మహిళల ఆసియా కప్ టి 20కప్ ను ఇండియా గెల్చుకుంది. నేడు జరిగిన ఫైనల్లో శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇండియా బౌలింగ్, ఫీల్డింగ్ దెబ్బకు శ్రీలంక బ్యాటింగ్ లైనప్ కకావికలం అయ్యింది.
ఇండియాకు ఇది ఏడో ఆసియా కప్ కాగా వీటిలో నాలుగు వన్డే టైటిల్స్, మూడు టి 20టైటిల్స్ ఉన్నాయి.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 9 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. జట్టు మొత్తంలో ఓ రణవీర-18; రణసింఘే-13 మాత్రమే 13 రెండంకెల స్కోరు చేయగలిగారు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 65 పరుగులు చేయగలిగింది.
ఇండియా బౌలర్లలో రేణుకా సింగ్ మూడు; గయక్వాడ్, స్నేహ్ రానా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. లంక ఓపెనర్లు ఇద్దరూ రనౌట్ గా వెనుదిరగడం గమనార్హం.
ఈ స్వల్ప లక్ష్యాన్ని ఇండియా 8.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ షఫాలీ వర్మ 5 పరుగులు చేసి ఔట్ కాగా, రోడ్రిగ్యూస్ 2 పరుగులు చేసి వెనుదిరిగింది. స్మృతి మందానా 25 బంతుల్లో 5ఫోర్లు, 3 సిక్సర్లతో 51; కెప్టెన్ హర్మన్ ప్రీత్-11పరుగులతో అజేయంగా నిలిచారు.
రేణుకా సింగ్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ , దీప్తి శర్మకు ‘ప్లేయర్ అఫ్ ద సిరీస్’ గెల్చుకున్నారు.