Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్ ICC Men’s T20 World Cup 2022: వర్షంతో గట్టెక్కిన ఇండియా

 ICC Men’s T20 World Cup 2022: వర్షంతో గట్టెక్కిన ఇండియా

ఇండియాను  వరుణదేవుడు కరుణించాడు. అడిలైడ్ ఓవల్ మైదానంలో చివరి ఓవర్ వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన నేటి మ్యాచ్ లో ఐదు పరుగుల తేడాతో బంగ్లాదేశ్ పై ఇండియా విజయం సాధించి సెమీస్ ఆశలు నిలబెట్టుకుంది బంగ్లా బ్యాట్స్ మెన్ లిట్టన్ దాస్ ధాటికి మ్యాచ్ చేజారిపోతుందన్న దశలో వర్షం పడి ఆటకు అంతరాయం కలిగింది. ఆ సమయానికి  బంగ్లాదేశ్ పటిష్ట స్థితిలో ఉంది. ఏడు ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసింది. లిట్టన్ దాస్ 26 బంతులలో 56 పరుగులతో క్రీజులో ఉన్నాడు.  ఒక వేళ మ్యాచ్ కొనసాగించలేని పరిస్థితి వస్తే బంగ్లా విజేత అయి ఉండేది. డక్ వర్త్ లూయూస్ (డిఎల్ఎస్)విధానం ద్వారా కావాల్సిన లక్ష్యం కంటే 17 పరుగులు ఎక్కువే చేసి ఉంది.

కానీ బంగ్లాను వరుణదేవుడు అడ్డుకున్నాడు. వర్షం తెరిపివ్వడంతో మ్యాచ్ ను కొనసాగించాలని అంపైర్లు, రిఫరీ నిర్ణయించారు. లక్ష్యాన్ని 16 ఓవర్లలో 151గా నిర్ణయించారు.  అప్పటికి 9 ఓవర్లలో 84 పరుగులు కావాల్సి ఉంది. అయినా సరే బంగ్లా విజయం కోసం చివరి బంతి వరకూ పోరాడింది. లిట్టన్-60; నూరుల్ హాసన్-25 (నాటౌట్); నజ్ముల్ హోస్సేన్ శాంటో-21 పరుగులతో చక్కటి పోరాట పటిమ కనబరిచారు. 16ఓవర్లలో 6 వికెట్లకు 145 పరుగులు చేయగలిగింది.

ఇండియా బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా చెరో రెండు;  మొహమ్మద్ షమీ ఒక వికెట్ పడగొట్టారు.

అంతకుముందు బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (2) జట్టు స్కోరు 11వద్ద తొలి వికెట్ గా వెనుదిరిగాడు. గత మూడు మ్యాచ్ ల్లో నిరాశ పరిచిన కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్ తో ఫామ్ లోకి వచ్చి  32బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 50 పరుగులు చేసి ఆ వెంటనే ఔటయ్యాడు. సూర్య కుమార్ యాదవ్ ధాటి గాడి 16బంతుల్లో 4  ఫోర్లతో 30 పరుగులు చేసి వెనుదిరిగాడు. హార్దిక్ పాండ్యా (7) అనవసర షాట్ కు ప్రయత్నించి ఔటయ్యాడు. దినేష్ కార్తీక్ (7) రనౌట్ కాగా, అక్షర్ పటేల్(7) కూడా నిరాశ పరిచాడు. విరాట్ కోహ్లీ మరోసారి సత్తా చాటి 44 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్ తో 64(నాటౌట్);  చివర్లో అశ్విన్ ఆరు బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్ తో 13 పరుగులతో అజేయంగా నిలిచారు.

బంగ్లా బౌలర్లలో హాసన్ మహుద్ మూడు; కెప్టెన్ షకీబ్ అల్ హసన్ రెండు వికెట్లు పడగొట్టారు.

విరాట్ కోహ్లీకే ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్