Saturday, January 18, 2025
HomeTrending Newsపాకిస్తాన్ తో వాణిజ్యానికి సరైన సమయం

పాకిస్తాన్ తో వాణిజ్యానికి సరైన సమయం

మూడోసారి నరేంద్ర మోడీ దేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జవహర్ లాల్ నెహ్రు తర్వాత మూడోసారి ప్రధాని పదవి చేపడుతున్న నేతగా మోడీ చరిత్ర సృష్టిస్తున్నారు. ఈ నెల 12న రాష్ట్రపతిభవన్‌లో జరుగనున్న ఈ కార్యక్రమానికి దక్షిణాసియా దేశాధినేతలు హాజరుకానున్నారు. శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మారిషస్ దేశాల అధినేతలను ఆహ్వానించారు.

బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా, శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే చారిత్రక ఘట్టానికి హాజరవుతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇక నేపాల్‌ ప్రధాని పుష్ప కమాల్‌ దహాల్‌ ప్రఛండ, భూటాన్‌, మారిషస్‌ ప్రధానులకు ఆహ్వానం అందించారు. మొత్తంగా ఆదివారం సాయంత్రం అట్టహాసంగా జరుగనున్న ఈ కార్యక్రమంలో సుమారు 8 వేల మంది పాల్గొంటారు.

ప్రధాని మోడీ ప్రమాణస్వీకారానికి పాకిస్తాన్ ప్రధానిని కూడా ఆహ్వానిస్తే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.  ఆర్థికంగా చతికిల పడిన పాక్ కు ఈ సమయంలో భారత్ స్నేహ హస్తం అందిస్తే వాణిజ్య పరంగా ఇరు దేశాలకు లబ్ది చేకూరుతుందని రాజకీయ విశ్లేషకుల భావన. రెండు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పేందుకు ఇదే సరైన తరుణం అని అంటున్నారు.

భారత్ ఆహ్వానిస్తే పాక్ పాలకులు స్పందించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పాక్ లో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన నాటి నుంచి ఆ దేశ ప్రజలు భారత్ తో వాణిజ్య సంబంధాలకు చొరవ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత భారత్ తో వాణిజ్య సంబంధాలను పాక్ తెంచుకుంది.

పాక్ ప్రధాని షేహబాజ్ షరీఫ్ సోదరుడు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తో ప్రధాని మోడికి స్నేహం ఉంది. గతంలో నవాజ్ మనవరాలు మెహరున్నిసా వివాహానికి 2015లో మోడీ హాజరయ్యారు. అప్పుడు మోడీ లాహోర్ రాకను పాక్- భారత్ ప్రజలు హర్షించారు. ఈ నేపథ్యంలో మోడీ చొరవ తీసుకొని పాక్ తో స్నేహం చేస్తే సరిహద్దుల్లో ఉద్రిక్తతల నివారణకు దోహదపడుతుందనటంలో సందేహం లేదు.

చైనాకు దగ్గరవుతున్న పాకిస్తాన్ తో వైరం కొనసాగించటం ద్వారా భవిష్యత్తులో భారత్ కు నష్టం చేకూరుస్తుంది. సరిహద్దుల్లో ప్రశాంతత, ఇరుగు పొరుగుతో స్నేహ సంబంధాలు ఆచరణాత్మకంగా ఉండాలి. జవహర్ లాల్ తర్వాత ప్రధానిగా మూడో దఫా పదవి చేపట్టబోతున్న మోడీ… భారత విదేశాంగ విధానాన్ని కొత్త పంథాలో ముందుకు తీసుకెళ్ళాల్సిన ఆవశ్యకత ఉంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్