ప్రపంచీకరణతొ దేశాల మధ్య దూరం తగ్గినా అంతరాలు పెరుగుతున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలు మూడో ప్రపంచ దేశాలపై పెత్తనం చేసేందుకు నయా వలస విధానం(New Colonialism) అవలంభిస్తున్నాయి. పెట్టుబడుల పేరుతో వెళ్లి ఆయా దేశాలను కబంద హస్తాల్లో బందిస్తున్నాయి. ఇందుకు ఉదాహరణే శ్రీలంక, పాకిస్థాన్ దేశాల్లో పెట్టుబడుల పేరుతో అడుగు పెట్టిన చైనా…తన విధానాలతో వాటి ఆర్థిక వ్యవస్థల వెన్ను విరిచింది.
అమెరికా తన మాట వినని దేశాలను ఆంక్షల పేరుతో ఆగమాగం చేస్తుంది. అంతర్జాతీయంగా సాయం అందకుండా అడ్డుకుంటుంది. అమెరికా దాష్టికాలకు ఇప్పటికే వెనిజులా నిలువెల్లా గాయాలతో చితికిపోగా…ఆ కోవలో ఇప్పుడు కరీబియన్ దీవుల్లోని క్యూబా చేరింది.
క్యూబా అంటే ఫిడేల్ క్యాస్ట్రో.. రెండూ విడదీయరాని పేర్లుగా స్థిరపడిపోయాయి. క్యాస్ట్రో అధికారంలో ఉండగా ఓ దశలో అమెరికానూ ఎదిరించింది క్యూబా. ఆయనను హత్య చేసేందుకు అన్నంలో విషం కలపడం, ఆయన తాగే చుట్టలో బాంబు పెట్టడం సహా అనేక కుట్రలు జరిగాయి. 638 సార్లు ఇలాంటి హత్యా ప్రయత్నాల నుంచి క్యాస్ట్రో బయటపడ్డట్లు చెబుతారు. వీటన్నిటినీ తట్టుకున్న క్యాస్ట్రో క్యూబాను నిలబెట్టారు. ఆయన హయాంలో క్యూబా ప్రజా జీవనానికి సంబంధించిన అనేక అంశాల్లో మెరుగ్గా ఉండేది. క్యాస్ట్రో 2008లోనే అధ్యక్ష పదవి నుంచి దిగిపోయి తమ్ముడు రౌల్ క్యాస్ట్రోను కూర్చోబెట్టారు. ఇప్పుడు మిగుల్ డియాజ్ కనెల్ అధ్యక్షుడిగా ఉన్నారు.
కోవిడ్-19 మహమ్మారి, యుఎస్ ఆంక్షల కఠినతరం కావటం కారణంగా క్యూబా ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. దిగుమతులపై ఎక్కువగా ఆధారపడిన క్యూబా, గత నాలుగు సంవత్సరాలుగా ఆహారం, మందులు, వినియోగ వస్తువుల కొరతను ఎదుర్కొంటోంది. దేశం అధిక ద్రవ్యోల్బణంతో తల్లడిల్లుతోంది. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. కార్మికులకు జీతాలు నిలిచిపోయాయి.
అంతర్జాతీయ మార్కెట్‌లలో చమురు కంపనీలు ఇంధనం కొనుగోలు కోసం విదేశీ కరెన్సీని సేకరించడానికి US డాలర్లలో చెల్లింపును మాత్రమే అంగీకరించాయి. విదేశీ నిల్వలను పెంచుకుని.. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి చమురు కొనేందుకు.. విదేశీ కరెన్సీని పెంచుకోవాలని క్యూబా యత్నించింది. ఇందుకోసం, కొన్ని పెట్రోల్ బంకుల్లో అమెరికా డాలర్లతో మాత్రమే లావాదేవీలు సాగేలా నిర్ణయం తీసుకుంది. దీంతో దేశాయ కరెన్సీ పెసో విలువ వేగంగా క్షీణించింది.
దిద్దుబాటు చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఫిబ్రవరి 1 నుండి ఇంధన ధరలను ఐదు రెట్లు పెంచుతామని ప్రకటించింది. దీంతో లీటర్ పెట్రోల్ ధర 25 పెసోల నుండి 132 పెసోలకు(మన దేశ రూపాయల్లో సుమారు 45౦) పెరుగనుంది. ఈ చర్యతో లోటు తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. కొరత కారణంగా 2023 మే డే పరేడ్ రద్దు చేయవలసి వచ్చింది.
రాజధాని హవానాలో విద్యార్థులు పాఠశాలలకు.. నగర వాసులు ఉద్యోగాలకు వెళ్లడానికి బస్సు కోసం గంటల తరబడి వేచి ఉండటం పరిపాటిగా మారింది. కరీబియన్ దీవులు, లాటిన్ అమెరికా ఖండం తన మాట వినని దేశాల్లో కుట్రలు చేసి పౌర ప్రభుత్వాలను అమెరికా కూలదోస్తోంది.
-దేశవేని భాస్కర్