మహిళల ఆసియా కప్ లో నేడు జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై ఇండియా 59 పరుగులతో విజయం సాధించింది. బ్యాటింగ్ లో షఫాలీ వర్మ -55, స్మృతి మందానా-47, జెమీమా రోడ్రిగ్యూస్-35 (నాటౌట్) పరుగులతో రాణించడంతో ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 159 పరుగులు చేయగలిగింది. ఈ లక్ష్య ఛేదనలో బంగ్లా విఫలమైంది.
షిల్హేట్ లో జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. హార్మన్ ప్రీత్ కౌర్ స్థానంలో స్మృతి మందానా సారధ్యం చేపట్టింది. హార్మన్ తో పాటు హేమలత, మేఘన లకు విశ్రాంతి ఇచ్చారు. వారి స్థానంలో షఫాలీ వర్మ, కిరణ్ నవ్ గిరే, స్నేహ్ రానా జట్టులోకి వచ్చారు. తొలి వికెట్ (స్మృతి మందానా- రనౌట్) కు ఇండియా 96 పరుగులు చేసింది. ఆ కాసేపటికే షఫాలీ కూడా ఔటయ్యింది. రిచా ఘోష్ (4), కిరణ్ నవ్ గిరే (డకౌట్) విఫలమయ్యారు. దీప్తి శర్మ పది పరుగులు చేసి పెవిలియన్ చేరింది.
బంగ్లా బౌలర్లలో రుమానా అహ్మద్ మూడు; సల్మా ఖాతున్ ఒక వికెట్ సాధించారు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ నెమ్మదిగా ఆరంభించింది. తొలి వికెట్ కు 45 పరుగులు (9.1 ఓవర్లలో) చేసింది. ముర్షీదా ఖాతున్ 21 పరుగులు చేసి ఔట్ కాగా, మరో ఓపెనర్ ఫర్గానా హక్ 30 పరుగులు చేసింది. కెప్టెన్ నైగర్ సుల్తానా 36 పరుగులతో ఫర్వాలేదనిపించింది. 20 ఓవర్లు ముగిసే నాటికి ఏడు వికెట్ల నష్టానికి 100 పరుగులు చేయగలిగింది.
అర్ధ సెంచరీ తో పాటు రెండు వికెట్లు కూడా సాధించిన భారత క్రీడాకారిణి షఫాలీ వర్మకు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.
ఇండియా సోమవారం థాయ్ లాండ్ తో తలపడనుంది.