టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్ లో ఇండియా ఆటగాళ్ళు మరో రెండు విభాగాల్లో పతకాలు సాధించారు. హై జంప్ లో నిషద్ కుమార్ కు రజత పతకం లభించగా, డిస్కస్ త్రో లో వినోద్ కుమార్ కాంస్య పతకం సంపాదించాడు. నేటి ఉదయం క్రీడాకారిణి భవీనా పటేల్ టేబుల్ టెన్నిస్ లో రజత పతకం సాధించిన సంగతి తెలిసిందే. దీనితో ఇండియాకు మొత్తం మూడు పతకాలు ఇప్పటివరకూ లభించినట్లయింది. ఈ మూడూ ఈరోజే రావడం విశేషం.
హై జంప్ లో అమెరికాకు చెందిన రాడ్రిక్ 2.15 మీటర్లతో స్వర్ణం సాధించాడు. నిషద్ కుమార్ 2.06 మీటర్లతో రాణించి రజతం సాధించాడు. అమెరికా ఆటగాడు డి. వైస్ నిషద్ తో సమానంగా రాణించడంతో ఇద్దరికీ రజతాన్ని అందించారు.
డిస్కస్ త్రో లో వినోద్ కుమార్ తన ఆరు ప్రయత్నాల్లో ఐదోసారి అత్యుత్తమంగా రాణించి 19.91 మీటర్లు విసిరాడు. పోలాండ్ ఆటగాడు 20.02 మీటర్లతో స్వర్ణ, క్రొయేషియా ఆటగాడు 19.98 మీటర్లతో రజత పతకాలు సాధించారు.
ఆగస్టు 29న మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్న ఈ రోజే పారాలింపిక్స్ లో ఇండియాకు మూడు పతకాలు లభించడం సంతోషంగా ఉందని కేంద్ర క్రీడా శాఖా మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. ఈ క్రీడా దినోత్సవం చరిత్రలో గుర్తుండిపోయే రోజని అభివర్ణించారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిషద్, వినోద్ లకు శుభాకాంక్షలు తెలియజేశారు.