IT Is State Government To Take Lead For Vizag Steel Plant Pawan Demanded :

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వారంరోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసి ప్రైవేటీకరణ ఆపడానికి ఏం చేయబోతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ- విశాఖ ఉక్కు నిర్వాసితుల ఐక్యవేదిక ఆధ్యర్యంలో కూర్మన్న పాలెం వద్ద ఏర్పాటు చేసిన ‘విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు’ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ‘అఖిలపక్ష సమావేశానికి స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతలు, నిర్వాసితులు, మేధావులు, బిజెపి, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, మీ బెస్టెస్ట్ ఫ్రెండ్స్ టిడిపి నాయకులను కూడా పిలవండి, నేనంటే మీకు ఇష్టం లేకపోయినా మా పార్టీని కూడా పిలవండి’ అని సూచించారు. ఇన్ని పార్టీలు కలిసి వచ్చి పోరాటం చేస్తే  తీవ్రత కేంద్ర ప్రభుత్వానికి అర్ధం అవుతుందని, అసలు మన ప్రయత్నం మనం చేయకుండా కేంద్రంపై నెపం నెట్టడం భావ్యం కాదని అన్నారు. వైసీపీ ఈ ప్రతిపాదనకు స్పందించకపోతే వచ్చే రెండేళ్ళూ గడ్డు పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

విశాఖ ఉక్కు ఎవరి దయా దాక్షిణ్యాలతోనో, ఎవడో పడేస్తే వచ్చింది కాదని, పోరాడి సాధించుకున్నామని, పీలేరు నుంచి పలాస దాకా, విశాఖ నుంచి వరంగల్ దాకా 32 మంది నిండు నూరేళ్ళు బతకాల్సిన యువకుల బలిదానాలతో వచ్చిందని గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం ఆంధ్రుల ఆత్మగౌరవం కాపాడుకోవడం లాంటిదన్న విషయం ప్రతిఒక్కరూ గుర్తుంచుకోవాలని పిలుపు ఇచ్చారు.

ప్రజల సమస్యలు, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై పోరాడలేని ఎంపీలను ఎన్నుకుంటే ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన సమయంలో విశాఖ ఉక్కుకు సొంత గనులు కావాలని మన ఎంపీలు పోరాడి ఉంటే వచ్చి ఉండేవని అభిప్రాయపడ్డారు.

వైసీపీ మాటలకు అర్ధాలే వేరులే అని పవన్ వ్యంగాస్త్రాలు సంధించారు.

వారు సంపూర్ణ మద్యపాన నిషేధం అంటే సంపూర్ణంగా మద్యం అమ్ముతామని…

విద్యార్ధులకు అండగా ఉంటామని చెబితే, ఎయిడెడ్ స్కూళ్ళను మూసివేసి, ఆస్తులు స్వాధీనం చేసుకొని రెండు లక్షల మంది విద్యార్ధులను రోడ్డుమీదకు ఈడుస్తామని…

రైతుకు రూ. 12,500 సాయం ఇస్తామని అంటే కేంద్రం ఇచ్చే 6వేల రూపాయలు కలుపుకుని ఇస్తామని….

అందరికీ ఆరోగ్య శ్రీ అంటే.. కోవిడ్ వచ్చి చస్తున్నామని అంటే బ్లీచింగ్ పౌడర్ చల్లుకోమని…

జాబ్ క్యాలండర్ ఇస్తామంటే జాబులు లేకుండా చేయడమని…  అన్నారు.

తనను చాలామంది  సైద్ధాంతిక మూర్ఖుడని అంటారని, దానికి నేనేమీ బాధపడబోనని, అయితే తాను అవినీతి నాయకుణ్ణి మాత్రం కాదని, స్వాతంత్ర్య సమరయోధులను ఆదర్శంగా తీసుకున్నవాడినని పేర్కొన్నారు. ఇప్పుడున్న నాయకులు ప్రజల్లో తిరిగే వారు కాదని, ఓట్ల సమయంలో వచ్చి ఒక్కో ఓటుకు రెండువేలు, మూడువేలు ఇచ్చి గెలుస్తారని, కానీ సమస్యలు వచ్చినప్పుడు ఓడిపోయిన తామే వచ్చి పోరాడాల్సి వస్తోందని…. జనసేన, జన సైనికులు, వీర మహిళలు ప్రజల వైపున నిలబడడానికి తయారుగా ఉంటామని వెల్లడించారు.

ప్రత్యేక తరగతి హోదా కోసం తాను పోరాటం చేస్తున్నప్పుడు తన వెంట ఎవరూ వచ్చి నిలబడలేదని, తనను, జన సైనికులను ఒంటరివాళ్ళను చేసి వదిలేశారని, నిండుకుండ తీసుకువెళ్తుంటే తూట్లు పొడిచే విధంగా ప్రవర్తించారని, ఆఖరికి కేంద్రప్రభుత్వానికి తాను శత్రువునయ్యనని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ కోసం నిలబడి పోరాటం చేద్దామన్నా తనకు అదే భయం నెలకొనిఉందని, తన వెంట ప్రజలు నిలబడతారా అనే అనుమానం ఉందని… ‘మీరు నిలబడి చూపించండి నేను మీ వెనక నిలబడతా’ అని ప్రకటించారు. ఇది తన ఒక్కడి సమస్య కాదని మీరు కలిసి వస్తేనే పోరాడతానని తేల్చి చెప్పారు. ‘మీకు కోపం వచ్చే వరకూ వేచి ఉంటానని, కోపం వచ్చినప్పుడు పిలవండి నేను నిలబడతా’ అన్నారు.

విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు, జై ఆంధ్రా అనే నినాదాలతో పవన్ తన ప్రసంగాన్ని ముగించారు.

అంతకుముందు విశాఖ విమానాశ్రయం నుంచి భారీ ర్యాలీతో  పవన్ కళ్యాణ్ సభా స్థలికి చేరుకున్నారు.

Must Read :అప్పులు ఏమైపోతున్నాయి? : పవన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *