యంగ్ హీరో సోహైల్, రూపా కొడవయూర్ హీరో హీరోయిన్లుగా మైక్ మూవీస్ బ్యానర్ మీద అప్పి రెడ్డి, రవి రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. ఈ సినిమాకి శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వం వహించారు. ఈ నెల 18న ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను అక్కినేని నాగార్జున విడుదల చేశారు.
ఈ సందర్భంగా హీరో సోహైల్ మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకుల్లో నాకు దక్కిన గుర్తింపునకు నాగార్జున గారే కారణం. ఆయన బిగ్ బాస్ లో మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేశారు. సొంత వాళ్లలా చూసుకున్నారు. నాకు డల్ గా అనిపిస్తే నాగార్జున గారే ధైర్యం చెబుతారు. ఈ సినిమా గ్లింప్స్ ఆయనకు చూపించి, ట్రైలర్ రిలీజ్ కు రావాలని కోరాను. ఆయన తప్పకుండా వస్తా అన్నారు. గుర్తు పెట్టుకుని మరీ ఇవాళ వచ్చారు. నాగ్ సార్ కు ఎంత థాంక్స్ చెప్పినా తక్కువే. తొమ్మిది నెలలు బిడ్డను మోసి కనేందుకు తల్లి ఎంత కష్ట పడుతుందో మనం వింటుంటాం. కానీ ఆ కష్టాన్ని ఒక అబ్బాయిగా నా పాత్ర ద్వారా చూపించబోతున్నాను. చాలా మంచి మూవీ. ఎమోషన్, ఎంటర్ టైన్ మెంట్ రెండూ ఉంటాయి. ఈ సినిమా చూశాక ఇంటికి వెళ్లి అమ్మను హగ్ చేసుకుంటారు. ఫ్యామిలీతో కలిసి మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా చూడండి అన్నారు.
అక్కినేని నాగార్జున మాట్లాడుతూ… బిగ్ బాస్ లో కప్పు గెలవకుండానే విన్నర్ అయ్యాడు సోహైల్. చాలా తెలివైన వాడు. ప్రతి గేమ్, ప్రతి టాస్క్ కష్టపడి ఆడేవాడు. గెలవాలనే తపన అతనిలో కనిపించేది. అలాంటి పట్టుదలతోనే ఈ సినిమా చేశాడు. మిస్టర్ ప్రెగ్నెంట్ అనగానే మగవాళ్లు ప్రెగ్నెంట్ ఎలా అవుతారు.? అది సినిమాలో ఎలా చూపించారు..? అనే ఆసక్తి కలిగింది. ట్రైలర్ చాలా బాగుంది. ట్రైలర్ చూశాక సినిమా చూడాలనే ఆసక్తి ఏర్పడింది. ట్రైలర్ ఎమోషనల్ గా ఉంది. దర్శకుడు శ్రీనివాస్ కు ఇది ఫస్ట్ మూవీ. ఆయనే స్క్రిప్ట్ రాశాడు. డిఫికల్ట్ సబ్జెక్ట్ ఇది. బాగా తెరకెక్కించాడని అర్థమవుతోంది. ఈ సినిమా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అప్పిరెడ్డి గారు, వాళ్ల బ్రదర్, ఫ్రెండ్స్ అందరూ నా గురించి మాట్లాడిన మాటలకు థాంక్స్. మైక్ మూవీస్ లో నాలుగో సినిమా ఇది. సక్సెస్ అవ్వాలని హార్ట్ ఫుల్ గా కోరుకుంటున్నాను. డెలివరీ అంటే ఒక ప్రాణం పోయడం. అఖిల్ డెలివరీ టైమ్ లో ఆరు నెలలు ఏ షూటింగ్స్ పెట్టుకోకుండా అమలతోనే ఉన్నాను. ఆ టైమ్ నా లైఫ్ లో బెస్ట్ మూమెంట్” అన్నారు.