Saturday, January 18, 2025
Homeఅంతర్జాతీయంఐదేళ్ళ తర్వాత ఇంటర్నెట్ సేవలు

ఐదేళ్ళ తర్వాత ఇంటర్నెట్ సేవలు

పాకిస్థాన్ ప్రభుత్వం  చాలా కాలం తర్వాత బెలుచిస్థాన్, ఖైభర్ ఫక్తుంక్వా ప్రజలకు ఓ తీపి కబురు అందించింది. ఐదేళ్ళ అనంతరం ఈ రెండు రాష్ట్రాల్లో ఇంటర్నెట్ సేవలకు అనుమతించింది. టెలికాం సంస్థలు ఇంటర్నెట్ సేవలు పునరుద్దరించుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది.

బెలుచిస్థాన్ లోని ఆరు జిల్లాల్లో ,  ఖైభర్ ఫక్తుంక్వాలోని రెండు జిల్లాల్లో గత ఐదేళ్ళు గా ఇంటర్నెట్ పూర్తిగా నిలిపివేశారు. రెండు రాష్ట్రాలలోని మిగతా జిల్లాల్లో 2 జి సేవలు నామమాత్రంగా అందుతాయి. సెల్ ఫోన్ కంపెనీలు  2 జీ నుంచి 4 జీ కి  మారవచ్చని పాక్ ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోన నేపథ్యంలో విద్యార్థుల చదువులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పాక్ మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేయటంతో ప్రభుత్వంలో చలనం వచ్చింది.

 

పాకిస్థాన్ లో ఉన్న ఐదు రాష్ట్రాల్లో పంజాబ్, ఇస్లామాబాద్ రాజధాని ప్రాంతం తప్పితే మిగతా రాష్ట్రాల్లో నిత్యం ఎదో గొడవలు, ఆందోళనలు జరుగుతూనే ఉంటాయి. కరాచీ రాజధానిగా ఉండే సింద్ రాష్ట్రంలో రాజకీయ అసమ్మతి తీవ్రంగా ఉంటుంది. పాక్ పాలనా యంత్రాంగంలో పంజాబ్ వాళ్ళదే ఆధిపత్యమని సింద్ రాజకీయ నాయకులు ఆగ్రహంతో ఉంటారు.

బెలుచిస్థాన్ ప్రాంతానికి నిధుల కేటాయింపులో అన్యాయం జరుగుతోందని కొందరు, పాకిస్థాన్ నుంచి విముక్తి కావాలంటూ ప్రత్యెక దేశం కోసం మరికొందరు ఆందోళనలు చేస్తుంటారు. బెలుచ్ రాజధాని క్వెట్టా లో నిరసనలు, బంద్ లు సాధారణంగా మారాయి. నిరసనల్ని అణచివేసే క్రమంలో పాక్ మిలిటరీ  ఆ ప్రాంతంలో అనేక దురాగాతాలకి ఒడిగడుతోంది.

ఖైభర్ ఫక్తుంక్వా రాష్ట్రం ఆఫ్ఘానిస్తాన్ కు ఆనుకొని ఉండటం వారి దురదృష్టం. పష్టూన్ తెగ వారు ఈ రాష్ట్రంలో ఎక్కువగా ఉంటారు. పష్టూన్ లు ఆఫ్ఘన్ కు చెందిన వారు కావటంతో సహజంగానే తాలిబాన్ ల రాక పోకలు ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. మొదట్లో పట్టించుకోని పాక్ ప్రభుత్వం సెప్టెంబర్ 11 ఘటన్ తర్వాత ఖైభర్ ఫక్తుంక్వా నేతల్ని, ప్రజల్ని అనుమానంగానే చూస్తుంది. ప్రస్తుత పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఈ రాష్ట్రానికే చెందినవారు. రాజధాని పెషావర్ మినహా రాష్ట్రం లోని మిగతా నగరాలు, గ్రామాలు అభివృద్దికి ఆమడ దూరంలో ఉంటాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్