హైదరాబాద్‌కి చెందిన ఎం.అనసూయ IRS(Indian Revenue Service) అధికారి లింగ మార్పిడికోసం అభ్యర్థించగా కేంద్రం అందుకు అంగీకరించింది. ప్రస్తుతం ఇది దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్ మారింది. ఇండియన్ సివిల్ సర్వీస్ చరిత్రలోనే ఇది మొదటిసారి. మహిళగా ఉన్న తాను పురుషుడిగా మారాలనుకుంటున్నానని రిక్వెస్ట్ పెట్టుకోగా ఆర్ధిక శాఖ అనుమతి ఇచ్చింది.
దీంతో 35 ఏళ్ళ అనసూయ… M అనుకత్తీర్ సూర్యగా పేరు మార్చుకున్నారు. ఇన్నాళ్లు మహిళగా ఉన్న అనుకతిర్‌ను ఇకపై పురుషుడిగా ప్రభుత్వం పరిగణించనుంది. అన్ని అధికారిక రికార్డుల్లోనూ అనుకతిర్ సూర్యగా గుర్తిస్తారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై సూర్య ఆనందం వ్యక్తం చేశారు.
2013లో సివిల్స్ కు ఎంపికైన అనసూయ చెన్నై కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ విభాగంలో అసిస్టెంట్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహించారు. 2018లో పదోన్నతిపై హైదరాబాద్ కు బదిలీపై వచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
సూర్య.. చెన్నైలోని మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. భోపాల్‌లోని నేషనల్ లా ఇన్‌స్టిట్యూట్ యూనివర్సిటీ నుంఛి 2023లో సైబర్ లా అండ్ సైబర్ ఫోరెన్సిక్స్‌లో పీజీ డిప్లొమా పూర్తి చేశారు.
హైదరాబాద్ NALSAR (నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్) యూనివర్సిటీకి చెందిన BA LLB లా విద్యార్థి గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్‌లో లింగాన్ని గుర్తించరాదని వర్సిటీని 2015 జూన్ లో అభ్యర్థించారు. ‘Ms’కి బదులుగా ‘Mx’ ఇవ్వాలన్న విద్యార్థి అభ్యర్థనకు విశ్వవిద్యాలయం సమ్మతించింది. దేశంలో లింగనిర్ధారణను గుర్తించేందుకు ఇదొక చిన్న తొలి అడుగు అని విద్యార్థి తెలిపారు.
హైదరాబాద్ లోని కేంద్రీయ విశ్వవిద్యాలయం 2024-25 విద్యా సంవత్సరం ప్రారంభానికి ట్రాన్స్‌జెండర్ లకు ప్రత్యేక విధానాన్ని ప్రకటించింది. ఢిల్లీ విశ్వవిద్యాలయం తర్వాత అటువంటి విధానం అమలు చేసిన రెండవ విశ్వవిద్యాలయం HCU కావటం గమనార్హం.
IRS అధికారి పేరు, లింగ మార్పిడి అంశం దేశంలో ఎంతో మందికి స్పూర్తిదాయకం కానుంది. అనుకతీర్ సూర్య తన సమస్యను ప్రభుత్వానికి నివేదించటం సాహసం కాగా… కేంద్ర ప్రభుత్వం అంతే ఉదారంగా ఆమోదం తెలపటం అభినందనీయం. ఈ అంశం వినటానికి మన దేశంలో కొత్త అయినా.. అనేక మంది లింగ మార్పిడి విషయంలో అవస్థలు పడుతున్నారు. న్యాయపరమైన సలహాలు, సామాజిక మద్దతు లేక వైద్య మాఫియా చేతిలో చిక్కి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ట్రాన్స్ జెండర్ అంశాల్లో న్యాయ, వైద్య సలహాల కోసం ప్రభుత్వాలు సంస్థలు ఏర్పాటు చేస్తున్నా… ఆచరణలో తగిన రీతిలో ఫలితాలు ఇవ్వటం లేదు. బాధితులు సకాలంలో గొంతు విప్పేందుకు కుటుంబం నుంచి గాని, సమాజం నుంచి కాని సరైన రీతిలో తోడ్పాటు అందటం లేదు. ఉన్నత విద్యావంతులు న్యాయస్థానాలను ఆశ్రయించి తమ సమస్యలు పరిష్కరించుకుంటున్నా… నిరక్షరాస్యులు, నిరుపేద వర్గాల్లోని వారు ఇక్కట్లు పడుతున్నారు.
-దేశవేని భాస్కర్