Brighter than a thousand suns, Deadlier than a thousand grim reapers
ఆగష్టు 9, 1945. విశ్వశాంతికి , సాoకేతిక నైపుణ్యానికి పేరుగాంచిన అమెరికా బలప్రదర్శనతో తన ఆధిపత్యాన్ని చాటిచెప్పుకున్న రోజు. 1932లో హిట్లర్ జర్మనీ నియంతగా మారిన రోజు నుండి ఆ దేశపు స్థితిగతులు విషమించడంతో చాలా మంది యూదులు వారి మాతృభూమి నుంచి పారిపోయారు. ఇలా పారిపోయిన వారిలో మేధావులు లెక్కలేనంతమంది . అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వారికి ఆశ్రయం ఇచ్చింది అమెరికా. నేడు మన దేశపు యువత అమెరికాకు మెరుగయిన అవకాశాల కోసం వెళ్ళే దృక్పథానికి బీజం పడింది ఈ సమయంలోనే. ఐన్ స్టీన్ లాంటి ఎందరో గొప్ప శాస్త్రవేత్తలు అమెరికాలో నివసించడానికి ఆ దేశాన్ని శరణుకోరారు. ఈ రోజుకి అమెరికా అంటే అంతే డిమాండ్, అంతే క్రేజ్.
ఒక దేశంగా ఇంత ఖ్యాతిని , బలాన్ని సాధించడానికి కారణాలు అనేకం. కానీ ముఖ్యమైన కారణం ప్రతిభను గుర్తిచడం. ఏ దేశంవారైనా వారి ప్రతిభ అమెరికా కంట పడిందంటే…వెయ్యి కళ్లతో అలాంటి ప్రజ్ఞావంతులను స్వాగతిస్తుంది. అలాగే 2వ ప్రపంచ యుద్ధ సమయంలో భౌతిక శాస్త్రంలో పేరుగాంచిన శాస్త్రవేత్తలకు ఆశ్రయం ఇవ్వడమే అమెరికాకు యుద్ధంలో మొదటి విజయం.
1900 నుండి 1930 వరకు యూరప్లో సంభవించిన సాంకేతిక పరిశోధన నభూతో. ఆది నుండి మనిషిని వెంటాడుతున్న ఎన్నో ప్రశ్నలకు చిత్రవిచిత్రమైన సమాధానాలు దొరికిన కాలం అది. అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండాలను నడిపే సిద్ధాంతాలను సాధించి , శోధించిన పరిశోధకులు చాలా మంది యూరోప్ కు చెందిన యూదులు అవడం వల్ల హిట్లర్ దారుణాలకు బలయ్యేలోపే విపత్తును గ్రహించి వేరే దేశాలకు వెళ్లిపోయారు. సాంకేతికంగా అంత బలంలేకపోయినా ఆర్థికంగా అమెరికా ఎంతో శక్తివంతమైనది. తన ఆర్థిక బలంతో అత్యాధునిక విశ్వవిద్యాలయాలను తయారు చేశారు. శాస్త్రవేత్తలు కోరుకునే స్వతంత్రమైన పరిశోధనా ప్రాధాన్యం ఉన్న యూనివర్సిటీలు లెక్కలేనన్ని ఉండడం వల్ల జర్మనీ తదితర యూరోప్ దేశాలలో వివక్షకు లోనవుతున్న మేధావులు అమెరికాలో స్థిరపడ్డారు. వందలమంది వేరువేరు దేశాలనుండి వస్తున్నా అమెరికా ప్రభుత్వం బెదరలేదు. ఎందుకంటే మానవ మేధస్సుకు మచ్చుతునకలైన వారి వల్ల కాలక్రమేణ దేశానికే ఎంతో మేలు జరుగుతుందని వారు ముందే గ్రహించారు. వారు అనుకున్నదే జరిగింది.
1930ల వరకు ప్రపంచంలో ఎవ్వరూ అణ్వాయుధాలను తయారు చెయ్యడం సాధ్యమే కాదు అనేవారు. కానీ శ్రీశ్రీ చెప్పినట్టు ” నిన్న స్వప్నం నేటి సత్యం”. 1942లో ఎక్కడ జర్మనీ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తుందేమో అన్న భయంతో ఐన్ స్టీన్ వంటి వారు అప్పటి అమెరికన్ అధ్యక్షుడికి వారి భయాన్ని తెలియజేశారు. దాని ఫలితంగా మొదలైనదే “The Manhattan Project” . ఇది అత్యంత రహస్యమయిన ఆయుధ తయారీ పరిశోధన. ఈ కార్యక్రమంలో వలస వచ్చిన ఎందరో ఫిజిక్స్ నిష్ణాతులు చేరారు. ఎవరికీ తెలియకుండా మూడేళ్ల పాటు శ్రమించి అణుబాంబును సిద్ధం చేసారు. అంతా రెడీ అయిన సమయానికి హిట్లర్ ఆత్మహత్య చేసుకోవడంతో, మిగిలింది జపాన్ కాబట్టి ఆగష్టు 6 1945న హిరోషిమా , ఆగష్టు 9న నాగసాకి మీద ప్రపంచంలో ఎన్నడూ లేని బాంబులను వాడారు. క్షణకాలంలో లక్షలమంది భస్మీపటలం అయ్యారు.
దాంతో ఆ యుద్ధం ముగిసింది…అప్పుడే మరో యుద్ధం మొదలైంది. అణ్వాయుధాల వల్ల అమెరికా రష్యాల మధ్య ఇబ్బందులు వస్తాయని ముందే గ్రహించిన శాస్త్రవేత్తలు ఈ బాంబు డిజైన్ను రష్యా వంటి అగ్రదేశాలకు పంచితే అందరూ బలవంతులవుతారని, దాని వల్ల కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయని సూచించినా…అప్పటి అమెరికన్ ప్రభుత్వం పట్టించుకోకపోడమే ఆయుధాల వేట మాటున ప్రచ్ఛన్న యుద్ధానికి దారి తీసింది.
శాస్త్రవేత్తలు బ్రహ్మాండపు రహస్యాలను అపారమైన ఊహశక్తి , కృషితో కనుక్కుంటారు. జ్ఞానామృతంలో మునిగితేలాల్సిన మానవాళి శాస్త్రవేత్తల పరిశోధనా ఫలితాలను యుద్ధాలలో ఉపయోగించడం వల్లే ఎందరో అమాయకులు బలవుతారు .
నాగరికతను జ్ఞానపథంలో నడపాలనుకునే శాస్త్రవేత్తలే సమస్త మానవాళికి ముప్పు తెచ్చి పెట్టే ఆయుధాన్ని కనుక్కోవడం వారిని ఎంతో బాధ, పశ్చాత్తాపంలో ముంచేసింది. ఈ ఆయుధo వల్ల రాబోయే తరాలకు జరిగే నష్టాన్ని శాస్త్రవేత్తలు గ్రహించి, గుండెలు బాదుకోగా…నేడు అణ్వాయుధాల వాడకం మీద ఎన్నో ఆంక్షలు ఏర్పడ్డాయి. వారి ఆత్మఘోషకు సిరివెన్నెల మాట సరిపోతుంది:-
” ప్రేమను మించిందా బ్రహ్మాస్త్రమైనా?ఆయువు పోస్తుందా ఆయుధమేదైనా?రాకాసుల మూకల్లె మార్చద పిడివాదం? రాబందుల రెక్కల సడి ఏ జీవన వేదం?”
-పమిడికాల్వ సుజయ్
Also Read :