కొన్ని విషయాలు దేవాతావస్త్రం కథలాంటివి. అందరికీ అన్నీ తెలుసు. కానీ…తెలియనట్లు ఉంటారు. లేదా తెలిసి తెలిసీ అందులోనే మునుగుతూ ఉంటారు. అలాంటి ఒకానొక శ్రమదోపిడీ కథ ఇది. ఓ కంపెనీల్లారా! పోటీలు పడి మా శ్రమను దోచుకోండి! అంటూ మనకు మనమే పోటీలు పడి అభ్యర్థించే గాథలివి.
సాఫ్ట్ వేర్ ఉద్యోగులు యాభై ఏళ్ళకే వృద్ధులైపోతున్నారంటూ తెలంగాణ శాసనసభలో సి పి ఐ శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేస్తూ అనేక విషయాలను ఏకరువు పెట్టారు.
1. ఒకప్పుడు సాఫ్ట్ వేర్ కొలువంటే క్రేజ్ ఉండేది. ఇప్పుడు వారిని చూస్తే జాలేస్తోంది.
2. వారి శక్తిని, యవ్వనాన్ని ఐ టీ కంపెనీలు కరగదీస్తున్నాయి. పీల్చి పిప్పి చేస్తున్నాయి.
3. ఎప్పుడు పని చేస్తారో? ఎప్పుడు పడుకుంటారో? ఇంట్లో కూడా ఆఫీస్ పని ఎందుకు చేస్తుంటారో? అర్థం కావడం లేదు.
4. యాభై ఏళ్ళకే ముసలివాళ్లవుతున్నారు. వింత వింత రోగాలబారిన పడుతున్నారు.
5. తెలంగాణాలో ఎన్ని ఐ టీ కంపెనీలున్నాయి? ఎన్ని లక్షల మంది ఐ టీ ఉద్యోగులున్నారు?
6. వారి పని గంటలేమిటి? ప్రభుత్వ కార్మిక చట్టాలు వారికి వర్తిస్తాయా? వారికున్న వసతులు, హక్కులను పర్యవేక్షించేదెవరు?
7. శ్రమ దోపిడీతో పాటు మేధో దోపిడీ కూడా జరుగుతోంది.
8. ఐ టీ కంపెనీలకు ఇన్నిన్ని రాయితీలిచ్చే ప్రభుత్వాలకు అసలు ఆ కంపెనీల ఉద్యోగ/కార్మిక విధానాలపై నియంత్రణ ఉందా?
వీటన్నిటికి ప్రభుత్వం ఏమి సమాధానం చెప్పిందో మీడియాలో ఎక్కడా వార్తగా రాలేదు. చెప్పినా రాలేదో! అసలు చెప్పలేదో! స్పష్టత లేదు. కనీసం ఈ విషయాలను చట్టసభలో ప్రభుత్వం దృష్టికి తెచ్చినందుకు, ప్రజలకు తెలిసేలా చేసినందుకు కూనంనేనిని అభినందించాలి.
ఫలానా పేరుగొప్ప ఐ టీ కంపెనీలో వెయ్యి మంది ఉద్యోగుల తొలగింపు;
ఫలానా అంతర్జాతీయ ఐ టీ కంపెనీ బెంగళూరు కేంద్రంలో మూడు వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన;
ఫలానా కంపెనీ ఉద్యోగుల ఊస్టింగ్ ఆర్డర్స్ ను మెయిల్/ఫేస్ బుక్/ఇన్స్టా/వాట్సాప్ లో పోస్ట్ చేసిన ఫలానా సి ఈ ఓ…అని లెక్కలేనన్ని వార్తలు మీడియాలో చూస్తూనే ఉన్నప్పుడు…ఈ విషయాలన్నీ ప్రభుత్వానికి తెలియకుండా ఎందుకుంటుంది? తెలుసు. తెలిసినా తెలియనట్లు, అది ప్రభుత్వానికి సంబంధం లేని ప్రయివేటు వ్యవహారమన్నట్లు ఊరికే గుడ్లప్పగించి చూస్తూ ఉంటుంది.
ఐ టీ ఉద్యోగాలంటే ఇలాగే ఉంటాయి. ఏ రోజు ఆఫీస్ నుండి “యూ ఆర్ ఫైర్డ్” అన్న సందేశం అందుకోవాల్సి వస్తుందోనన్న భయంతోనే పనిచేస్తూ ఉండాలన్న సామాజిక అంగీకారం కూడా వచ్చినట్లుంది.
నెలకు పాతిక వేలు జీతమొచ్చే ఐ టీ ఉద్యోగి అయిన పట్టణ యువకుడిని పెళ్ళి చేసుకోవడానికి ఇష్టపడే అమ్మాయిలు పదెకరాల వ్యవసాయంతో నెలకు లక్ష రూపాయలు సంపాదించే గ్రామీణ రైతును పెళ్ళి చేసుకువడానికి ఇష్టపడడం లేదు కాబట్టి…దేశంలో యువకులందరూ పట్టణాల్లో, మహానగరాల్లో ఐ టీ ఉద్యోగాలే చేయాల్సి వస్తోంది. ఒక కార్యకర్త ఈ బాధను చెప్పుకుంటే మహారాష్ట్రలో ఒక ఎమ్మెల్యే రైతులయిన కార్యకర్తలకు పెళ్ళి సంబంధాలు చూసే బాధ్యతను నెత్తిన వేసుకున్న కథలను ఈమధ్యే విన్నాం. (ఆ కథనానికి సంబంధిన లింక్)
అసలే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏ.ఐ. రోజులు. బెంగళూరులో ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగానికి ఇంటర్వ్యూలో అభ్యర్థిని ఏ.ఐ. కంటే వేగంగా, సృజనాత్మకంగా నువ్వెలా పనిచేయగలవో! నిరూపించుకో! అని అడిగితే అతడు స్పృహదప్పి పడి…ఇప్పటిదాకా లేవలేదు. ఇక లేవలేడు కూడా!
బయట ఏ ఐ తో పోటీ పడాల్సిన వాస్తవ పరిస్థితి ఉంటే…వామపక్ష కూనంనేని ఇంకా పని గంటలు, కార్మికుల హక్కులు, వేతనాలు, వీక్లీ ఆఫ్, పి ఎఫ్, ఈ ఎస్ ఐ లాంటి పాతరాతియుగపు పని పరిభాష మాట్లాడుతున్నారు- పాపం!
కొస మెరుపు:-
యాభై ఏళ్ళకు వార్ధక్యం అని కూనంనేని కొంచెం ఉదారంగా సంఖ్యను పెంచినట్లున్నారు కానీ…పని ఒత్తిడి, నిద్రలేని పనులతో నిజానికి 35, 40 లలో కూడా వృద్ధులైన ఐ టీ ఉద్యోగులు కనిపిస్తారు!
ఐ టీ వెలుగుల్లో ఇలాంటి క్రీనీడలెన్నో!
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
వారానికి 90గంటలు పనిచేయాలని ఒకాయన; ఎప్పుడూ భార్య మొహం ఏమి చూస్తారు? ఎప్పుడూ పనే చేస్తూ ఉండండి అని ఒకాయన అన్నప్పుడు రాసిన కథనం లింక్:-
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు