ఇండియా- శ్రీలంక మహిళా క్రికెట్ జట్ల మధ్య జరుగుతోన్న మూడు మ్యాచ్ ల టి 20 సిరీస్ లో భాగంగా నేడు జరిగిన మొదటి మ్యాచ్ లో ఇండియా 34 పరుగులతో ఇండియా విజయం సాధించింది. దంబుల్లా లోని ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
జట్టు స్కోరు 17 వద్ద ఇండియా రెండు వికెట్లు (స్మృతి మందానా-1; సబ్బినేని మేఘన-డకౌట్) కోల్పోయింది. ఓపెనర్ షఫాలి వర్-31; రోడ్రిగ్యుస్-36; కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్-22 పరుగులు చేశారు. చివర్లో దీప్తి శర్మ 8 బంతుల్లో 3 ఫోర్లతో 17 పరుగులతో నాటౌట్ గా నిలవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 138 పరుగులు చేసింది.
శ్రీలంక బౌలర్లలో రణవీర మూడు; ఓ రణసింఘే రెండు; కెప్టెన్ ఆటపట్టు ఒక వికెట్ పడగొట్టారు.
శ్రీలంక మహిళలు ఒక్క పరుగుకే తొలి వికెట్ (విష్మి గుణరత్నె-1) కోల్పోయారు. జట్టులో కవిష దిల్హరి 47 పరుగులతో నాటౌట్ గా నిలిచి అత్యధిక స్కోరర్ గా నిలిచింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 104 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఇండియా బౌలర్లలో రాధా యాదవ్ రెండు; దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, షఫాలి వర్మ తలా ఒక వికెట్ పడగొట్టారు.
ఇండియా జట్టులో అత్యధిక పరుగులు చేసిన జెమీమా రోడ్రిగ్యుస్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.