జమ్ము కాశ్మీర్ లో ఓ వైపు వర్షాలు కుండపోతగా పడుతుంటే మరోవైపు ముష్కర మూకలు దొంగచాటుగా దేశంలోకి వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా పూంచ్ సెక్టార్ లో నియంత్రణ రేఖ వెంబడి భారత్ లోకి వచ్చేందుకు యత్నించిన ఉగ్రవాదుల ప్రయత్నాన్ని భారత సైన్యం భగ్నం చేసింది. ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. “12/13 జూలై 2022 అర్ధరాత్రి సమయంలో, పూంచ్ సెక్టార్ (J&K)లో నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు ప్రయత్నం జరిగింది, దానిని అప్రమత్తమైన దళాలు తగిన విధంగా విఫలం చేశాయి.” అని రక్షణ శాఖ ప్రకటించింది. ఎంతమందిని అదుపులోకి తీసుకున్నది తెలియరాలేదు.
నియంత్రణ రేఖకు సమీపంలోని నది ప్రాంతంలో సొరంగం చేసుకుని చొరబాటుకు యత్నించారని, లష్కర్ ఏ తోయిబా, జైష్ ఏ మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దున్ కు చెందినవారని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. రాజోరి – పూంచ్ సెక్టార్ లో చొరబాట్లు అధికంగా జరుగుతున్నాయి. పీర్ పంజాల్ కనుమలకు దక్షిణ ప్రాంతమైన ఈ ప్రాంతం గుండా ఇటీవలి కాలంలో చొరబాట్లు ఎక్కువగా జరుగుతున్నాయి.