పారిస్ లో జరుగుతున్న ఆర్చరీ ప్రపంచ కప్ లో ఇండియా నేడు మరో మూడు స్వర్ణ పతకాలు సాధించింది. స్టేజ్-౩ లో మహిళల వ్యక్తిగత రికర్వ్ విభాగంలో మన దేశానికి చెందిన స్టార్ ఆర్చర్ దీపికా కుమారి, రష్యాకు చెందిన ఎలీనా ఒసిపోవాపై 6-0 తేడాతో విజయం సాధించి అవలీలగా స్వర్ణం గెల్చుకుంది.

అంతకుముందు జరిగిన మిక్స్ డ్ రికర్వ్ విభాగంలో కూడా దీపికా కుమారి, అతను దాస్ జోడీ నెదర్లండ్స్ కు చెందిన డెన్ బర్గ్, గాబ్రిలా జోడీని 5-3 తేడాతో ఓడించి స్వర్ణం గెల్చుకున్నారు. దీపికా, దాస్ లు భార్యాభర్తలు. ఇద్దరూ కలిసి సాధించిన తొలి స్వర్ణ పతకం కూడా ఇదే కావడం మరో విశేషం.

ఉదయం జరిగిన మహిళల జట్టు విభాగంలో కూడా దీపికా కుమారి, అంకితా భకత్, కొమలికా బరి జట్టు మెక్సికో కు చెందిన జట్టును 5-1 తేడాతో ఓడించి స్వర్ణం గెల్చుకున్నారు. నిన్న జరిగిన వ్యక్తిగత కాంపౌండ్ విభాగంలో భారత అతగాడు అభిషేక్ వర్మ స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే. ఈ పోటీలో మొత్తం నాలుగు స్వర్ణాలు మనదేశం సాధించింది.

ఈ ఏడాది ఏప్రిల్ లో ప్రారంభమైన వరల్డ్ అర్చరీ టోర్నమెంట్లలో ఇప్పటివరకూ ఏడు స్వర్ణ పతకాలు సాధించి పతకాల పట్టికలో భారత్ అగ్రస్థానంలో ఉంది. ఏప్రిల్ ¬19 నుంచి 25 వరకూ గ్వటిమాలలో జరిగిన టోర్నీలో కూడా రికర్వ్ విభాగంలో పురుషుల, మహిళల వ్యక్తిగత, మహిళల జట్లు మూడు స్వర్ణాలు, ఒక రజత పతకం కూడా సాధించారు.

వచ్చే నెలలో టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్ క్రీడల్లో కూడా ఆర్చరీ విభాగంలో మన సత్తా చాటేందుకు ఈ పారిస్ విజయం ఉపకరిస్తుంది. ఇదే స్ఫూర్తి కొనసాగిస్తే టోక్యో నుంచి మన బృందం పసిడి పతకాలతో తిరిగి వస్తుందని క్రీడా శ్లేషకులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *