Lokesh Letter:
రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిర్వాకానికి గ్రామ పంచాయతీలు నిర్వీర్యమై పోయాయని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, పారిశుధ్య నిర్వహణ, లైటింగ్ తదితర అభివృద్ధి పనుల కోసం 14, 15 ఆర్ధిక సంఘాల ద్వారా కేటాయించిన నిధులు 1309 కోట్ల రూపాయలను దారి మళ్ళించడం దారుణమని వ్యాఖ్యానించారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లోకేష్ లేఖ రాశారు.
కేంద్రం నేరుగా పంచాయతీలకు ఇచ్చిన నిధులను పంచాయతీ సర్పంచ్, పాలక వర్గాలకు తెలియకుండా వాటి ఖాతాల నుంచి మళ్ళించడం రాజ్యంగ విరుద్ధమని, ఇది స్థానిక సంస్థల ప్రతినిధులను మోసం చేయడమేనని లోకేష్ విమర్శించారు. ఈ విషయం బైటికి వచ్చిన తరువాత విద్యుత్ ఛార్జీల బకాయిల కింద 14వ ఆర్ధిక సంఘం నిధులు 344 కోట్ల రూపాయలను జమ చేసుకున్నామని రాష్ట్ర ఆర్ధిక మంత్రి చెప్పడం బాధ్యతా రాహిత్యమని మండిపడ్డారు. ఆదాయం లేని మైనర్ పంచాయతీల వీధి దీపాలకు 1984 లో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఉచిత విద్యుత్ పథకం ప్రవేశ పెట్టారని, ఆ తర్వాత చంద్రబాబు, వైఎస్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు దాన్ని కొనసాగించారని, కానీ జగన్ ప్రభుత్వం దాన్ని ఎత్తి వేస్తూ వారి బకాయిల కింద ఈ నిధులను జమ చేసుకోవడం దారుణమైన విషయమన్నారు. 14,15 ఆర్ధిక సంఘం నిధులు రూ. 344 కోట్లు, రూ. 965 కోట్లను వెంటనే పంచాయతీల ఖాతాల్లో జమ చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు. పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసే రాజ్యాంగేతర చర్యలు మానుకోవాలని, ఏకగ్రీవం అయిన పంచాయతీలకు విడుదల చేయాల్సిన నిధులను వెంటనే విడుదల చేసి గ్రామాల అభివృద్ధికి సహకరించాలని లోకేష్ హితవు పలికారు.