Monday, July 1, 2024
Homeస్పోర్ట్స్T20WC: ఇంగ్లాండ్ పై ఘన విజయం: ఫైనల్లో ఇండియా

T20WC: ఇంగ్లాండ్ పై ఘన విజయం: ఫైనల్లో ఇండియా

టీమిండియా టి20 వరల్డ్ కప్ ఫైనల్లో ప్రవేశించింది. నేడు జరిగిన సెమీ ఫైనల్లో అక్షర పటేల్, కుల్దీప్ యాదవ్ లు అద్భుతంగా బౌలింగ్ చెరో మూడు వికెట్లు తీసి ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ ను కకావికలం చేయడంతో 68 పరుగుల తేడాతో ఇండియా ఘనవిజయం సాధించి టైటిల్ రేసులో నిలబడింది.

డయానాలోని ప్రావిడెన్స్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైంది. ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. విరాట్ కోహ్లీ మరోసారి విఫలమై కేవలం 9 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. రిషబ్ పంత్ (4) కూడా నిరాశపరిచాడు. ఈ దశలో కెప్టెన్ రోహిత్ శర్మ-సూర్య కుమార్ యాదవ్ లు మూడో వికెట్ కు 73 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకున్నారు. రోహిత్ 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ లతో 57, సూర్య 36 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 రన్స్ చేసి అవుట్ కాగా, ఆ తర్వాత వచ్చిన వారిలో హార్దిక్ పాండ్యా 23; రవీంద్ర జడేజా 17 (నాటౌట్); అక్షర పటేల్ 10 పరుగులు చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల కోల్పోయి 171 పరుగులు చేసింది.

లక్ష్య సాధనలో ఇంగ్లాండ్  దూకుడుగానే ఆట మొదలుపెట్టింది. అయితే నాలుగో ఓవర్లో అక్షర్ బౌలింగ్ లో తొలి వికెట్ (జోస్ బట్లర్- 23)….. ఆ కాసేపటికే 34, 35  పరుగుల వద్ద మరో రెండు వికెట్లు (ఫిలిప్ సాల్ట్-5; బెయిర్ స్టో-డకౌట్) కోల్పోయింది. మిగిలిన వారిలో హ్యారీ బ్రూక్-25; జోఫ్రా ఆర్చర్-21 పరుగులు చేసి ఫర్వాలేదనిపించారు. 16.4 ఓవర్లలో103 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అక్షర్, కుల్దీప్ చెరో మూడు; బుమ్రా రెండు వికెట్లు సాధించారు.

అక్షర్ పటేల్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

ఆదివారం బార్బడోస్, బ్రిడ్జ్ టౌన్ లోని కెన్సింగ్టన్ మైదానంలో జరిగే ఫైనల్లో ఇండియా-సౌతాఫ్రికా తలపడనున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్