంచేశారు. రానున్న కాలంలో ఇదే ఒరవడిని కొనసాగించి రూ.27 వేల కోట్ల టర్నోవర్‌ సాధించే దిశగా కృషిచేయాలని ఆకాంక్షించారు. సింగరేణి వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న దాదాపు 950 కేసుల పరిష్కారం కోసం న్యాయ విభాగానికి అవసరమైన సమాచారాన్ని అందజేయాలని సింగరేణి డైరెక్టర్‌ ఎన్‌ బలరాం సంబంధిత అధికారులను ఆదేశించారు. పెండింగ్‌ కేసుల్లో ఎక్కువగా భూసేకరణ, పునరావాసం, పుట్టినరోజు మార్పు, డిపెండెంట్‌, సర్వీసుకు సంబంధించినవే ఉన్నాయని పేర్కొన్నారు. ఏరియాల వారీగా పెండింగులో ఉన్న కేసులపై జీఎం (స్ట్రాటజిక్‌ ప్లానింగ్‌) జీ సురేందర్‌ సమీక్షించారు.

మందమర్రిలో ఎక్స్‌ప్లోజివ్స్‌ ప్లాంట్‌
————————-
ఓపెన్‌ కాస్ట్‌ గనుల్లో వాడే పేలుడు పదార్థాల సరఫరా కోసం మందమర్రి ప్రాంతంలో సొంతంగా ఎక్స్‌ప్లోజివ్స్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు సింగరేణి సన్నాహాలు చేస్తున్నది. ఇప్పటికే ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌తో సమాలోచనలు చేసింది. తాజాగా మందమర్రి ప్రాంతంలో ఏడాదికి 40 వేల టన్నుల పేలుడు పదార్థాల(ఎస్‌ఎంఈ) సైట్‌ మిక్స్‌డ్‌ ఎమాల్షన్‌ ప్లాంట్‌ను నెలకొల్పాలని నిర్ణయించింది. ఈ ప్లాంట్‌ ఏర్పాటుకు విధివిధానాలను రూపొందించేందుకు సింగరేణి డైరెక్టర్లు చంద్రశేఖర్‌, బలరామ్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ సింగరేణి భవన్‌లో అధికారులు శనివారం సమావేశమయ్యారు. సింగరేణి సంస్థలో ప్రస్తుతమున్న 19 ఓసీ గనులకు సంబంధించి ఏడాది 3 లక్షల ఎస్‌ఎంఈ అవసరమవుతుండగా, అందులో 50 వేల టన్నులు రామగుండం, మణుగూరుల్లోని సొంత ప్లాంట్ల ద్వారా సమకూరుతున్నదని, మిగిలిన 2.50 లక్షల టన్నులను ప్రైవేట్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ కంపెనీల ద్వారా కొనుగోలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఎక్స్‌ప్లోజివ్స్‌ను సరఫరాలో కొన్ని కంపెనీలు జాప్యం చేస్తుండగా, ఓసీ గనుల్లో ఉత్పత్తి కుంటుపడుతున్నదని వివరించారు. దానిని నివారించేందుకు సీఎండీ ఎన్‌ శ్రీధర్‌ ఆదేశాల మేరకు సింగరేణి ప్రాంతంలోనే ఐవోసీఎల్‌ భాగస్వామ్యంతో మరో యూనిట్‌ నెలకొల్పాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఏడాదిలోగా ప్లాంట్‌ ప్రారంభంకానున్నట్లు అధికారులు వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్