Sunday, January 19, 2025
HomeసినిమాRam Pothineni: రామ్ కి ద్విపాత్రాభినయం వర్కౌట్ అయిందా?

Ram Pothineni: రామ్ కి ద్విపాత్రాభినయం వర్కౌట్ అయిందా?

రామ్ హీరోగా బోయపాటి తెరకెక్కించిన ‘స్కంద’ సినిమా, క్రితం నెల 28వ తేదీన విడుదలైంది. భారీ బడ్జెట్ సినిమా .. పైగా ‘అఖండ’ తరువాత బోయపాటి నుంచి వచ్చిన సినిమా కావడంతో అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించారు. ఈ సారి తప్పకుండా మాస్ హిట్ కొట్టాలని రామ్ భావించడం .. ప్రస్తుతం గ్లామరస్ బ్యూటీగా తన జోరును కొనసాగిస్తున్న శ్రీలీల నటించడం .. తమన్ సంగీతాన్ని సమకూర్చడం ఈ సినిమాపై అంచనాలు పెంచేశాయి. అందువలన ఆ రోజున థియేటర్లకు దగ్గర కాస్త సందడి కనిపించింది.

ఇది ఇద్దరు స్నేహితుల కథ .. ఆ స్నేహితులుగా ఈ సినిమాలో శ్రీకాంత్ – దగ్గుబాటి రాజా కనిపిస్తారు. అలాగే ఇది తండ్రీ కొడుకుల అనుబంధంతో ముడిపడిన కథ. దగ్గుబాటి రాజా తనయుడిగా రామ్ కనిపిస్తాడు. తన తండ్రి స్నేహితుడిని కాపాడటం కోసం .. తాను ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం రెండు రాష్ట్రాల ముఖ్య మంత్రులకు హీరో ఎదురెళ్లడం ప్రధానమైన కథాంశం. ఈ మూడు అంశాల చుట్టూనే ఈ కథ తిరుగుతుంది. కథకి తగినట్టుగానే రామ్ చెలరేగిపోయాడు. బోయపాటి తన మార్కు నుంచి అంగుళం కూడా పక్కకి వెళ్లకుండా చేశాడు.

అయితే రెండు రాష్ట్రాల ముఖ్య మంత్రులను విలన్స్ గా చూపించడమనేది ఆడియన్స్ కి కాస్త హెవీ డోస్ గా అనిపిస్తుంది. కథకి ఆ స్థాయి బూస్ట్ అవసరం లేదు. పైగా అధికారంలో ఉన్న ఇద్దరు ముఖ్యమంత్రుల విలనిజాన్ని ఒక రామ్ తట్టుకోలేడని బోయపాటికి అనిపించిందేమో, మరింత రఫ్ లుక్ తో మరో రామ్ ను రంగంలోకి దింపాడు. అయితే ఈ రామ్ ఎవరు? కొంపదీసి చిన్నప్పుడు తిరణాల్లో తప్పిపోయి ఇప్పుడు తిరిగొచ్చాడా? ఫస్టు హీరో ఫ్యామిలీలోని వాడేనా? అనే డౌట్ ఆడియన్స్ కి వస్తుంది.

ఎందుకంటే అలాంటి సినిమాలు వాళ్లు చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగారు. అన్నీ చెప్పేస్తారా ఏంటి అన్నట్టుగా బోయపాటి ఈ విషయం మాత్రం తేల్చలేదు. ఇంతకంటే ముందు ఇంతకంటే ఘనకార్యమే చేశాడని చెబుతూ, చివరి నిమిషంలో కూడా ఆ పాత్రను ఆకాశంలో నిలబెట్టాలని చూశాడు. అసలు ‘స్కంద’ టైటిల్ ఎందుకు పెట్టారు? ‘స్కంద’ ఎవరు? అనేది తేల్చకుండానే బోయపాటి శుభం కార్డు వేశాడు. ‘రెడ్’ మాదిరిగానే రామ్ కి డ్యూయెల్ రోల్ వర్కౌట్ కాలేదని అంటున్నారు. యాక్షన్ పాళ్లు ఎక్కువ కావడమే ఎసరు తెచ్చిందనేది ఆడియన్స్ టాక్.

RELATED ARTICLES

Most Popular

న్యూస్