కేంద్ర మాజీమంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పులేసుకుని వేములవాడ రాజన్న ఆలయంలోకి వెళ్లారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. 73 ఏళ్ల ప్రకాశ్ జవదేకర్ దైవ భక్తుడు. చెప్పులేసుకుని ఆలయంలోకి వెళ్లేంత మూర్ఖుడు కాదు…చెప్పులు విడిచి సాక్సులతో ఆలయంలోకి వెళ్లారు. నేను వారితోనే ఉన్నా.’’అని స్పష్టం చేశారు.
సాక్సులకు, చెప్పులకు తేడా తెలియని ఫాల్తుగాళ్లు చేసే ప్రచారాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. వేములవాడ రాజన్న ఆలయ అయ్యగారిని అడిగితే వాస్తవాలు తెలుస్తాయన్నారు. ఈ రోజు కరీంనగర్ లో జరుగుతున్న స్మార్ట్ సిటీ పనులను పర్యవేక్షించడానికి ని టవర్ సర్కిల్ వద్దకు వచ్చిన బండి సంజయ్ వద్ద మీడియా ప్రతినిధులు ఈ అంశాన్ని ప్రస్తావించగా పైవిధంగా బదులిచ్చారు. ప్రకాశ్ జవదేకర్ వయసు 73 ఏండ్ల పెద్దాయన. నడుస్తుంటే జారి కింద పడబోతే పట్టుకున్నా… దానిని కూడా ఫాల్తుగాళ్లు రాద్దాంతం చేస్తారా? అంటూ మండిపడ్డారు.
ఆ తర్వాత ‘‘మహజన్ సంపర్క్ అభియాన్’’లో భాగంగా కేంద్ర మాజీమంత్రి ప్రకాశ్ జవదేకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, కరీంనగర్, సిద్దిపేట, హన్మకొండ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, శ్రీకాంత్, రావు పద్మ, పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు లతో కలిసి హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండలం సముద్రాల గ్రామానికి వచ్చారు. ‘‘ఎల్కతుర్తి- సిద్దిపేట ‘‘ జాతీయ రహదారి విస్తరణ పనులను పరిశీలించారు. గత 9 ఏళ్లలో తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణం కోసం 1 లక్షా 9 వేల కోట్లకుపైగా నిధులు కేటాయించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలిపారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో గత 4 ఏళ్లలోనే 7 వేల కోట్లకుపైగా నిధులు తీసుకొచ్చినట్లు చెప్పారు. అందులో రోడ్ల నిర్మాణం కోసమే రూ.4 వేల కోట్లకుపైగా నిధులు మంజూరైనట్లు పేర్కొన్నారు.