ఇండియా-ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్ల మధ్య జరిగిన రెండో టి 20 మ్యాచ్ లో ఇండియా సూపర్ ఓవర్ విజయం సాధించింది. ముంబై లోని డా.డీవై పాటిల్ స్పోర్ట్స్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఒక వికెట్ నష్టపోయి 187 పరుగులు చేసింది. కెప్టెన్ హేలీ 25 పరుగులు చేసి ఔట్ కాగా, మూనీ 54 బంతుల్లో 13 ఫోర్లతో 82; తహీలా మెక్ గ్రాత్ 51 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్సర్ తో 70 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. దీప్తి శర్మకు ఆ ఒక్క వికెట్ దక్కింది.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా తొలి వికెట్ కు 76 పరుగులు చేసింది. షఫాలీ వర్మ 34 పరుగులు చేసి వెనుదిరిగింది. మరో ఓపెనర్ స్మృతి మందానా 49 బంతుల్లో 9 ఫోర్లు, 4సిక్సర్లతో 79 పరుగులు చేసి రాణించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్-21 చేసి ఔటయ్యింది. చివరి బంతికి ఐదు పరుగులు అవసరం కాగా దేవికా వైద్య ఫోర్ చేయడంతో మ్యాచ్ టై గా ముగిసింది. దీనితో సూపర్ ఓవర్ అనివార్యమైంది.
సూపర్ ఓవర్లో ఇండియా తొలి బంతికి రిచా ఘోష్ సిక్సర్ కొట్టి రెండో బంతికి ఔటయ్యింది. మూడో బంతికి హర్మన్ సింగల్ తీసి స్ట్రైక్ స్మృతి మందానాకు ఇచ్చింది, నాలుగు, ఐదు బంతులను ఫోర్, సిక్సర్ లభించగా చివరి బంతికి మూడు పరుగులు వచ్చాయి. దీనితో మొత్తం 20 పరుగులు వచ్చాయి.
ఆసీస్ సూపర్ ఓవర్లో తొలి బంతికి 4, రెండో బంతికి సింగిల్ సాధించింది, మూడో బంతికి గార్డ్ నర్ ఔట్ అయ్యింది. నాలుగో బంతికి కేవలం సింగల్ లభించింది. ఐదో బంతికి ఫోర్, ఆరో బంతికి సిక్సర్ లభించినా ఇండియా నాలుగు పరుగుల తేడాతో గెలుపు సొంతం చేసుకుంది.
స్మృతి మందానాకు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.