బంగ్లాదేశ్ తో జరిగిన మూడో వన్డేలో ఇండియా 227 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. ఇషాన్ కిషన్ అద్భుత ఇన్నింగ్స్ తో డబుల్ సెంచరీ (210- 131 బంతుల్లో 24 ఫోర్లు, 10సిక్సర్లు)తో పాటు విరాట్ కోహ్లీ సెంచరీ(113 పరుగులు, 91 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి ఇండియా 409 పరుగుల భారీ స్కోరు చేసింది. వీరిద్దరితో పాటు వాషింగ్టన్ సుందర్-37; అక్షర్ పటేల్ -20 రన్స్ చేశారు.
బంగ్లా బౌలర్లలో తష్కిన్ అహ్మద్, ఎబాదత్ హోస్సేన్, షకీబ్ అల్ హసన్ తలా రెండు; ముస్తాఫిజూర్, మిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా దేశ్ 33 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. జట్టులో షకీబ్-43; లిట్టన్ దాస్-29 పరుగులతో కాస్త చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. మిగిలిన బ్యాట్స్ మెన్ విఫలం కావడంతో 34 ఓవర్లలో 182 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
ఇండియా బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు; ఉమ్రాన్ మాలిక్, అక్షర్ పటేల్ చెరో రెండు; సిరాజ్, కులదీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ తలా ఒక వికెట్ సాధించారు.
ఇషాన్ కిషన్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’… బంగ్లా అల్ రౌండర్ మెహిదీ హసన్ మిరాజ్ కు ‘ప్లేయర్ అఫ్ ద సిరీస్’ దక్కాయి.