Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఒలింపిక్స్ విశేషాలు

ఒలింపిక్స్ విశేషాలు

2024 పారిస్ ఒలింపిక్స్ గొప్పగా జరగలేదనే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇచ్చిన పతకాలు నాసిరకం అన్నవాళ్లను చూశాం. కానీ ఎన్నో ప్రత్యేకతలకు కూడా వేదికైంది. అవి కూడా తెలియాలి కదా!

  • మొదటిసారిగా పారిస్ ఒలింపిక్స్ లో స్త్రీ పురుష క్రీడాకారులకు సమాన ప్రాతినిధ్యం లభించింది. 5250 మంది పురుషులుంటే అంతే సంఖ్యలో స్త్రీలు ఉన్నారు. గొప్ప విషయమే కదా!
    ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు లింగ సమానత్వాన్ని చాటేలా రూపొందించారు.
  • వందేళ్ల తర్వాత పారిస్ ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇచ్చింది. 1900, 1924 తర్వాత ఇప్పుడే. అందుకే గౌరవ సూచకంగా ఈఫిల్ టవర్ నుంచి ఇనుము సేకరించి పతకాల్లో కలిపారు.

  • పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ఒలింపిక్స్ గ్రామంలో ఏసీలు ఏర్పాటు చేయలేదు. మట్టితో ఫ్లోరింగ్ వేసి కింద చల్లటి నీరు ప్రవహించేలా చేశారు. అలాగే ఎండ ప్రసరించేలా రూమ్స్ డిజైన్ చేశారు.
  • పది మందికి పైగా మధ్య వయస్కులైన ఆటగాళ్లు ఉన్నారు. 65 ఏళ్ళ స్పెయిన్ ఈక్వెస్ట్రియన్ ఆటగాడు జువాన్ ఆంటోనియో జిమ్మెనేజ్ అందరికన్నా పెద్దవాడు.
  • అందరికంటే చిన్నది చైనా పిల్ల జెంగ్ హావ్ హావ్. లండన్ ఒలింపిక్స్ సమయంలో పుట్టిన ఈ చిన్నదాని వయసు 11 సంవత్సరాల 11 నెలలు. స్కేట్ బోర్డింగ్ లో పోటీపడి 18 వ స్థానం సాధించినా మంచి భవిష్యత్తు ఉంది.

  • ‘ఎవరైనా కసిగా కొడతారు. బలంగా కొడతారు. వీడేంట్రా శ్రద్ధగా మొక్కకి అంటు కట్టినట్టు కొడుతున్నాడు ‘ అని అతడు సినిమాలో తనికెళ్ళ భరణి డైలాగ్. అచ్చంగా అలాగే షూటింగ్ లో తడాకా చూపి సిల్వర్ మెడల్ సాధించాడు టర్కీ మాన్ యూసఫ్ డిరెక్. 51 ఏళ్ళ వయసులో అతి మాములుగా జేబులో చెయ్యి పెట్టుకుని పోటీలో పాల్గొన్న ఈ ఒలింపియన్ అందరి దృష్టినీ ఆకర్షించాడు. లెక్కలేనంత ప్రచారం లభించింది.
  • అందరికన్నా ఎక్కువగా 146 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది అమెరికా. 1896 లో ఒలింపిక్స్ మొదలైనప్పటి నుంచి ఈ దేశం 3085 మెడల్స్ సాధించింది. తరవాతి స్థానాల్లో చైనా, జపాన్ , బ్రిటన్, సోవియట్ యూనియన్ తదితర దేశాలున్నాయి.

భారత దేశానికి సంబంధించినంత వరకు ఆశించిన పతకాలు రాకపోయినా చక్కటి ప్రతిభ చూపారు. వినేష్ ఫోగట్ ఉదంతం ఒక గుణపాఠం. నీరజ్ చోప్రా రజతంతో మెరవడమే కాక క్రీడా స్ఫూర్తి చాటాడు. నాలుగేళ్ళ తర్వాత లాస్ ఏంజెల్స్ లో జరిగే ఒలింపిక్స్ లో మరిన్ని పతకాలు వస్తాయని ఆశిద్దాం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్