Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Friendly Policing : చెబితే బాగోదు కానీ…కొందరి ప్రేమ ఎండమావిలో నీళ్లు తాగడం లాంటిది అని వేమన నిట్టూర్చాడు. ఇంకొంచెం మొరటుగా కూడా చెప్పాడు మనలో బలంగా నాటుకోవడానికి. అంటే…కొందరి నుండి ప్రేమాభిమానాలు ఆశించడమే తప్పు అని వేమన తేల్చేశాడు.

అలా పోలీసు అంటే పోలీసులానే ఉంటాడు. ఉండాలి. వారి నుండి లాఠీ కాఠిన్యాన్ని, తూటా మాటల కోపాన్ని మాత్రమే ఆశించాలి కానీ…స్నేహాన్ని ఆశించడానికి వారేమీ మదర్ థెరిస్సా ఛారిటీలో వాలంటీర్లు కాదు కదా!

హైదరాబాద్ లో పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి కె సి ఆర్…సంస్కారవంతమయిన పోలీసింగ్ ఉండాలని… స్నేహపూర్వకంగా ఉండాలని పోలీసులకు కర్తవ్య బోధ చేశారు.

కొన్ని దశాబ్దాల క్రితంతో పోలిస్తే ఇప్పటి పోలీసు స్టేషన్ రూపు రేఖలు మారాయి. గతంతో పోలిస్తే ఫ్రెండ్లిగానే ఉంటున్నారు. కానీ…ఇది చాలదు. ఇంకా చాలా మారాలి. జనసామాన్యంలో ఇప్పటికీ పోలీసులంటే గూడు కట్టుకుని ఉన్న భయాన్నే కే సి ఆర్ ప్రస్తావించారు.

ముప్పయ్ ఏళ్లుగా మీడియా, మీడియా వ్యాపారంలో ఉండడం వల్ల రోజూ నాకు పోలీసులను కలవక తప్పని పనులుంటాయి. సంగీత, సాహిత్యాల అభిరుచులు కలిసి దగ్గరయిన ఒకరిద్దరు పోలీసు ఉన్నతాధికారులు తప్ప మిగతావారందరితో నా అనుభవాలు బాధాకరమయినవే.

పేర్లు అనవసరం. ఒక పార్టీ మీటింగ్. ఏ గేట్లో అయినా ప్రవేశించడానికి మాకు పాస్ లు ఉన్నాయి. రోడ్డు మీద ఒక సి ఐ స్థాయి పోలీసు ఆపాడు. పాస్ చూపితే…దిగి…నడిచి వెళ్ళండి…అన్నాడు. ఇది మీడియా పాస్. మీ ఎస్ పి జారీ చేసినదే… ఈ కార్యక్రమం లైవ్ చేసేది మేమే. ఈ గేట్లో వెళితే పబ్లిక్ వెళ్లే చోటికే వెళ్లగలం…ఫలానా గేట్లో వెళితేనే స్టేజ్ దాకా వెళ్లగలం…అన్న నా మాటల్లో అంతులేని అహంకారం, సంస్కార రాహిత్యం, పచ్చి బూతులు, అమర్యాద, డ్యూటీలో ఉన్న పోలీసు అధికారిపై హత్యా ప్రయత్నం లాంటి నేరాలన్నీ అతడికి ఒకేసారి కనిపించాయి. అయితే మా ఎస్ పి నే అడుక్కోండి అని…ఇంకో మాట మాట్లాడితే బొడ్లో రివాల్వర్ తీసి కాలుస్తానన్నట్లు ఫోజు పెట్టి అడ్డంగా నిలుచున్నాడు. వ్యాపారం పోయినా పరవాలేదు…ప్రాణమే పోయేలా ఉంది అనుకుని…ఆయన స్నేహపూర్వకంగా ఆదేశించినట్లు కిలో మీటర్ నడిచి…పబ్లిక్ వెళ్లే గేట్లో వెళ్లి…మూడు చోట్ల దొంగల్లా బారికేడ్లు, గోడలు, ఫెన్సింగ్ వైర్లు ఎక్కి…దూకి స్టేజ్ దాకా వెళ్లాము. “సకల ప్రజాస్వామ్య బలం పోలీసు లాఠీ ముందు ఎందుకోగానీ నీరుగారిపోతుంది” అన్నది పతంజలి పరిశీలన.

ఇంకో మీటింగ్. ఇంట్లో మా అబ్బాయి ఖాళీగా ఉన్నాడని సరదాగా వాడిని కూడా తీసుకెళ్లాను. ఊరికి దూరంగా ఎడారిలో ఆ మీటింగ్. మధ్యాహ్నం భోజనం సమయానికి మా వాడితో మీడియాకు భోజనం పెడుతున్న చోటికి వెళితే…ఈ పాస్ కు పిండం ఇక్కడ కాదు అని ఒక పోలీసు స్నేహపూర్వకంగా అడ్డుకున్నాడు. నిర్వాహకులు మైకులో చెప్పి పంపితేనే వచ్చాము…ఇది ఆల్ యాక్సెస్ పాస్ అంటే…చెయ్ ఖాళీ లేదు పోతారా? లేదా? అని చెయ్యడ్డు పెట్టి…అడుక్కుతినేవారిని విదిలించినట్లు స్నేహపూర్వకంగా తరిమేశాడు. సింహం ఆకలితో చావనయినా చావాలి కానీ…గడ్డి మేయకూడదు అన్న భాస్కర శతక పద్యం చదువుకుంటూ…ఆది భిక్షువు వాడినేది అడిగేది అన్న సిరివెన్నెల పాటకు మా వాడికి అర్థం చెబుతూ రెండు గంటలు అన్నం కోసం రోడ్ల మీద పడి తిరిగితే ఎక్కడా దొరకలేదు. ఇద్దరం నీళ్లు తాగి…ఆ పూట పస్తులున్నాం. అప్పుడు మా వాడు అన్న మాట- నాన్నా మనకు ఒక పూట అన్నం లేకపోతే పోయింది కానీ…ఆ పోలీసు ప్రవర్తన మాత్రం చాలా అవమానకరంగా ఉంది- వద్దన్న తరువాత మనం మారు మాట్లాడకుండా వెనక్కు తిరిగాము కదా! వీళ్లు మారరా? అని. ఆ పోలీసు ఆ పూట నా నోటి కూడును అడ్డుకుంటే అడ్డుకున్నాడు కానీ…నేను రోజూ ఎలా రోడ్ల మీద అవమానాలు పడుతున్నానో మావాడికి తెలిసిందట.

ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయి కానీ…అవన్నీ అవమానాలే కాబట్టి తలుచుకోవడం దండగ. వీటికి భిన్నంగా ఇద్దరు, ముగ్గురు పోలీసు ఉన్నతాధికారుల ఆతిథ్యం, తోబుట్టువులా చూసుకోవడం, చేతనయిన సాయం చేయడాలను పదే పదే తలచుకోవడం పండగ.

పొట్టకూటి కోసం పోలీసు.వారి బాధలు వారివి. డ్యూటీలో కఠినంగా ఉంటూ మనసును కూడా కఠినంగా మలచుకుంటూ ఉంటారు. పోలీసు కంటే ముందు మనుషులం అన్న స్పృహ ఉన్నవారు లేకపోలేదు. మెత్తగా ఉన్నా, మాట్లాడినా నెత్తినెక్కి కూర్చుంటారు అన్నది మన నరనరాన జీర్ణమయిన భయం. అదే పోలీసులకూ అలవాటయ్యింది.

పోలీస్ టీ
పోలీస్ ట్రీట్మెంట్
పోలీస్ భాష
పోలీస్ మర్యాద
లాంటి వాడుక మాటలు వాడుకలో లేకుండా పోయే రోజులు నిజంగా వస్తాయా?
వస్తే…మంచిదే.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

వీఐపి వాహనాల ముసుగు

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com