కీలక మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ సత్తా చాటింది. ప్లే ఆఫ్ లో చోటు దక్కించుకోవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో రాణించి రాజస్థాన్ రాయల్స్ పై 8 వికెట్లతో ఘన విజయం సాధించి రేసులో నిలిచింది. ఈ ఓటమితో రాజస్థాన్ ప్లే ఆఫ్ పోటీ నుంచి నిష్క్రమించింది.
షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన నేటి మ్యాచ్ లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ముంబై బౌలర్లు కల్టర్ నైల్, జేమ్స్, నీషమ్, బుమ్రా రాణించడంతో రాజస్థాన్ 90 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ ఎవిన్ లూయీస్ ఒక్కడే 24 పరుగులతో అత్యధిక స్కోరు చేశాడు. మరో ఓపెనర్ జైశ్వాల్-12, డేవిడ్ మిల్లర్-15; రాహుల్ తెవాటియా-12 పరుగులు చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది. నైల్-4; నీషమ్-3, బుమ్రా-2 వికెట్లు పడగొట్టారు.
ముంబై ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించింది. కెప్టెన్ రోహిత్ శర్మ 13 బంతుల్లో 1ఫోర్, 2సిక్సర్లతో 22 పరుగులు చేసి ఔటయ్యాడు. వన్ డౌన్ లో వచ్చిన సూర్య కుమార్ యాదవ్ ఈ మ్యాచ్ లో కూడా విఫలమై 13 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే మరో ఓపెనర్ ఇషాన్ కిషన్, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాతో కలిసి మరో వికెట్ పడకుండా 8.2 ఓవర్లలోనే లక్ష్యం ఛేదించారు. ఇషాన్ 25 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 50; హార్దిక్ పాండ్యా ఐదు పరుగులతో అజేయంగా నిలిచారు. రాజస్థాన్ బౌలర్లలో సకారియా, ముస్తాఫిజూర్ రెహ్మాన్ చెరో వికెట్ పడగొట్టారు.
ముంబై బౌలర్ నాథన్ కల్టర్ నైల్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.