Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్హైదరాబాద్ పై కోల్ కతా విజయం

హైదరాబాద్ పై కోల్ కతా విజయం

ఐపీఎల్ లో హైదరాబాద్ పై కోల్ కతా ఆరు వికెట్లతో విజయం సాధించి ప్లే ఆఫ్ రేసులో నిలిచింది. లక్ష్యం చిన్నదే  అయినా  హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో విజయం కోసం కోల్ కతా  శ్రమించాల్సి వచ్చింది. ఓపెనర్ శుభమన్ గిల్ 57 పరుగులతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’  అవార్డు గెల్చుకున్నాడు.  దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కొంత కాలంగా నిలకడగా రాణిస్తున్న ఓపెనర్ వృద్ధిమాన్ సహా తొలి ఓవర్లోనే  సౌతీ బౌలింగ్ లో డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత ఎలాంటి కీలక భాగస్వామ్యం నమోదు చేయకుండానే వరుస వికెట్లు హైదరాబాద్ కోల్పోయింది. కెప్టెన్ విలియమ్సన్ (26), అబ్దుల్ సమద్ (25), ప్రియమ్ గార్గ్ (21)  మినహా మిగిలిన వారు నిరాశ పరిచారు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 115 పరుగులు మాత్రమే చేయగలిగింది. కోల్ కతా బౌలర్లలో సౌతీ, శివం మావి, వరుణ్  చక్రవర్తి తలా రెండు వికెట్లు, షకీబ్ అల్ హసన్ ఒక వికెట్ పడగొట్టారు.

విజయ లక్ష్యం చిన్నది కాబట్టి నాలుగైదు ఓవర్ల ముందే మ్యాచ్ అయిపోతుందని అందరూ భావించినా  కోల్ కతా చివరి ఓవర్ వరకూ ఆడాల్సి వచ్చింది. ఓపెనర్ వెంకటేష్ అయ్యర్, వన్ డౌన్ బాట్స్ మాన్ త్రిపాఠి త్వరగా ఔటయ్యారు. మూడో వికెట్ కు గిల్, నితీష్ రాణాలు 55 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును విజయం వైపు నడిపించారు. మరో రెండు బంతులు మిగిలి ఉండగానే నాలుగు వికెట్లు కోల్పోయి కోల్ కతా విజయం సాధించింది.

ఈ విజయంతో ప్లే ఆఫ్ రేసులో నాలుగో బెర్త్ కోసం జరుగుతున్న పోటీలో కోల్ కతా ముందంజలో నిలిచింది.  ఇప్పటికే చెన్నై, ఢిల్లీ, బెంగుళూరు జట్లు తమ స్థానాలు ఖరారు చేసుకున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్