టి యస్ యస్ పి డి సి ఎల్ పరిధిలో 25%నుండి 30% యస్ యస్ ఆర్ ధరలు పెంచుతున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి చొరవతో తెలంగాణా కాంట్రాక్టర్స్ అసోసియేషన్ తో టి యస్ యస్ పి డి సి ఎల్ సి యం డి రఘుమారెడ్డి చర్చలు జరిపారు. అనంతరం అసోసియేషన్ డిమాండ్ల పరిశీలన నిమిత్తం ఎనిమిది మందితో వేసిన కమిటీ ఇచ్చిన తుది నివేదిక ననుసరించి యస్ యస్ ఆర్ ధరలను పెంచుతున్నట్లు సంస్థ ప్రకటించింది. పట్టణ ప్రాంతాలలో 30% ,గ్రామీణ ప్రాంతాలలో 25% పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు.కాగా ఐదు సంవత్సరాల నుండి యస్ యస్ ఆర్ ధరల పెంపు కోసం నిరీక్షిస్తున్న తమకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు శివకుమార్, ప్రధాన కార్యదర్శి యస్ కే మాజిద్ లు పేర్కొన్నారు.
ఈ మేరకు శనివారం ఉదయం తెలంగాణా కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాంట్రాక్టర్లు పెద్దఎత్తున బంజారాహిల్స్ లోని మంత్రుల నివాస ప్రాంగణానికి తరలివచ్చి రాష్ట్ర విద్యుత్ మంత్రి జగదీష్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. యస్ యస్ ఆర్ ధరల పెరుగుదల విషయంలో జోక్యం చేసుకుని కాంట్రాక్టర్స్ అసోసియేషన్ తో చర్చలు జరిపి ధరలు నిర్ణయించడంలో మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పాత్ర కీలకమైనదిగా కొనియాడారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ఒక్కసారిగా ధరలు రెట్టింపు కావడంతో విద్యుత్ కాంట్రాక్టర్లు ఉక్కిరిబిక్కిరి అయ్యారని,అదే సమయంలో మా బాధలు గుర్తించి యాజమాన్యాలతో మంత్రి జగదీష్ రెడ్డి చర్చలు నిర్వహించినందునే యస్ యస్ ఆర్ ధరలు పెరిగాయన్నారు.
అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంత్రి జగదీష్ రెడ్డికి,ట్రాన్స్కో&జెన్కో సి యం డి దేవులపల్లి ప్రభాకర్ రావు,టి యస్ యస్ పి డి సి ఎల్ సి యం డి రఘుమారెడ్డి లకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డిని అసోసియేషన్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఇంకా ఈ కార్యక్రమంలో విద్యుత్ బోర్డ్ సభ్యులు సదానందం,పర్వతాలు, బిక్షమయ్య,బాలునాయక్, శ్రీనివాస్ గౌడ్,యాదగిరి,సత్తిరెడ్డి, జే. మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.